Food

చిలగడదుంపలతో అధ్యయన శక్తి

Sweet Potatoes Will Help Increase Analytical Ability

చిలగడదుంపల్ని ఉడికించి తింటుంటాం, కూరల్లోనూ వాడుతుంటాం. అయితే దుంపల వల్ల బరువు పెరుగుతారన్న కారణంతో ఈమధ్య చాలామంది వీటికి దూరంగా ఉంటున్నారు. కానీ వీటిల్లో విటమిన్‌-ఎ, సి, బి6, నియాసిన్‌, మాంగనీస్‌, పొటాషియం, పాంటోథెనిక్‌ ఆమ్లం, కాపర్‌…వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇంకా వీటిల్లో పుష్కలంగా ఉండే పీచూ యాంటీ ఆక్సిడెంట్లూ పొట్టలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరిగేలా చేయడంతోబాటు పేగు క్యాన్సర్‌ రాకుండా కాపాడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇందులోని ఆంథోసైనిన్లు అధ్యయనశక్తినీ జ్ఞాపకశక్తినీ కూడా పెంచుతాయనీ వృద్ధాప్యంలో వచ్చే మతిమరపునీ తగ్గిస్తాయనీ హార్వర్డ్‌ పరిశోధకులు చెబుతున్నారు. నారింజరంగు చిలగడదుంపల్లోని విటమిన్‌-ఎ కంటి ఆరోగ్యానికి తోడ్పడటంతోబాటు రోగనిరోధకశక్తినీ పెంచుతుందట. వీటిని ఆహారంలో భాగంగా చేసుకుంటే బీపీ, మధుమేహం కూడా నియంత్రణలో ఉంటాయని చెబుతున్నారు నిపుణులు.