Politics

జగన్‌పై కేసీఆర్‌కు కోపం వచ్చింది

KCR Expresses Disappointment On Jagan Over Srisailam Lift Irrigation

శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని లిఫ్టు చేస్తూ కొత్త ఎత్తిపోతల పథకం నిర్మించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయించడం తీవ్ర అభ్యంతరకరమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధమన్నారు. తెలంగాణను సంప్రదించకుండానే ఉమ్మడి ప్రాజెక్టు అయిన శ్రీశైలం నీటి విషయంలో నిర్ణయం తీసుకోవడం, అపెక్స్‌ కమిటీ ఆమోదం లేకుండా కొత్త ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టడం ఏపీ చేసిన తప్పిదాలుగా సీఎం పేర్కొన్నారు. తెలంగాణ ప్రయోజనాలకు తీవ్ర భంగకరమైన ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి న్యాయపోరాటం చేస్తామని ఆయన ప్రకటించారు. దీనిపై వెంటనే కృష్ణా నీటి యాజమాన్య నిర్వహణ బోర్డు(కేఆర్‌ఎంబీ)లో తెలంగాణ ప్రభుత్వం తరఫున ఫిర్యాదు చేయాలని అధికారులను ఆదేశించారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మూడు టీఎంసీల నీటిని లిఫ్టు చేసే విధంగా కొత్త ఎత్తిపోతల పథకం చేపట్టడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసింది. ఈ అంశంపై కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో సోమవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.