Movies

రాబోయే ఎన్నికల్లో శివాజీ పాత్ర ఉంటుందా?

రాబోయే ఎన్నికల్లో శివాజీ పాత్ర ఉంటుందా?

టాలీవుడ్ నటుడు శివాజీ సినిమాలతో తెచ్చుకున్న గుర్తింపు కంటే ఏపీ రాజకీయాల్లో తెచ్చుకున్న గుర్తింపే ఎక్కువని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయిన తరువాత శివాజీ ఆంధ్రా రాజకీయాల్లో చాలా చురుగ్గా ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై అనేక డిబేట్స్ పెట్టి అధికారిక పార్టీ నుంచి విపక్ష పార్టీ వరకు.. చంద్రబాబు నాయుడు నుంచి పవన్ కళ్యాణ్ వరకు ప్రతి ఒక్కర్ని నిలదీశారు.

అయితే ఈమధ్య కాలంలో రాజకీయాల్లో కొంచెం ఇనాక్టీవ్ అయ్యారు. ఆ తరువాత బిగ్‌బాస్ హౌస్ లో కనిపించడం, రీసెంట్ గా 90s వెబ్ సిరీస్ తో సూపర్ హిట్ అందుకొని టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యిపోయారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ సక్సెస్ మీట్ జరిగింది. ఇక ఈ ఈవెంట్ లో శివాజీని ఏపీ రాజకీయాల గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. త్వరలో ఏపీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈసారి శివాజీ పాత్ర ఏంటి, శివాజీ సినిమాల్లో చూస్తామా లేదా క్రిందటిసారిలా రాజకీయాల్లో చూస్తామా అని అడిగారు

దీనికి శివాజీ బదులిస్తూ.. “నేను డైరెక్ట్ పాలిటిక్స్ లో ఎప్పుడు పాల్గొనలేదు. నేను ఎప్పుడు ప్రజల సమస్యల మీదనే పోరాడాను. అంతేతప్ప నాకు ఏ రాజకీయ పార్టీతో ఎటువంటి సంబంధం లేదు. చంద్రబాబు, జగన్‌, కేసీఆర్‌తో నాకు ఏ బంధం లేదు. కానీ నన్ను రాజకీయాల్లోకి లాగరా.. నేను ఆ పార్టీల దూల తీర్చేస్తాను. నేను నిజాలు మాట్లాడుతాను. అలా మాట్లాడడం రాజకీయాల్లో పనికిరాదు.

నన్ను ఏ పార్టీ వాళ్ళు ఓన్ చేసుకున్నా, నేను మాట్లాడే మాటలు వల్ల వాళ్లే ఇబ్బంది పడతారు. అందుకనే నేను ఏ పార్టీకి చెందిన వాడిని కాదు. శివాజీ ప్రజల గొంతు. అయితే ప్రస్తుతం నాకు పాలిటిక్స్ కంటే నా పిల్లల కోరికే ముఖ్యం. వాళ్ళు నన్ను యాక్ట్ చేయమని కోరారు. అందుకనే సినిమాల్లోనే కొనసాగుతా. కానీ ప్రజలకు సమస్య వచ్చినప్పుడు మాత్రం కచ్చితంగా వెళ్తాను. ఆ సమస్యపై పోరాడతాను. ప్రజల మాటని నా గొంతుతో వినిపిస్తాను” అంటూ పేర్కొన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z