Devotional

శబరిమల అయ్యప్ప దర్శనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి.. – TNI ఆధ్యాత్మికం

శబరిమల అయ్యప్ప దర్శనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి..  –  TNI ఆధ్యాత్మికం

*ఈ నెల 17 నుంచి శబరిమల యాత్ర .. పకడ్బందీ ఏర్పాట్లు
*14 వేల మంది పోలీసులతో భద్రత
*134 సీసీటీవీ కెమెరాలతో ఏర్పాట్లు
*భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన కేరళ పోలీస్ బాస్
* ఈ ఏడాది భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని అంచనా
శబరిమల యాత్రకు భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు కేరళ పోలీసులు వెల్లడించారు. ఈ నెల 17 నుంచి మొదలు కానున్న ఈ యాత్రకు దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తారని వివరించారు. యాత్రకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులతో కలిసి భద్రతను ఏర్పాటు చేశామని చెప్పారు.
దారిపొడవునా పోలీస్ చెక్ పోస్టులను ఏర్పాటు చేయడంతో పాటు సీసీటీవీ కెమెరాలను అమర్చినట్లు పేర్కొన్నారు. ఈమేరకు కేరళ పోలీస్ బాస్ అనిల్ కాంత్ బుధవారం భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. కరోనా ఆంక్షల తొలగింపు నేపథ్యంలో ఈ ఏడాది భారీ సంఖ్యలో భక్తులు యాత్రకు వచ్చే అవకాశం ఉందని అనిల్ కాంత్ చెప్పారు. ఈ క్రమంలో భక్తుల రద్దీని తట్టుకునేలా సెక్యూరిటీ ఏర్పాట్లు చేశామని విలేకరులకు తెలిపారు. సుమారు 14 వేల మంది పోలీసులు ఈ యాత్రలో భక్తులకు భద్రత కల్పిస్తారని చెప్పారు. మొత్తం 134 సీసీటీవీ కెమెరాలతో భక్తులను నిరంతరం గమనిస్తుంటామని పేర్కొన్నారు. ఏరియల్ సర్వే కోసం ఎన్డీఆర్ఎఫ్, ఆర్పీఎఫ్, ఆర్ఏఎఫ్ బలగాల సాయం తీసుకుంటున్నట్లు చెప్పారు. సంఘ విద్రోహశక్తులను గుర్తించేందుకు పక్క రాష్ట్రాలకు చెందిన పోలీసు బలగాలను కూడా శబరిమల యాత్రకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లలో భాగం చేసినట్లు అనిల్ కాంత్ వివరించారు. యాత్ర కోసం కేరళ రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేకంగా బస్సులను నడిపిస్తోందని అనిల్ కాంత్ తెలిపారు. నీలక్కల్ వరకే ప్రైవేటు వాహనాలను అనుమతిస్తామని, అక్కడి నుంచి కేవలం ఆర్టీసీ బస్సులనే పంపా వరకు అనుమతిస్తామని చెప్పారు. ఇక, వర్చువల్ క్యూలైన్ ను ఈ ఏడాది రద్దు చేస్తున్నట్లు ఆయన వివరించారు. సంఘ విద్రోహులు యాత్రలో పాల్గొనకుండా అడ్డుకోవడం, భక్తుల ముసుగులో వచ్చే నేరస్థులను గుర్తించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అనిల్ పంత్ తెలిపారు.

1. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు 2023 ఫిబ్రవరి 21న ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు స్వస్తీవాచనంతో ప్రారంభించి మార్చి 3న శతఘటాభిషేకంతో బ్రహ్మోత్సవాలకు పరిసమాప్తి పలుకనున్నారు. 2023 సంవత్సరంలో జరుపబడే ఉత్సవాలు, పండుగల తేదీలను ఖరారు చేస్తూ ఆలయ అధికారులు గురువారం టైం టేబుల్‌ విడుదల చేశారు.స్వయంభూ నారసింహుడి ప్రధానాలయం పునఃప్రారంభం అనంతరం మొదటిసారిగా జరిగే ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. పునర్నిర్మాణంలో భాగంగా స్వామివారి ప్రధానాలయానికి ఉత్తర దిశలో పంచతల రాజగోపురం నిర్మించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయ చరిత్రలోనే వచ్చే ఏడాది ఉత్తర ద్వారం గుండా స్వామివారు దర్శనమివ్వనున్నారు. 2023 జనవరి 2న ముక్కోటి ఏకాదశి స్వామివారి ఉత్తర ద్వార దర్శనంతోపాటు ఆరు రోజుల పాటు స్వామివారి అధ్యయనోత్సవాలు నిర్వహించనున్నారు.జనవరి 27 నుంచి 30వరకు పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి అధ్యయనోత్సవాలు, జనవరి 31నుంచి ఫిబ్రవరి 6వరకు పాతగుట్ట వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 15నుంచి 20వరకు పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతాయి.

2. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ నేడు విడుదల చేయనుంది. డిసెంబ‌ర్‌ నెల‌ కోటాకు సంబంధించిన‌ రూ.300 శ్రీవారి ప్రత్యేక దర్శన టోకెన్లను శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుల చేయనున్నది. డిసెంబర్‌ మాసం మొత్తానికి సంబంధించిన టికెట్లు అందుబాటులో ఉంచనున్నది. కరోనా మహమ్మారి తరువాత తిరుమలలో పూర్తిగా నిబంధనలు ఎత్తివేయడంతో కొన్ని నెలలుగా భక్తులు పెద్ద ఎత్తున తిరుమలను సందర్శిస్తున్నారు. కాగా, వీఐపీ బ్రేక్‌ దర్శన వేళల్లో మార్పుల కారణంగా డిసెంబర్‌ నెల కోటా టికెట్ల విడుదల ఆలస్యమైందని అధికారులు తెలిపారు.
**ఇలా బుక్‌ చేసుకోండి..
రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను బుక్‌ చేసుకోవాలనుకునే భక్తులు ముందుగా టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌(https://tirupatibalaji.ap.gov.in/#/login) లోకి వెళ్లాలి. తమ పేరును రిజిస్టర్‌ చేసుకోవాలి. ముందుగానే రిజిస్టర్‌ చేసుకున్నవారైతే లాగిన్‌ వివరాలను ఎంటర్‌ చేయాలి. ఆ తర్వాత లేటెస్ట్‌ అప్‌డేట్‌లో ఉండే రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లపై క్లిక్‌ చేయాలి. అనంతకు మనకు కావాల్సిన తేదీ, సమయాన్ని సెలక్ట్‌ చేసుకొని డబ్బు చెల్లించాలి.
3. గతంతో పోలిస్తే యాదాద్రి ప్రధానాలయం మహాద్భుతంగా రూపుదిద్దుకున్నదని సినీ నటుడు నాని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్వామివారి ఆలయాన్ని ఎంతో చక్కగా పునర్నిర్మించిందని కితాబిచ్చారు. గురువారం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని ఆయన దర్శించుకున్నారు. మొదటగా స్వయంభూ నారసింహుడిని దర్శించుకుని, స్వామివారి సువర్ణ పుష్పార్చన, వేద ఆశీర్వచనంలో పాల్గొన్నారు. పూర్తి కృష్ణశిలలతో నిర్మితమైన స్వామివారి ఆలయం చరిత్రలో నిలిచిపోనున్నదని చెప్పారు. ఆలయ పునర్నిర్మాణానికి కృషి చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ భాగస్వాములైన వైటీడీఏ అధికారులు, ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆనందసాయి, ప్రధాన స్తపతి, ఉపస్తపతులు, శిల్పులు, ఆలయ అధికారులకు అభినందనలు తెలిపారు.

4. శ్రీవారి లడ్డూ పరిమాణం, బరువుపై అపోహలోద్దు: టీటీడీ
తిరుమ‌ల శ్రీవారి లడ్డూ ప్రసాదం 160 గ్రాముల నుండి 180 గ్రాములు బరువు కలిగి వుంటుంది . ప్ర‌తి రోజు పోటు కార్మికులు త‌యారు చేసిన ల‌డ్డూ ప్ర‌సాదాల‌ను ఒక ప్ర‌త్యేక‌ ట్రేలో ఉంచి, ప్ర‌తి ట్రే బ‌రువును పోటు అధికారులు త‌నిఖీ చేస్తారు. అనంత‌రం ల‌డ్డూ ప్ర‌సాదాల‌ను కౌంట‌ర్ల‌కు త‌ర‌లించి, భ‌క్తుల‌కు అందిస్తారు. ఇందులో పూర్తి పార‌ద‌ర్శ‌క‌త ఉంటుంది. వేయింగ్ మిషన్‌లో సాంకేతిక‌ సమస్య కారణంగా మైనస్ 70 అని ఉండటం, కాంట్రాక్టు సిబ్బంది అవగాహన లోపం కార‌ణంగా లడ్డూ బరువుపై భ‌క్తులు అపోహల‌కు గుర‌య్యారు. లడ్డూ బరువు కచ్చితంగా 160 నుండి 180 గ్రాములు ఉంటుంది. కొన్ని వందల సంవత్సరాలుగా అత్యంత భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో లడ్డూ ప్రసాదాన్ని పోటు కార్మికులు తయారు చేస్తున్నారు. అదేవిధంగా ల‌డ్డూ బ‌రువు, నాణ్య‌త విష‌యంలో కూడా టీటీడీ ఏనాడు రాజీ ప‌డ‌లేదు. సాధార‌ణంగా ల‌డ్డూ కౌంట‌ర్ల వ‌ద్ద ఏదేని ఇబ్బంది త‌లెత్తితే వేంట‌నే అక్క‌డ అందుబాటులో ఉన్న ల‌డ్డూ కౌంట‌ర్ అధికారికి తెలియ‌జేస్తే, అక్క‌డిక్క‌డే స‌మ‌స్యను ప‌రిష్క‌రించే వ్య‌వ‌స్థ టీటీడీలో ఉంది. కానీ స‌దరు భ‌క్తుడు ఇవిఏమి చేయ‌కుండా సోష‌ల్ మీడియాలో టీటీడీపై ఇలాంటి ఆరోప‌ణ‌లు చేయ‌డం శోచ‌నీయం.వున భ‌క్తుడు ఆరోపించిన‌ట్లు ల‌డ్డూ పరిమాణం, బరువులో ఎలాంటి వ్య‌త్యాసం లేదు. సామాజిక మాధ్యమాలలో వస్తున్న ఇలాంటి అపోహలను భక్తులు నమ్మవద్దని టీటీడీ కోర‌డ‌మైన‌ది.

