Editorials

ఋషికేశ్‌లోని ఆ ఆశ్రమంలో అన్నీ ఉచితమే–TNI ప్రత్యేకం

TNILIVE-Story-SivanandaAshramRishikesh-DivineLifeSociety.png


రుషికేశ్, హరిద్వార్, కంకాల్ గంగానది ఒడ్డున ఉన్న ప్రాంతాలు. ఈ మూడింటికి చారిత్రిక ప్రాధాన్యత చాలా ఉంది. హిమాలయాలు ఇక్కడి నుండే ప్రారంభమవుతాయి. అందుకనే ఈ ప్రాంతాన్ని ‘హరి’ద్వారం అని పేరు వచ్చింది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న ఈ ప్రాంతం నుండే చార్ ధాం యాత్ర ప్రారంభం అవుతుంది. ఈ మూడు ప్రాంతాల్లో గంగానది ఒడ్డున ఇరువైపులా కొన్ని వందల ఆశ్రమాలు ఉన్నాయి. వీటిలో ప్రధానమైనవి పదుల సంఖ్యలోనే ఉన్నాయి. ఈ ఆశ్రమాల్లో లాభాపేక్ష లేకుండా భక్తులకు చాలా సౌకర్యాలు కల్పిస్తున్నారు. వీటిలో ప్రధానమైనది శివానంద ఆశ్రమం.


*** వందేళ్ళ పూర్వమే శివానంద ఆశ్రమం ఏర్పాటు. దాదాపు వంద సంవత్సరాల క్రితమే శివానంద స్వామీ రుషికేశ్ లో దివ్యజీవన సంఘం (Divine life society) ఏర్పాటు చేశారు. కాలక్రమేనా దీనిని శివానంద ఆశ్రమంగా పిలుస్తున్నారు. రుషీకేశ్ లోని రామజూల సమీపంలో గంగానదికి ఇరువైపులా దాదాపు వంద ఎకరాల్లో శివానంద ఆశ్రమం నెలకొని ఉంది. తెల్లవారు జామున నాలుగు గంటల నుండి రాత్రి పది గంటల వరకు ఈ ఆశ్రమంలో ప్రతి నిత్యం దూపదీప నైవేద్యాలు, భజనలు, సత్ సంఘాలు జరుగుతూ ఉంటాయి. 1965లో శివానంద స్వామీ శివైక్యం అనంతరం ఆయన ఆయన దేహాన్ని ఆశ్రమం మధ్యలోనే సమాధి చేశారు. ఈ సమాధి మందిరంలో ప్రతి నిత్యం ఉదయం నుండి రాత్రి వరకు భజనలు జరుగుతూ ఉంటాయి. ఈ మందిరం పక్కనే శివానంద స్వామీ నిర్మించిన విశ్వనాధ మందిరం ఉంటుంది. దీనిలో కృష్ణుడి విగ్రహాన్ని శివలింగంతో పాటే ప్రతిష్టించారు.


*** అరవై ఏళ్ల నుండి ఉచితంగా యోగా వేదాంతాలలో శిక్షణ. శివానంద స్వామీ ఆశ్రమంలో యోగా వేదాంతలకు బాగా ప్రాధాన్యత ఇస్తునారు. దీని కోసం విశాలమైన పెద్ద భవనాన్ని శిక్షణ ఇవ్వడం కోసం శివానంద స్వామి నిర్మించారు. ఈ భవనానికి ‘యోగా-వేదాంత ఫారెస్టు అకాడమీ’ అని నామకరణం చేశారు. ప్రతి సంవత్సరం రెండు విడతలుగా ఈ అకాడమీలో యోగా నేర్చుకునేవారికి శిక్షణ ఇస్తారు. రెండు నెలల పాటు ఈ శిక్షణ ఉంటుంది. ఈ ఆకాడమీలోనే ఉచితంగా శిక్షణ పొందేవారికి వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తారు. వీటితో పాటు ఆశ్రమాన్ని సందర్శించడానికి వచ్చే యాత్రికులకు ఈ ఆశ్రమంలో ఉచితంగా భోజన వసతి సౌకర్యాలు కల్పిస్తారు.


*** దేశవిదేశాలలో శాఖలు దివ్యజీవన సంఘానికి (శివానంద ఆశ్రమానికి) భారతదేశం నలుమూలలా వేలాది శాఖలు ఉన్నాయి. పలు దేశాల్లోనూ ఈ శాఖలు విస్తరించాయి. జపాన్, చైనా, అమెరికా, ఆస్ట్రేలియా, జర్మని, బర్మా, ఇంగ్లాండ్, బ్రిటన్ తదితర దేశాల నుండి ఈ ఆశ్రమానికి ప్రతి నిత్యం వందల సంఖ్యలో విదేశీయులు తరలివస్తుంటారు. ఇక్కడ విదేశీయులకు సంస్కృతంలోనూ యోగావేదాంతల్లోనూ స్వల్పకాలిక శిక్షణ ఉంటుంది. ప్రతి ఏడాది క్రమం తప్పకుండా వచ్చే విదేశీయులు చాలా మంది ఉంన్నారు. నెలల తరబడి ఉండే విదేశీయులకు కూడా ఉచితంగానే భోజన వసతి సౌకర్యం ఉంటుంది.


