Editorials

దక్షిణాదిలో అత్యంత కాలుష్య మెట్రో నగరంగా హైదరాబాద్‌

దక్షిణాదిలో అత్యంత కాలుష్య మెట్రో నగరంగా హైదరాబాద్‌

హైదరాబాద్‌ మహా నగరంలో పెరుగుతున్న వాతావరణ కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకున్నది. దక్షిణ భారతదేశంలో అత్యంత కాలుష్య మెట్రో నగరంగా మారిందని గ్రీన్‌ పీస్‌ ఇండియా తాజా అధ్యయనంలో వెల్లడైంది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌, కొచ్చి వంటి దక్షిణ భారత మెట్రో నగరాల్లో వాయు కాలుష్యం స్థాయిని తెలుసుకోవడానికి గ్రీన్‌పీస్‌ ఆఫ్‌ ఇండియా సంస్థ సర్వే నిర్వహించింది. ఇతర నగరాల కంటే భాగ్యనగరంలో వాయుకాలుష్యం ఎక్కువగా ఉన్నట్టు తేలింది. హైదరాబాద్‌లో 2.5 పీఎం కాలుష్య కారకాలు ఉన్నట్టు వెల్లడైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నిర్దేశించిన ప్రమాణాల కంటే మన నగరంలో కాలుష్యం 14 రెట్లు అధికంగా విడుదలవుతున్నది. ప్రపంచ వాయు నాణ్యత సూచీలో కాలుష్య నగరాల జాబితాలో భాగ్యనగరం చేరడం అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నది. బంజారాహిల్స్‌లో 127, కేపీహెచ్‌బీలో 124, జూపార్క్‌లో 144, సైదాబాద్‌లో 100 ఏసీఐలకు వాయుకాలుష్యం చేరుకున్నది. పరిశ్రమలు ఎక్కువగా ఉన్న మల్లాపూర్‌, నాచారం, బాలానగర్‌, పటాన్‌చెరు, పాశమైలారం ప్రాంతాల్లోనూ ఇటీవల వాయుకాలుష్యం అనూహ్యంగా పెరిగింది. దేశంలోని అత్యంత కాలుష్య నగరాల జాబితాలో న్యూఢిల్లీ అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాత కోల్‌కతా, హైదరాబాద్‌ ఉన్నాయి. ముంబై కంటే భాగ్యనగరంలో వాయుకాలుష్యం ఎక్కువగా ఉండటం గమనార్హం. హైదరాబాద్‌ నగరంలో ప్రతిరోజు 7 వేల మెట్రిక్‌ టన్నుల చెత్త విడుదలవుతుండటంతో అధికంగా కాలుష్యం పెరుగుతున్నదని గ్రీన్‌ పీస్‌ ఇండియా సంస్థ తన సర్వేలో గుర్తించింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z