Health

చిగుళ్ల వాపు తగ్గేది ఎలా?

How to fight gum diseases

దంతక్షయం, దంతాల మ‌ధ్య సందులు, దంతాల్లో ఆహార పదార్థాలు ఇరుక్కుపోవడం… ఇలా కారణమేదైనప్పటికీ దంతాలు, చిగుళ్ల నొప్పి, ఇత‌ర స‌మ‌స్య‌ల‌తో మనలో అధిక శాతం మంది ఏదో ఒక సందర్భంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే మన ఇండ్లలో ఉండే వివిధ రకాల పదార్థాలతోనే ఆయా స‌మ‌స్య‌లను సులభంగా తగ్గించుకోవచ్చు. మ‌రి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందామా..!

1. ఒక చిన్న బ్యాగ్‌లో ఐస్ క్యూబ్స్‌ను తీసుకోవాలి. అనంతరం ఆ బ్యాగ్‌ను దవడపై నొప్పి ఉన్న ప్రదేశంలో ఉంచాలి. ఇదే సమయంలో నోట్లో గోరు వెచ్చని ఉప్పు నీటిని వేసుకుని 5 నుంచి 7 సెకండ్ల పాటు అలాగే ఉంచాలి. ఇదే పద్ధతిలో సుమారు 5 నుంచి 10 నిమిషాల వరకు నొప్పి తగ్గేంత వరకు చేస్తే ఫలితం ఉంటుంది.

2. దంత సంబంధ సమస్యలను తొలగించడంలో ఉల్లి, వెల్లుల్లిపాయలు సమర్థవంతంగా పనిచేస్తాయి. నొప్పి దంతాలు లేదా చిగుళ్లపై బాగా నలిపిన వెల్లుల్లి లేదా ఉల్లిపాయను కొంత సేపు ఉంచాలి. లేదా వెల్లుల్లి పేస్ట్‌ను రాక్‌సాల్ట్‌తో కలిపి ఇలా చేసినా ఫలితం ఉంటుంది. ఇవి కేవలం నొప్పులనే కాదు, దంతాలను దృఢంగా చేసేందుకు కూడా ఉపయోగపడతాయి.

3. గోధుమ గడ్డి రసం దంత సంబంధ సమస్యలను దూరం చేస్తుంది. నిత్యం తగిన మోతాదులో దీన్ని తీసుకుంటే దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. నొప్పులు కూడా దూరమవుతాయి.

4. దంతాలు, చిగుళ్ల నొప్పులను తగ్గించడంలో నిమ్మ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. పొట్టు తీయకుండానే ఒక చిన్నపాటి నిమ్మ పండు ముక్కను నమిలితే ఫలితం ఉంటుంది. ఇంగువ, నిమ్మరసంలను కలిపి పేస్ట్‌లాగా చేసిన మిశ్రమాన్ని వేడి చేసి దీన్ని ఓ చిన్న కాటన్ బడ్ సహాయంతో నొప్పి ఉన్న ప్రదేశంలో రాసినా చాలు. ఇది దంతాల నొప్పులకు తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.

5. కాటన్‌బాల్ సహాయంతో కొద్దిగా లవంగనూనెను దంతాలపై పూయాలి. ఇది నొప్పులను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. కొద్దిగా మిరియాల పొడిలో 3 నుంచి 4 డ్రాప్స్ లవంగనూనెను కలిపి నొప్పి ఉన్న ప్రదేశంలో రాసినా ఆశించిన ఫలితాలు వస్తాయి.

6. పసుపులో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు దంత సంబంధ సమస్యలను తొలగిస్తాయి. కొద్దిగా పసుపును నొప్పి ఉన్న ప్రదేశంలో రాస్తే తక్షణమే ఉపశమనం లభిస్తుంది.

7. ఒక కప్పు నీటిలో కొద్దిగా ఉప్పు, 5 గ్రాముల పుదీనా ఆకును వేసి మరిగించాలి. అనంతరం ఆ ద్రవాన్ని చల్లార్చి తాగాలి. ఇది దంతాలు, చిగుళ్ల నొప్పులను ప్రభావవంతంగా తగ్గిస్తుంది.

8. ఆవనూనె, రాక్‌సాల్ట్ రెండింటినీ బాగా కలిపి ఆ మిశ్రమాన్ని నొప్పి ఉన్న ప్రదేశంలో రాయాలి. 5 నిమిషాల తరువాత నీటితో పుక్కిలించాలి. ఇలా చేస్తే సమస్య బారి నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

9. చిన్న అల్లం ముక్కను రోజూ నమిలితే దంతాలు, చిగుళ్ల సంబంధ సమస్యలు దూరమవుతాయి.