Food

బంగాళాదుంపలు మెదడుకు రక్షణ

Potatoes Protect Brain-Telugu Food And Diet News

ప్రపంచంలో ఒక్క మానవుడికి తప్ప ఏ ఇతర జీవులకీ వాటి శరీర పరిమాణానికి తగిన మెదడు పరిమాణం లేదు. మానవుడిలో ఈ విధంగా మెదడు పెరగడానికి కారణం పిండిపదార్థాలట. కొన్ని వందల సంవత్సరాల నుంచి మానవుడి మెదడు అభివృద్ధి చెందడంలో ప్రముఖ పాత్ర కార్బోహైడ్రేట్లదేనని బార్సిలోనా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రాచీనకాలంలో మానవుడికి బంగా ళాదుంపలు, గింజలు, పండ్ల ద్వారా కార్బోహైడ్రేట్లు ఎక్కువగా లభించేవనేది వారి పరిశీలన. ఈ పరిశోధనలో భాగంగా పురావస్తు, మానవ విజ్ఞాన శాస్త్రాలు ఇతర పరిశోధన ఫలితాలకు సంబంధించిన సమాచారాన్ని శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. ‘‘ప్రస్తుత సమాజంలో చాలామంది మెదడు ఎదుగుదలకు జంతువుల నుంచి లభించే ప్రొటీన్లపైనే ఆధారపడుతున్నారు. ప్రకృతిలో లభించే పిండిపదార్థాలు మానవుడి మెదడు ఎదుగుదలకు చాలా ఉపకరిస్తాయి. రక్తంలోని 60శాతం గ్లూకోజ్‌ని, శరీరంలోని 25శాతం శక్తినీ మెదడు వాడుకుంటుంది. తక్కువ కార్బోహైడ్రేట్లు ఉన్న పదార్థాలను తిన్నప్పుడు మెదడుకి సరైన పరిమాణంలో గ్లూకోజ్‌ అందదు. అందువల్ల పిండిపదార్థాలు ఎక్కువగా ఉండే వాటిని తినడం వల్ల మెదడు పరిమాణంగానీ, పనితీరుగానీ మెరుగ్గా ఉంటుంది. అయితే పచ్చివాటిని నేరుగా తింటే అవి జీర్ణంకావడం చాలా కష్టం అందుకని వాటిని ఉడికించుకొని తినాలి’’ అని బార్సిలోనా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్త డాక్టర్‌ కరెన్‌ హార్డీ అంటున్నారు.