NRI-NRT

నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ పేరు

నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ పేరు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నోబెల్‌ శాంతి బహుమతి-2021కు నామినేట్‌ అయ్యారు. ఇజ్రాయెల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) మధ్య శాంతి ఒప్పందాన్ని కుదిర్చినందుకుగానూ ఆయన పేరును నార్వేజియన్ పార్లమెంట్‌ సభ్యుడు క్రిస్టియన్ టైబ్రింగ్ జెజెడ్డే నామినేట్‌ చేశారు. టైబ్రింగ్ జెజెడ్డే నార్వేజియన్ పార్లమెంటులో నాలుగుసార్లు సభ్యుడు. నాటో పార్లమెంటరీ అసెంబ్లీకి నార్వేజియన్ ప్రతినిధిగా పనిచేస్తున్నారు. యూఏఈ, ఇజ్రాయెల్ మధ్య మెరుగైన సంబంధాల స్థాపనలో కీలక పాత్ర పోషించినందుకు ట్రంప్‌ పేరును నోబెల్‌ శాంతి బహుమతికి నామినేట్‌ చేసినట్లు జెజెడ్డే పేర్కొన్నారు. ట్రంప్‌ వివిధ దేశాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు ఇతర నామినీలకంటే ఎక్కువ కృషిచేశారని తాను భావిస్తున్నట్లు జెజెడ్డే చెప్పారు. మధ్యప్రాచ్యం నుంచి పెద్ద సంఖ్యలో అమెరికా దళాలను ఉపసంహరించుకున్నందుకు ట్రంప్‌ను ఆయన ప్రశంసించారు. అయితే, నవంబర్‌లో అమెరికాలో ఎన్నికలు జరుగనున్న వేళ ట్రంప్‌ పేరు నోబెల్‌ శాంతి బహుమతికి నామినేట్‌ కావడం గమనార్హం. ఇదిలా ఉండగా, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా 2009 లో నోబెల్‌ శాంతి బహుమతి అందుకున్నాడు. అంతర్జాతీయ దౌత్య సంబంధాల బలోపేతానికి, ప్రజల మధ్య సహకారాన్ని పెంపొందించినందుకుగానూ ఒబామాకు ఈ బహుమతి దక్కింది.