5. ఈ నెల 20 నుంచి శబరిమలకు 26 ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్యరైల్వే శుభవార్త అందించింది. సికింద్రాబాద్‌ నుంచి శబమ‌రి వెళ్లే భక్తుల కోసం ఈ నెల 20 నుంచి 26 ప్రత్యేక రైళ్లను నడుపనున్నామని రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ సర్వీసులను వచ్చేఏడాది జనవరి వరకు కొనసాగుతాయని తెలిపారు. సికింద్రాబాద్‌ నుంచి కొల్లం, కొట్టాయంకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని చెప్పారు.
రైళ్ల వివరాలు..
సికింద్రాబాద్-కొల్లం (నం.07117): ఈ నెల 20, డిసెంబర్‌ 4, 18, జనవరి 8 తేదీల్లో నాలుగు సర్వీసులు. ఈ రైలు ఆదివారం సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి సోమవారం రాత్రి 11 గంటలకు కొల్లం చేరుకుంటుంది. ఇది కాచిగూడ, మహబూబ్‌నగర్‌, గద్వాల మీదుగా పయనించనుంది.

కొల్లం-సికింద్రాబాద్‌ (రైలు నం.07118): నవంబర్‌ 22, డిసెంబర్‌ 6, 20, జనవరి 10 తేదీల్లో నాలుగు సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు కొల్లంలో బయల్దేరుతుంది. మరుసటిరోజు 9.05 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది.

సికింద్రాబాద్‌-కొల్లం (నం. 07121): ఈ రైలు నవంబర్ 27, డిసెంబర్‌ 11, 25, జనవరి 1, 15 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఆదివారం మధ్యాహ్నం సికింద్రాబాద్‌లో బయల్దేరి.. సోమవారం రాత్రి కొల్లం చేరుతుంది. ఇది చర్లపల్లి, భువనగిరి, జనగామ, కాజీపేట, వరంగల్‌, మహబూబాబాద్‌, డోర్నకల్‌, ఖమ్మం, మధిర మార్గంలో పయణిస్తుంది.

కొల్లం-సికింద్రాబాద్‌ (నం. 07122): ఈ రైలు నవంబర్‌ 29, డిసెంబర్‌ 13, 27, జనవరి 3, 17 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. మంగళవారం తెల్లవారుజామున 2.30 గంటలకు కొల్లం నుంచి బయల్దేరి.. బుధవారం ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్‌ చేరుతుంది.

సికింద్రాబాద్‌-కొల్లం (నం. 07123): నవంబర్‌ 21, 28 తేదీల్లో రెండు సర్వీసులు నడువనున్నాయి. సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయల్దేరి.. మంగళవారం రాత్రి 11.50కి కొల్లం చేరుకుతంది. ఇది చర్లపల్లి, భువనగిరి, కాజీపేట, వరంగల్‌ మార్గం పయణిస్తుంది.

కొల్లం-సికింద్రాబాద్‌ (నం.07124): నవంబర్‌ 23, 30 తేదీల్లో రెండు సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. బుధవారం తెల్లవారుజామున 2.30 గంటలకు కొల్లం నుంచి బయల్దేరి.. గురువారం ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది.

