Business

ప్యాసింజర్ రైళ్లు కనుమరుగు

ప్యాసింజర్ రైళ్లు కనుమరుగు

ప్యాసింజర్‌ రైళ్ల శకం ముగిసినట్లే కనిపిస్తున్నది! భారతీయ రైల్వే వీటిని ఎక్స్‌ప్రెస్‌ స్పెషల్స్‌గా నడుపుతూ, టికెట్‌ ధరలను అమాంతం పెంచేస్తున్నది. అన్ని స్టేషన్లలోనూ ఆగుతూ ప్రయాణించే ప్యాసింజర్‌ రైళ్లను నమ్ముకున్న కూలీలు, చిరు వ్యాపారులు వంటి అల్పాదాయ వర్గాలవారిని ఈ పరిణామాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ప్యాసింజర్‌ రైళ్లలో సెకండ్‌ క్లాస్‌ ఆర్డినరీ టికెట్‌కు చెల్లు చీటీ రాశారు. ఎక్స్‌ప్రెస్‌ స్పెషల్స్‌లో ప్రయాణించేవారి నుంచి ఎక్స్‌ప్రెస్‌ రైలు చార్జీలను వసూలు చేస్తున్నారు. అంటే, అంతకు ముందు ప్యాసింజర్‌ రైళ్ల టికెట్‌ ధరకు దాదాపు రెట్టింపు వసూలు చేస్తున్నారు. బోగీలు, రూట్లు, వేగం, స్టాపేజీలలో ఎటువంటి మార్పులు లేకపోయినా అధిక చార్జీలను వసూలు చేస్తున్నారు. సదరన్‌ రైల్వే ఇప్పటికీ బుకింగ్‌ కౌంటర్ల వద్ద సెకండ్‌ క్లాస్‌ ఆర్డినరీ టికెట్‌ చార్జీలతో బోర్డులను ప్రదర్శిస్తున్నది. కానీ ఈ చార్జీలు ప్రస్తుతం అమల్లో లేవు. ఓ స్టేషన్‌లోని టికెట్‌ బుకింగ్‌ క్లర్క్‌ మాట్లాడుతూ, ప్రయాణికులు ఈ బోర్డులను చూపించి, రెట్టింపు చార్జీ ఎందుకు చెల్లించాలని ప్రశ్నిస్తూ, తమతో ఘర్షణ పడుతున్నారని, ప్యాసింజర్‌ రైళ్లు లేవని వారికి అర్థం కావడం లేదని చెప్పారు. యూటీఎస్‌ యాప్‌లో కూడా పాత టికెట్‌ ధరలనే చూపిస్తున్నారని అనేక ఫిర్యాదులు వస్తున్నాయన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z