Politics

మత మౌఢ్యమే మనిషితో తప్పు చేయిస్తుంది’ : ముఖ్యమంత్రి కేసీఆర్

మత మౌఢ్యమే మనిషితో తప్పు చేయిస్తుంది’ : ముఖ్యమంత్రి కేసీఆర్

హైదరాబాద్ : దేశంలో మతం పేరుతో జరిగే దుష్ప్రచారాన్ని హరేకృష్ణ సంస్థ అడ్డుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. ఏ మతంలో తప్పు లేదని, మత మౌఢ్యమే మనిషితో తప్పు చేయిస్తుందని వివరించారు. హరేకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోకాపేటలో నిర్మించనున్న హెరిటేజ్ టవర్‌కు నిర్వాహకులతో కలిసి సీఎం భూమి పూజ చేశారు. ఆలయ నిర్మాణానికి సంబంధించి శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హెరిటేజ్‌ టవర్‌కు తెలంగాణ ప్రభుత్వం తరఫున రూ.25 కోట్లను విరాళంగా ప్రకటించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హరేకృష్ణ హెరిటేజ్ టవర్ కు శంకుస్థాపన చేశారు. శ్రీకృష్ణ గో సేవామండలి విరాళాలతో ఇస్కాన్ ఆధ్యాత్మిక సంస్థ ఈ హెరిటేజ్ టవర్ ను హైదరాబాద్ లోని కోకాపేటలో నిర్మిస్తోంది. శంకుస్థాపన సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ మత పిచ్చి అత్యంత ప్రమాదకరమని అన్నారు. మత మౌఢ్యం ప్రజలను పిచ్చోళ్లను చేస్తుందని చెప్పారు. దేవుడు కానీ, మతం కానీ హింసకు వ్యతిరేకమని… మధ్యలో వచ్చిన వాళ్లే మత మౌఢ్యాన్ని ప్రేరేపిస్తున్నారని మండిపడ్డారు. మనుషులు, దేశాలు, ప్రాంతాలు వేరైనా అందరూ పూజించే పరమాత్ముడు ఒక్కడేనని చెప్పారు. విశ్వశాంతి కోసం మనందరం ప్రార్థన చేయాలని సూచించారు. హైదరాబాద్ లో హరేకృష్ణ ఆలయాన్ని నిర్మిస్తుండటం సంతోషకరమని ముఖ్యమంత్రి చెప్పారు. ఆలయ నిర్మాణానికి ప్రభుత్వం తరపున రూ. 25 కోట్లు ఇస్తామని ప్రకటించారు. ఇస్కాన్ సంస్థ అక్షయపాత్ర ద్వారా చేస్తున్న అన్నదానం చాలా గొప్పదని కేసీఆర్ కితాబునిచ్చారు. అక్షయపాత్ర అందిస్తున్న రూ. 5ల భోజనాన్ని నగరంలోని ధనవంతులు కూడా తింటున్నారని చెప్పారు. అక్షయపాత్ర వంటి కార్యక్రమాలను నిర్వహించాలంటే ఎంతో చిత్తశుద్ధి ఉండాలని అన్నారు. కరోనా సమయంలో కూడా హరేకృష్ణ ఫౌండేషన్ ఎన్నో సేవలను అందించిందని కొనియాడారు.