*** అబ్దుల్ కలాం కూడా ఈ ఆశ్రమం భక్తుడే… భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఒక దశలో జీవితంపై నిరాశ చెంది తమిళనాడుకే చెందిన శివానంద స్వామి వద్దకు RshikES వెళతారు. తనను శిష్యుడిగా స్వీకరించమని కోరతారు. శివానంద స్వామీ ఆరోజునే అబ్దుల్ కలాం లో ఉన్న మేధాశక్తిని గుర్తించి నీ అవసరం దేశానికి చాలా ఉంటదని…చదువుపై దృష్టి కేంద్రీకరించమని‘ శివానంద స్వామీ అబ్దుల్ కలాంకు సూచించారు. అనంతరం అబ్దుల్ కలాం చెన్నై వెళ్లి ఐఐటీలో విద్యnu కొనసాగించారు. ఈ విషయాన్నీ అబ్దుల్ కలాం తన ఆత్మకధ “THE WINGS OF FIRE”లో స్పష్టంగా పేర్కొన్నారు.


*** నిత్యం వేలాది మందికి అన్నదానం – ఈ ఆశ్రమంలో దాదాపు ఒకేసారి రెండువేల మంది వరకు భోజనం చేసే డైనింగ్ హాల్ ఉంది. ఆశ్రమంలో ఉంటున్న భక్తులకు ఉదయం అల్ఫాహారం, రెండుపూటలా భోజనం మధ్యాహ్నం టీ తో సహా ఉచితంగా అందజేస్తారు. దాదాపు పదివేల మంది కూర్చొనే విధంగా ఇటీవలే ఆధునిక వసతులతో ఆడిటోరియంను నిర్మించారు. శివానంద స్వామీ భోదనలతో పాటు ఇతర ఆద్యాత్మిక గ్రంధాలు ఉన్న భారీ గ్రంధాలయం ఈ ఆశ్రమంలో ఉంది. శివానంద స్వామీ ఆడియో, వీడియో సీడీలు ఇతర పుస్తకాలూ విక్రయించే పుస్తక శాల కూడా ఉంది. ప్రతినిత్యం వందలాది మందికి చికిత్స చేయడం కోసం పెద్ద ఆస్పత్రి ఈ ఆశ్రమంలో ఉంది. రుషికేశ్ పరిసర గ్రామాల్లో, కొండ ప్రాంతాల్లో ఉన్న పేద ప్రజలకు ఇక్కడ ఉచితంగా చికిత్స చేయడంతో పాటు మందులను ఉచితంగా అందజేస్తారు.


*** ప్రతినిత్యం గంగా హరతి గంగానది ఒడ్డున శివానంద స్వామీ నివాసం ఉన్న ‘గురుదేవ్ కుటీర్’ లో ప్రతి నిత్యం సాయంకాలం సమయంలో ప్రత్యెక భజనలు ఉంటాయి. అనంతరం గంగాహరతి ఇస్తారు. తెలుగువారైన ‘హంసానంద స్వామీ’ ఆద్వర్యంలో ఈ గంగా హారతి జరుగుతుంది. రామ్ జూలా పక్కనే ఉన్న పోస్టాఫీసులోనే హంసానంద స్వామీ కార్యాలయం కూడా ఉంది. ఉదయం ఆరు నుండి పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం రెండు నుండి ఏడు గంటల వరకు హంసానంద స్వామీ భక్తులకు అందుబాటులో విదేశాల నుండి వచ్చే వారికి హంసానందస్వామీ సంస్కృతంలో శిక్షణ ఇస్తారు.


*** ఇరవై ఏళ్ళ అనుబంధం … నాకు శివానంద ఆశ్రమంతో ఇరవై ఏళ్ల అనుబందం ఉంది. ఏడాదికి ఒక్కసారైనా, ఒక్కోసారి రెండు సార్లు ఈ ఆశ్రమానికి కుటుంబ సభ్యులతో కలిసి వెళుతూ ఉంటాను. ప్రస్తుతం ఈ ఆశ్రమం ప్రధాన కార్యదర్శిగా ఉన్న ‘స్వామీ పద్మనాభానంద’తో ఇరవై ఏళ్ల నుండి నాకు పరిచయం ఉంది. స్వామీ పద్మనాభానంద ఆద్వర్యంలో దేశవిదేశాల్లో శివానంద స్వామి సందేశాలను ప్రచారం చేయటానికి పద్మనాభానంద ప్రత్యెక ఏర్పాట్లు చేసారు. అన్ని రాష్ట్రాల్లోనూ ఆయన పర్యటిస్తూ దివ్యజీవన సంఘం వార్షిక సదస్సుల్లో తప్పనిసరిగా పాల్గొంటారు. యోగ వేదాంతాలలో పొందదలచుకున్నవారు దీనితో పాటు జతపరుస్తున్న ప్రవేశ పత్రాన్ని పరిశీలించి వివరాలు పొందవచ్చు. ఈ ఆశ్రమాన్ని సందర్శించాలనుకునే వారు , అక్కడ భోజన వసతి సౌకర్యం కోసం పదిరోజుల ముందుగానే ఆశ్రమానికి లేఖ రాయవలసి ఉంటుంది. ఆశ్రమం ఫోన్ నంబరు ద్వారా కూడా సంప్రదించ వచ్చు. ఈ ఆశ్రమం నంబరు 0135-2430040, ఈ-మెయిల్ ద్వారా కూడా లేఖను పంపవచ్చు. ఈ మెయిల్ అడ్రస్: generalsecretary@sivanandaonline.org. —కిలారు ముద్దుకృష్ణ సీనియర్ జర్నలిస్టు.