Devotional

రాముడి పెళ్లికి ముస్తాబవుతోన్న భద్రాద్రి

bhadrachalam brahmotsavam 2019

1.రాముడి పెళ్ళికి ముస్తాబవుతున్న భద్రాచలం – తదితర ఆద్యాత్మిక వార్తలు
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం సన్నిధిలో ఏప్రిల్14న శ్రీసీతారాముల కల్యాణం, 15న శ్రీరామునిపట్టాభిషేకం నిర్వహించేందుకు వేద పండితులు ముహూర్తం నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను నెల రోజుల నుంచే దేవస్థానం చేస్తోంది. ఈనెల 10న ఉత్సవాలకు అంకురారోపణ, 11న గరుడ పఠ లేఖనం, గరుడాదివాసం, 12న అగ్నిప్రతిష్ట, ధ్వజారోహణం, 13న ఎదుర్కోలు ఉత్సవం జరగనుంది.. ఇప్పటికే ఆలయ పరిసరాల్లో చలువ పందిళ్ల నిర్మాణం పూర్తయ్యింది. రాములోరి పెళ్లి, పట్టాభిషేకం జరిపే మిథిలా ప్రాంగణాన్ని ముస్తాబు చేస్తున్నారు. మిథిలా ప్రాంగణం చుట్టూ చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. భక్తులు కల్యాణాన్ని తిలకించే విధంగా సెక్టార్ల వారిగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కల్యాణం, పట్టాభిషేకానికి సంబంధించిన టిక్కెట్ల విక్రయం కొనసాగుతున్నది. ఇప్పటికే కలెక్టర్ రజత్‌కుమార్‌శైనీ శ్రీరామనవమి ఏర్పాట్లను పర్యవేక్షించారు. అధికారులు సైతం తుది ఏర్పాట్లపై నిమగ్నమయ్యారు. మరో మూడు రోజుల్లో ఏర్పాట్లు ఒక కొలిక్కిరానున్నాయని అధికారులు పేర్కొన్నారు. ప్రధాన వేడుకలకు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఇతరత్రా ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున హాజరు కానున్నారు. ఈ ఉత్సవాలకు భారీ బందోబస్తును ఏర్పాటు చేసేందుకు పోలీస్‌శాఖ సన్నద్ధమవుతోంది.
2. వైభవంగా ఉగాది పురస్కార మహోత్సవం-నయనమనోహరంగా సంగీత, నృత్యసేవలు
శ్రీ వికారి నామసంవత్సర ఉగాది పురస్కార మహోత్సవాన్ని కూచిపూడి శ్రీసిద్ధేంద్రయోగి నాట్యకళా వేదికపై సోమవారం సాయంత్రం జరిగిన కనుల పండువగా నిర్వహించారు. అఖిల భారత కూచిపూడి నాట్యకళామండలి 36వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన సంగీత, నృత్యసేవలు నయనమనోహరంగా సాగాయి. కళామండలి అధ్యక్షుడు నాట్యాచార్య డాక్టర్‌ చింతా ఆదినారాయణశర్మ అధ్యక్షతన కళామండలి కార్యదర్శి పసుమర్తి కేశవప్రసాద్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కృష్ణవిశ్వవిద్యాలయం క్యాంపస్‌ కళాశాల ప్రిన్సిపల్‌ ఆచార్య వైకె.సుందరకృష్ణ, ఆంధ్రప్రదేశ్‌ సంగీత నృత్య అకాడమీ వైస్‌ ఛైర్మన్‌ కెవి.సత్యనారాయణ(అమరావతి)లు హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని వారు ప్రారంబించారు. ముందుగా ఉషామాధురి, శ్యామల, మహాలక్ష్మి, ప్రత్యూషలు త్యాగరాజ కీర్తనలో ‘ఎందరో మహానుభావులు’ అంటూ వీనుల విందుగా గానం చేశారు. అనంతరం కూచిపూడిలోని కృష్ణావిశ్వవిద్యాలయం క్యాంపస్‌ కళాశాల ఎంపీఏ కూచిపూడి నాట్యవిద్యార్థులు స్వర్ణశ్రీ, అంబిక, సాయిచంద్రిక, మనీష, ప్రత్యూషలు కూచిపూడి నృత్యాంశాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమాలకు నట్టువాంగం చింతా కృష్ణప్రియ అందించగా గాత్రంపై ఉష, వయోలిన్‌పై ఆంజనేయులు, మృదంగంపై హరనాథశాస్త్రిలు సహకరించారు.
