Business

కృత్రిమ మేథ ఉపయోగాలు పెరుగుతున్న నేపథ్యంలో టీసీఎస్‌ కీలక నిర్ణయం

కృత్రిమ మేథ ఉపయోగాలు పెరుగుతున్న నేపథ్యంలో టీసీఎస్‌ కీలక నిర్ణయం

కృత్రిమ మేథ (Artificial Intelligence- AI) వాడకం పెరుగుతున్న నేపథ్యంలో దేశీయ అతిపెద్ద ఐటీ సేవల ఎగమతుల సంస్థ ‘టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS)’ కీలక నిర్ణయం తీసుకుంది. తమ కంపెనీలో పని చేస్తున్న ఐదు లక్షల మంది సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లకు ‘జనరేటివ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (Gen AI)’ అవకాశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపింది.

ప్రస్తుతం జెన్‌ ఏఐ (Gen AI) ప్రాథమిక దశలో ఉందని.. దీని వాడకం ఇంకా విస్తృతం కాలేదని కంపెనీలోని ‘ఏఐ.క్లౌడ్‌’ విభాగాధిపతి శివ గణేశన్‌ తెలిపారు. ఈ దశలోనే తమ సిబ్బందికి శిక్షణనివ్వడం సమంజసమని తాము భావిస్తున్నట్లు పేర్కొన్నారు. తద్వారా భారీ మార్పులు రాకముందే ఉద్యోగులు దాన్ని ఉపయోగించుకునే స్థాయిలో ఉంటారని వివరించారు. ఇప్పటికే 250 జెన్‌ ఏఐ (Gen AI) ప్రాజెక్టుల్లో నిమగ్నమైన టీసీఎస్‌ (TCS).. ఈ అత్యాధునిక సాంకేతికత సాయంతో పనిని వేగంగా పూర్తి చేస్తున్నట్లు తెలిపారు.

ఈ శిక్షణ పూర్తి చేయడానికి కచ్చితమైన సమయమేమీ నిర్దేశించుకోలేదని శివ గణేశన్‌ తెలిపారు. అయితే, 1.50 లక్షల మందికి ఇప్పటికే ఏఐ నైపుణ్యాలను అందించామని అందుకు ఏడు నెలలు పట్టిందని వెల్లడించారు. దీని ఆధారంగా మొత్తం సిబ్బందికి శిక్షణ ఇవ్వడానికి ఎంత సమయం కావాలో అంచనా వేయొచ్చని వివరించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z