Business

చైనా దిగుమతులపై ఇండియా ఉక్కుపాదం-వాణిజ్యం

TNILIVE Business News Roundup Today - India To Reduce Chinese Imports

* చైనాతో సరిహద్దు ప్రతిష్టంభన, పెరిగిన ఉ‍ద్రిక్తతల నేపథ్యంలో డ్రాగన్‌పై నలువైపులా ఒత్తిడి పెంచేందుకు భారత్‌ సిద్ధమవుతోంది. టిక్‌టాక్‌ సహా చైనాకు చెందిన 50 యాప్‌లను ఇప్పటికే బహిష్కరించిన ప్రభుత్వం బీజింగ్‌ నుంచి దిగుమతులను నియంత్రించేందుకు అవసరమైన చర్యలను సూచించాలని పీఎంఓ వాణిజ్య మంత్రిత్వ శాఖను కోరింది. గల్వాన్‌ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు మరణించిన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డ్రాగన్‌పై పెంచుతున్నదౌత్య, ఆర్థిక ఒత్తిళ్లలో భాగంగా ఈ ప్రక్రియ సాగుతోంది. చైనా నుంచి దిగుమతులను వీలైనంతగా తగ్గించేందుకు సూచనలు ఇవ్వాలని పీఎంఓ అధికారులు వాణిజ్య మంత్రిత్వ శాఖను కోరినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇతర దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (ఎఫ్‌టీఏ)ను సైతం పీఎంఓ సమీక్షిస్తోంది. ఎఫ్‌టీఏ పేరుతో భారత్‌కు చవకైన వస్తువులను గుమ్మరిస్తున్న దేశాలకు చెక్‌ పెట్టేందుకు కూడా ప్రభుత్వం సంసిద్ధమైంది. స్వయం సమృద్ధ భారత్‌ నినాదం కింద చైనా సహా ఇతర దేశాల నుంచి దిగుమతులను గణనీయంగా తగ్గించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

* కరోనా మహమ్మారి ప్రకంపనలు ప్రముఖ టెక్ సేవల సంస్థ టెక్ మహీంద్రను తాకాయి. గత వారంలో ఏడుగురు ఉద్యోగులు కరోనా బారిన పడటంతో ఒడిశా రాజధాని నగరం భువనేశ్వర్ లోని టెక్ మహీంద్ర కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. భువనేశ్వర్ మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంపీ) మంగళవారం నగరంలోని టెక్ మహీంద్ర క్యాంపస్‌కు సీలు వేసింది.

* కరోనా మహమ్మారి కల్లోలంతో ఆటో దిగ్గజం బజాజ్ ఆటో తీవ్ర ఇబ్బందులు పడుతోంది. కంపెనీకి సంబంధించిన ముంబై వాలూజ్ ప్లాంట్‌లో కోవిడ్‌ కేసులు తాజాగా 400కు పెరిగాయి. దీంతో కార్మికులు ప్లాంట్‌కు వచ్చేందుకు హడలిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్లాంట్‌ ను తాత్కాలికంగా మూసివేయాలనే డిమాండ్ ఊపందుకుంది.

* స్వల్ప ఒడిదొడుకుల మధ్య వరుసగా ఐదో రోజూ దేశీ స్టాక్‌ మార్కెట్లు ర్యాలీ చేశాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ప్రాధాన్యం ఇవ్వడంతో చివరికి సెన్సెక్స్‌ 187 పాయింట్లు జమ చేసుకుని 36,675 వద్ద ముగిసింది. గత 4 రోజుల్లో సెన్సెక్స్‌ 1572 పాయింట్లు జంప్‌చేసిన విషయం విదితమే. ఇకనిఫ్టీ 36 పాయింట్లు బలపడి 10,800 వద్ద నిలిచింది. కాగా.. సెన్సెక్స్‌ ఒక దశలో 36,271 వద్ద కనిష్టానికి చేరగా.. 36,723 వద్ద గరిష్టాన్నీ తాకింది. ఈ బాటలో నిఫ్టీ 10814-10690 పాయింట్ల హెచ్చుతగ్గులను నమోదు చేసుకుంది. సోమవారం యూరోపియన్‌, యూఎస్‌ మార్కెట్లు 2 శాతం స్థాయిలో లాభపడటంతో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. అయితే ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడంతో మార్కెట్లు కొంతమేర ఆటుపోట్లు చవిచూసినట్లు తెలియజేశారు.

* మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ షేర్లు ఈ జూన్‌1 తేది నుంచి లార్జ్‌క్యాప్‌ షేర్ల కంటే అధిక లాభాల్ని ఆర్జిస్తున్నాయి. లాక్‌డౌన్‌ విధింపుతో రిటైల్‌ ఇన్వెస్టర్లు స్టాక్‌మార్కెట్లోకి రావడం ఇందుకు కారణమైనట్లు మార్కెట్‌ నిపుణులు భావిస్తున్నారు. ఈ జూన్‌ 1నుంచి బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 13.6శాతం, స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ 17.2శాతం ర్యాలీ చేయగా, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ మాత్రం 12.50శాతం మాత్రమే పెరిగింది. గత కొన్నేళ్లుగా ర్యాలీలో వెనుకబడిన రియల్‌ ఎస్టేట్‌, ప్రభుత్వరంగ బ్యాంక్స్‌లకు చెందిన మధ్య, చిన్న తరహా కంపెనీల షేర్లకు అధికంగా కొనుగోళ్ల మద్దతు లభించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. రిటైల్‌ ఇన్వెస్టర్ల మార్కెట్‌ పతనంలో భాగంగా కనిష్టస్థాయిలకు పతమైన మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్లను అధికంగా కొనుగోలు చేశాయని బ్రోకరేజ్‌ సంస్థలు తెలిపాయి.