3. జగన్మాతకు చామంతి, కనకాంబరాలతో అర్చన
వికారి నామ సంవత్సర వసంత నవరాత్రోత్సవాల్లో భాగంగా తెల్ల చామంతులు, కనకాంబరాలతో జగన్మాత దుర్గమ్మకు విశేష పుష్పార్చనను రుత్వికులు సోమవారం నిర్వహించారు. దుర్గగుడి ఈవో కోటేశ్వరమ్మ, పాలకమండలి సభ్యురాలు సాంబసుశీల, దేవస్థానం వైదిక కమిటీ సభ్యులు స్వయంగా పూలను బుట్టలతో తీసుకొని వచ్చి రుత్వికులకు అప్పగించారు. మల్లికార్జున మహా మండపం ఏడో అంతస్తులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షామియానాలో దుర్గమ్మ ఉత్సవమూర్తికి పూజాదికాలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య ఉభయదాతలు దుర్గమ్మ రూపునకు స్వయంగా పుష్పార్చన చేశారు. భక్తులకు కుంకుమ ప్రసాదంతోపాటు గాజులను కూడా దేవస్థానం అధికారులు అందజేశారు. పుష్పార్చన అనంతరం ఉభయదాతలకు ప్రత్యేక క్యూలైనులో అమ్మవారి దర్శనం చేయించారు. కార్యక్రమంలో అధికారులు విజయకుమార్‌, రమేష్‌, హేమదుర్గాంబ, చందు శ్రీనివాస్‌ పాల్గొన్నారు.
4. కనుల పండువగా అగ్ని వసంతోత్సవం
తిరుత్తణి ధర్మరాజ ఆలయ అగ్ని వసంతోత్సవం కనుల పండువగా జరిగింది. గాంధీనగర్‌లోని ధర్మరాజు ఆలయంలో జరుగుతున్న ద్రౌపది తిరునాలలో భాగంగా ఆదివారం అగ్ని వసంతోత్సవాన్ని పురస్కరించుకొని కౌరవ, పాండవుల యుద్ధం, దుర్యోధన వద తదితర నాటకాలు ఏర్పాటు చేశారు. సాయంత్రం ద్రౌపది మూలవిరాట్టుకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు జరిగాయి. రాత్రి కంకణం ధరించి భక్తులు పూలతో అలంకరించిన ఉత్సవ అమ్మవారిని ఊరేగించారు. భక్తులు నిప్పులు తొక్కి మొక్కులు తీర్చుకున్నారు. మహిళా భక్తులు అగ్నిగుండం ప్రదక్షణ చేశారు. సోమవారం ఉదయం ధర్మరాజు పట్టాభిషేకం జరిగింది.
5. చిత్రకూటం.. ఆధ్యాత్మిక పీఠం-అర్ధ శతాబ్దంగా ప్రముఖ ఘట్టాలకు వేదిక
భద్రాచలం రామాలయం ప్రాంగణంలోని చిత్రకూట మండపానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. దీనికి శంకుస్థాపన జరిగి ఇప్పటికి అర్ధ శతాబ్దం దాటింది. ఈ చిత్రకూటం ఆధ్యాత్మిక సంబరాలకు నిలయంగా నిలుస్తోంది. దేశం గర్వించే వాగ్గేయకారుడు మంగళంపల్లి బాల మురళీకృష్ణ గానం చేసిన ప్రాంతమిది. సంగీత కళానిధిగా ప్రఖ్యాతిగాంచిన నేదునూరి కృష్ణమూర్తి నవరత్న కీర్తనలు ఆలపించిన ప్రదేశం ఇది. సంగీత గురువులు మల్లాది సూరిబాబు తన గానామృతాన్ని పంచిన ప్రాంగణం. 1967 జులై 15న అప్పటి ఉప ప్రధాన మంత్రి మురార్జీ దేశయ్‌ చేతుల మీదుగా దీనికి శంకుస్థాపన చేశారు. దీని నిర్మాణానికి అప్పట్లో ఉద్ధరణ సంఘం ఏర్పడి ఎంతో కృషి చేసింది. ఎట్టకేలకు 1982 ఏప్రిల్‌ 3న అప్పటి దేవాదాయశాఖ మంత్రి పీవీ చౌదరి చేతుల మీదుగా ప్రారంభించారు. 37 సంవత్సరాలుగా ఆధ్యాత్మికపరమైన సాంస్కృతిక ప్రదర్శనలకు ఇది నెలవైంది. భక్త రామదాసు జయంతి ఉత్సవాలతో పాటు దమ్మక్క ఉత్సవాలు శబరి ఉత్సవాల వేళ ఇక్కడ ప్రత్యేకంగా రామయ్య కల్యాణాలు నిర్వహిస్తున్నారు. అత్యంత ప్రాచీనమైన స్వామివారి ఉత్సవ విగ్రహాలకు శత వర్ష ఉత్సవాలు చిత్రకూటంలో నిర్వహించారు. స్వామివారి తలంబ్రాలను ఇక్కడే కలుపుతారు. ఉత్సవాల వేళ లడ్డూ ప్రసాదాలను ఇక్కడే తయారు చేస్తారు. ఇలాంటి ఆధ్యాత్మిక వైభవం భవిష్యత్తులో కొనసాగేనా అంటే కచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఉంది. రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు చేయాలంటే దీన్ని తొలగించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఇందులో ఉన్న శిల్ప కళా సంపదను మాత్రం భద్రపర్చనున్నారు.
