Business

హైదరాబాద్‌ లో రియల్టీ జోరు

హైదరాబాద్‌ లో  రియల్టీ  జోరు

దేశీయ రియల్టీ రంగంలో హైదరాబాద్‌ దూసుకెళుతున్నది. అటు కొత్త ఇండ్ల నిర్మాణాల్లోనూ, అమ్మకాల్లోనూ జోరు చూపిస్తున్నది. ప్రస్తుత సంవత్సరం జూలై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో కొత్త నిర్మాణాల్లో హైదరాబాద్‌ అగ్రస్థానంలో నిలిచినట్టు ప్రాప్‌ ఈక్విటీ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. దేశంలోని ప్రధాన నగరాలు అన్నింటిలో కలిపి కొత్త నిర్మాణాలు 2021 సెప్టెంబర్‌ త్రైమాసికంకంటే 11 శాతం వృద్ధితో 83,241 యూనిట్లకు చేరగా, హైదరాబాద్‌లో 30 శాతం వృద్ధిచెంది 16,931 యూనిట్లకు చేరాయి.

2022 జూన్‌తో ముగిసిన మూడు నెలల్లో దేశంలో ప్రారంభమైన కొత్త నిర్మాణాలు 97,745 యూనిట్లకంటే సెప్టెంబర్‌ త్రైమాసికంలో తగ్గగా, హైదరాబాద్‌లో మాత్రం 15,760 యూనిట్ల నుంచి ఏడు శాతం వృద్ధిచెందడం విశేషం. యూనిట్ల సంఖ్య దృష్ట్యా ఏడాదివారీగా చూస్తే కొత్త నిర్మాణాల్లో హైదరాబాద్‌ తర్వాతి స్థానాల్లో ఠాణె, పుణె, బెంగళూరు, ముంబై నగరాలున్నాయి. కానీ జూన్‌ క్వార్టర్‌కంటే ఠాణె, పుణె, ముంబైల్లో సెప్టెంబర్‌ త్రైమాసికంలో కొత్త నిర్మాణాలు తగ్గాయి.

14,920 యూనిట్ల విక్రయం
అమ్మకాల్లో సైతం దేశీ ప్రధాన నగరాల సగటుకంటే హైదరాబాద్‌ రియల్టీ మెరుగైన పనితీరును కనపర్చింది. ఈ ఏడాది జూలై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో దేశీ టైర్‌1 నగరాల్లో అమ్మకాలు 24 శాతం వృద్ధిచెందగా, హైదరాబాద్‌లో 29 శాతం పెరిగాయి. వివిధ నగరాల్లో అమ్మకాలు నిరుడు సెప్టెంబర్‌ క్వార్టర్‌తో పోలిస్తే 87,747 యూనిట్ల నుంచి 1,08,817 యూనిట్లకు చేరాయి. హైదరాబాద్‌లో ఇవి 11,591 యూనిట్ల నుంచి 14,920 యూనిట్లకు పెరిగాయి.అమ్మకాల పరిమాణంలో తొలి మూడు స్థానాల్లో ఠాణె, పుణె, బెంగళూరు ఉన్నాయి. హైదరాబాద్‌ నాల్గో స్థానంలో ఉంది. ఇతర మెట్రో నగరాలు ముంబై, ఢిల్లీ, చెన్నైల్లో అమ్మకాల పరిమాణం తక్కువగానే ఉంది. 2022 మూడో త్రైమాసికంలో రియల్టీ కొత్త నిర్మాణాలు, అమ్మకాల్లో ప్రధాన నగరాలు మంచి పనితీరును ప్రదర్శించాయని, ఈ నగరాల్లో నాణ్యమైన ఇండ్ల కొనుగోలుకు వినియోగదార్లు మొగ్గుచూపుతున్నారని ప్రాప్‌ఈక్విటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సమీర్‌ జసుజా తెలిపారు.