NRI-NRT

బైడెన్ బలహీనుడు…చైనా వికృత వ్యాఖ్యలు

China Happy Over Biden's Win - Says He Is Weak

అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌ ఎన్నిక కావడంతో చైనా కాస్త ఊపిరి పీల్చుకున్నట్లు కనిపించింది. బైడెన్‌ పాలనలో అమెరికాతో సంబంధాలు మెరుగుపడుతాయని చైనా భావిస్తున్నట్లు అంతర్జాతీయంగా వినిపిస్తున్న మాట. అయితే, ఇలాంటి భ్రమను వదిలేయాలని, అమెరికాపై కఠినమైన వైఖరికి సిద్ధంగా ఉండాలని చైనా ప్రభుత్వ సలహాదారులే హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా బైడెన్‌ చాలా బలహీన అధ్యక్షుడని, ఆయన యుద్ధాలకు సైతం వెనకాడరని అభిప్రాయపడుతున్నారు.

బైడెన్‌ అధ్యక్షుడైనంత మాత్రన ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు సమసిపోతాయన్ని భ్రమలో ఉండకూడదని చైనాలోని అడ్వాన్స్‌డ్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్లోబల్‌ అండ్‌ కాన్‌టెంపరరీ చైనా స్టడీస్‌ సంస్థ డీన్‌ జేంగ్‌ యోంగ్‌నియాన్‌ స్పష్టంచేశారు. ‘అమెరికాలో ప్రచ్ఛ్రన్న యుద్ధం కోరుకుంటున్న వారిసంఖ్య చాలా కాలంగా పెరిగిపోయింది. అయితే, ఇవన్నీ రాత్రికి రాత్రే సమసిపోవు. చైనాపై ఆగ్రహంగా ఉన్న అమెరికా ప్రజల మనోభావాలకు అనుగుణంగా బైడెన్‌ వ్యవహరించే అవకాశం ఉంది. దీంతో అమెరికా అధ్యక్ష భవనంలోకి అడుగుపెట్టిన తర్వాత బైడెన్‌ చైనాపై వ్యతిరేక చర్యలు ప్రారంభించే అవకాశం ఉంది’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

‘బైడెన్‌ కచ్చితంగా చాలా బలహీనమైన అధ్యక్షుడు, ఒకవేళ దేశంలోని సమస్యలను ఆయన పరిష్కరించలేకపోతే, దౌత్యపరంగా ఆయన ఎదో చేస్తాడు. దీంతో చైనాకు వ్యతిరేకంగా చర్యలు ప్రారంభించవచ్చు. స్వేచ్ఛా, ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించడం ట్రంప్‌నకు ఇష్టం లేదు, బైడెన్‌కు మాత్రం ఉంది. డొనాల్డ్‌ ట్రంప్‌నకు యుద్ధాలపై ఆసక్తి లేదు. కానీ, డెమొక్రాటిక్‌ నేత బైడెన్‌ మాత్రం యుద్ధాలు ప్రారంభించే అవకాశం ఉంది’ అని జేంగ్‌ యోంగ్‌నియాన్‌ చైనా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇప్పటికే చైనాకు వ్యతిరేకంగా ట్రంప్‌ తీసుకున్న నిర్ణయాలను డెమొక్రాట్లు కూడా సమర్థించారు. అంతేకాకుండా ఎన్నికల ప్రచారంలోనూ చైనాకు వ్యతిరేకంగా బైడెన్‌ చేసిన ఘాటు వ్యాఖ్యలను ఆయన మరోసారి గుర్తుచేశారు. ఇలాంటి నేపథ్యంలో చైనా విషయంలో అమెరికాలోని రెండుపార్టీలు ఒకేవిధంగా స్పందించే అవకాశం ఉంది. అందుకే ఇరుదేశాల మధ్య సంబంధాలను చక్కదిద్దడానికి వచ్చిన ప్రతి అవకాశాన్ని చైనా సద్వినియోగం చేసుకోవాలని చైనా ప్రభుత్వానికి సూచించారు.

ట్రంప్‌ హయాంలో వాణిజ్య యుద్ధం, మానవ హక్కులతో పాటు కరోనా వైరస్‌ అంశాల కారణంగా చైనా, అమెరికా మధ్య సంబంధాలు మరింత క్షీణించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జో బైడెన్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన నేపథ్యంలో ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుగుపడుతాయని చైనా ప్రభుత్వం భావిస్తోంది. కానీ, బైడెన్‌ హయాంలోనూ ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని చైనా విదేశాంగ నిపుణులు ఇప్పటికే అభిప్రాయపడ్డారు. తాజాగా మరికొందరు ప్రభుత్వ సలహాదారులు కూడా ఇదే విధమైన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.