6. శ్రీవారి సేవలో గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు మంగళవారం దర్శిచుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో గవర్నర్‌ దంపతులు స్వామి వారి సేవలో పాల్గొన్నారు. అంతకుముందు వారు క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ శ్రీవరాహస్వామిని దర్శించుకున్నారు. గవర్నర్‌ దంపతులు శ్రీవారి పుష్కరిణిలోకి చేరుకొని పవిత్ర జలాలను ప్రోక్షణం చేసుకున్నారు. అనంతరం శ్రీవారి ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న గవర్నర్‌ దంపతులకు తితిదే ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుమల ఇన్‌ఛార్జి జేఈవో లక్ష్మీకాంతం ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికి, మేళతాళాలతో శ్రీవారి సన్నిధికి తీసుకెళ్లారు. స్వామి వారి దర్శనానంతరం హుండీలో కానుకలు సమర్పించారు. రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం పలుకగా తీర్థప్రసాదాలను, స్వామివారి చిత్రపటాన్ని గవర్నర్‌ దంపతులకు తితిదే ఈవో, జేఈవో అందజేసి సత్కరించారు. వారితో పాటు మాజీ గవర్నర్‌ నారాయణన్‌ శ్రీవారిని దర్శించుకున్నారు.
7. చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 9 జయబాదురీ బచ్చన్
1860 : మొదటిసారి మానవుని కంఠధ్వని రికార్డు చేయబడినది. (ఫొనాటోగ్రాఫ్ యంత్రం ద్వారా)
1893 : ప్రముఖ రచయిత, చరిత్రకారుడు, కమ్యూనిస్టు నాయకుడు రాహుల్ సాంకృత్యాయన్ జననం.( మ. 1963)
1930 : ప్రముఖ సినిమా నటుడు మన్నవ బాలయ్య జననం.
1936 : పాలస్తీనాకు చెందిన రచయిత ఘసన్ కనాఫానీ జననం (మ.1972).
1948 : ప్రముఖ హింది నటి, మరియు అమితాబ్ బచ్చన్ భార్య జయ బచ్చన్ జననం.
1989 : ప్రముఖ నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు ఏ.యం.రాజా మరణం (జ.1929).
1994 : ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు చండ్ర రాజేశ్వరరావు మరణం (జ.1915).
2011 :అన్నా హజారే కు ఐ.ఐ.పి.ఎం రవీంధ్రనాథ్ ఠాగూర్ అంతర రాష్ట్రీయ శాంతి పురస్కారం లభించింది
8. శుభమస్తు
తేది : 9, ఏప్రిల్ 2019
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : చైత్రమాసం
ఋతువు : వసంత ఋతువు
కాలము : వేసవికాలం
వారము : మంగళవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : చవితి
(నిన్న సాయంత్రం 4 గం॥ 14 ని॥ నుంచి
ఈరోజు సాయంత్రం 4 గం॥ 4 ని॥ వరకు)
నక్షత్రం : కృత్తిక
(నిన్న ఉదయం 9 గం॥ 42 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 10 గం॥ 18 ని॥ వరకు)
యోగము : ఆయుష్మాన్
కరణం : వణిజ
వర్జ్యం : ఈరోజు వర్జ్యం లేదు.
అమ్రుతఘడియలు : (ఈరోజు ఉదయం 7 గం॥ 50 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 28 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 8 గం॥ 33 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 22 ని॥ వరకు)(ఈరోజు ఉదయం 10 గం॥ 43 ని॥ నుంచి ఈరోజు ఉదయం 11 గం॥ 32 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు సాయంత్రం 3 గం॥ 23 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 56 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 12 గం॥ 17 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 50 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 9 గం॥ 11 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 44 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 5 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 30 ని॥ లకు
సూర్యరాశి : మీనము
చంద్రరాశి : వృషభము