సికింద్రాబాద్‌-కొట్టాయం (నం. 07125): ఈ రైలు నవంబర్‌ 20, 27 తేదీల్లో సేవలు అందించనుంది. ఆదివారం సాయంత్రం 6.50 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయల్దేరి.. సోమళవారం రాత్రి 9 గంటలకు కొట్టాయం చేరుకుంటుంది. ఇది చర్లపల్లి, నల్లగొండ, మిర్యాలగూడ మీదుగా వెళ్తుంది.

కొట్టాయం-సికింద్రాబాద్‌ (నం.07126): ఇది నవంబర్‌ 21, 28 తేదీల్లో నడుస్తుంది. సోమవారం రాత్రి 11.30 గంటలకు కొట్టాయం నుంచి బయల్దేరి.. బుధవారం ఉదయం 4 గంటలకు సికింద్రాబాద్‌ చేరుతుంది

6. భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై సాయి సమాధిని స్పృశించే భాగ్యం.. దీపావళికి హుండీ ఆదాయం 17 కోట్లు
షిరిడీ సాయి సమాధిని తాకే భాగ్యాన్ని ఇప్పుడు సామాన్య భక్తులకు సైతం కల్పించనున్నట్లు సాయి సంస్థాన్ పేర్కొంది. ఈ దీపావళి సెలవుల్లో ఆలయానికి రూ.17 కోట్ల కానుకలు వచ్చినట్లు తెలిపింది.
మహారాష్ట్రలోని షిరిడీకి వెళ్లే భక్తులు ఆ సాయినాథుడ్ని దర్శనం చేసుకోవడం తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. నిత్యం ఆరతి, భజనలతో రద్దీగా ఉండే ఆలయానికి వచ్చే భక్తులకు ఒక్కసారైనా బాబా సమాధిని స్పృశించాలన్న ఆశ ఉంటుంది. ఒకప్పుడు అది సులభమే అయినప్పటికీ రానురానూ పెరుగుతున్న రద్దీ దృష్ట్యా షిరిడీ సాయి సంస్థాన్ మార్పులు చేసింది. భక్తులకు, సాయి సమాధికి మధ్య గాజు అద్దాన్ని అడ్డుగా పెట్టింది. ఒక్క వీఐపీ భక్తులకు మాత్రమే బాబా దగ్గరకు వెళ్లి ఆ సమాధిని తాకే అదృష్టం దక్కేది. సాధారణ భక్తులు మాత్రం దూరం నుంచే దర్శనం చేసుకోవాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు సామాన్యులకు కూడా సాయి సమాధిని తాకే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు సాయి సంస్థాన్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ భాగ్యశ్రీ బనాయత్‌ తెలిపారు. అంతే కాకుండా భక్తుల కోరిక మేరకు సాయి సచ్చరిత్రను వివిధ భాషల్లో ప్రచురించే ప్రణాళికలో ఉన్నామని సాయి సంస్థాన్ పేర్కొంది. ఈ నిర్ణయాలపట్ల షిరిడీ గ్రామస్థులతో పాటు సాయి భక్తులు ఆనందంగా ఉన్నారు. బాబా సమాధి విషయమై పలు మార్లు సంస్థాన్కు విన్నవించుకున్నామని.. ఇప్పటికి తమ కోరిక నెరవేరినందుకు ఎంతో సంతోషంగా ఉందని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
**17 కోట్ల ఆదాయం..
తిరుమల తర్వాత అంతటి రికార్డు స్థాయి హుండీ లెక్కింపులు ఉన్న ఆలయాల్లో షిరిడీ ఒక్కటి. దీపావళి సెలవుల సమయంలో అధిక సంఖ్యలో భక్తులు రావడం వల్ల ఈసారి హుండీ ఆదాయం భారీగా నమోదైంది.
అక్టోబర్ 20 నుంచి నవంబర్ 5 వరకు.. ఆలయానికి రూ.17 కోట్ల 77 లక్షల 53 వేలు కానుకల రూపంలో వచ్చాయి.
దక్షిణ పేటికకు – 3 కోట్ల11 లక్షల 79 వేలు
విరాళాల రూపంలో – 7 కోట్ల 54 లక్షల 45 వేలు
ఆన్లైన్ విరాళం- కోటి 45 లక్షల 42 వేలు
చెక్, డీడీ – 3 కోట్ల 3 లక్షల 55 వేలు
మనీఆర్డర్లు – 7 లక్షల 28 వేలు
డెబిట్, క్రెడిట్ కార్డు డొనేషన్ – కోటి 84 లక్షల 22 వేలు
బంగారం – 860.450 గ్రామలు
వెండి- 970 గ్రాములు
29 దేశాలకు చెందిన విదేశీ కరెన్సీ- 24 లక్షల 80 వేలు