Movies

అమ్మకు క్యాన్సర్ అయితే నాకు పొగరు అంటారు

nithya menen clarifies producers threat to ban her

స్క్రిప్టు ఎంపికలో కథానాయిక నిత్యా మేనన్‌ది చాలా ప్రత్యేక శైలి. పాత్ర అన్ని విధాలుగా నచ్చితే తప్పా ఆమె సంతకం చేయడం కష్టం. కాగా ఓ ప్రాజెక్టు విషయంలో నిర్మాతలతో సమావేశం కావడానికి ఇటీవల నిత్యా నిరాకరించారట. ముందస్తు సమాచారం ఇవ్వకుండా సినిమా సెట్‌కు వచ్చిన వారితో ఆమె మాట్లాడలేదు. ఈ నేపథ్యంలో మాలీవుడ్‌లో ఆమెపై నెగిటివ్‌ ప్రచారం జరుగుతోంది. ఆమెకు పొగరని, మాలీవుడ్‌ నుంచి నిషేధిస్తామని కొందరు నిర్మాతలు బెదిరించినట్లు ఓ ఆంగ్లపత్రిక పేర్కొంది. ఈ ప్రచారం గురించి నిత్యా తాజా ఇంటర్వ్యూలో స్పందించారు. ‘మా అమ్మ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. వ్యాధి మూడో దశలో ఉంది. షూటింగ్‌ సమయంలో మా అమ్మ గుర్తుకు వచ్చినప్పుడల్లా వ్యాన్‌లోకి వెళ్లి ఏడుస్తుంటా. నాకు మైగ్రేన్‌ ఉంది, ఆ సమయంలో (నిర్మాతలు వచ్చినప్పుడు) ఎవరితోనూ మాట్లాడే స్థితిలోలేను. దీంతో నాపై ‘పొగరు’ అనే మార్క్‌ పడింది. ఇలాంటివి నేను పట్టించుకోను. పనిమీద మాత్రమే ఏకాగ్రత పెడతా’ అని నిత్యా తెలిపారు. ప్రస్తుతం ఆమె తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌ ‘ఐరన్‌ లేడీ’లో నటిస్తున్నారు. ఆమె చేతిలో ‘కొలంబి’, ‘సైకో’, ‘మిషన్‌ మంగళ్‌’ తదితర చిత్రాలు ఉన్నాయి. తెలుగులో ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తీస్తున్న ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సినిమాలోనూ నిత్యా నటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆమె యువతి పాత్రలో కనిపించనున్నారట.