Fashion

నిధినిక్షేపాలు దొరికాయా! నిధినిక్షేపాలంటే ఏమిటో తెలుసా ?

నిధినిక్షేపాలు దొరికాయా! నిధినిక్షేపాలంటే ఏమిటో తెలుసా ?

భూమిని అమ్మాలన్నా కొనాలన్నా మనం పత్రాలలో వ్రాసుకొంటాం. వాటినే ఆంగ్లంలో నాన్ జ్యూడిషియల్‌ స్టాంప్ పేపర్లని అంటాం. పత్రంవ్రాసుకొని సబ్ రిజిస్ట్రారు కార్యాలయంలో నమోదు (రిజిస్టర్) అయిన తరువాత వాటిని డాక్యూమెంట్స్ (సాక్షాధారపత్రం) అని అంటాం.

గతంలో వ్రాతలన్ని పత్రాలపైనే వ్రాసుకొనేవారు. పత్రాలంటే ఆకులని అర్థం కదా. మనవారు తాటిఆకులపైన వ్రాసేవారు. ఇంకా బూర్జచెట్టు కాండపుబెరడును తీసి పులియబెట్టి చదునుచేసి పదును పెట్టి ఆరబెట్టి ఆపై అవి వంగిపోకుండా నలుచతరపు బరువులనెత్తి ఆపై అవసరమున్నపుడు వ్రాసుకొనేవారు. బూర్జపత్రాలను ఉత్తరభారతంలో తాటిపత్రాలను దక్షిణభారతదేశంలో ఉపయోగించేవారు.

పూర్వకాలంలో విక్రయపత్రాలను శ్రావణసుద్ధి, శ్రావణపత్రం, శ్రావణసహితం అని పిలిచేవారు.

విక్రయదారు అనగా అమ్మకందారు ఒకసారి భూమిని అమ్మివేస్తే విక్రయించుకొన్నవాడికి అనగా కొనుగోలుదారునికి అష్టభోగ హక్కులు లభించేవి. అష్ట అంటే ఎనిమిది, భోగమంటే అనుభవించుకోవడం. అష్టభోగాన్నే అష్టభోగస్వామ్యం, అష్టభోగతేజస్వామ్యం అష్టభోగసంపదలని కూడా పిలిచేవారు.

ఏమా అష్టభోగాలంటే

(1) నిధి > భూమిలో సహజసిద్ధంగా లభించే సంపదలు.ఉదా॥వజ్రవైడూర్యరత్నమాణిక్య మణులు. ఈ నిధులపై కొనుగోలుదారుకే సర్వహక్కులు వుండేవి.

(2) నిక్షేపాలు > భూమిలో ఉద్దేశ్యపూర్వకంగా దాచిన సంపదలు. దోపిడిదొంగలు దాడిచేస్తారని, యుద్ధానంతరం గెలిచిన రాజకీయం దోచుకొంటుందని, దాయాదులు బంధువులు వాటాలు అడుగుతారని కొందరు ఇంటిగోడలలో, పొలాలలో గోయితవ్వి తన సంపదను దాచిపెట్టేవారు. ఇలా ఉద్దేశ్యపూర్వకంగా దాచిన నిక్షేపాలు ఏ విధంగా బయటపడినా అవి కొనుగోలుదారుకే స్వంతం.

(3) జలాలు అంటే నీరు. పొలంలో అదివరకేవున్న నది, చెరువు కాలువలు,బుగ్గ, చెలమ, వాగు వంకలు, తలిపెరలు, బావి, నూయి, దరువు, నీటిబుగ్గలు, కుంటలు మొదలైన జలవనరులన్నింటి మీద విక్రయించుకొన్నవారికే హక్కులు వుండేవి.

(4) పాషాణం > ఖనిజాలు > రాళ్ళురప్పలు గుండులు బండలు కొండలు మొదలైనవి, ఇంకా బంగారు, వెండి, రాగి, ఇనుము వంటి ఖనిజాలు.

(5) అక్షిణి > పైవికాకుండా అప్పటికే కొనుగోలుచేసిన భూమిపైగల సకలవస్తువులు. చప్పరాలు, సత్రాలు, దద్దలాలు, కొట్టాలు, పాకలు, చెట్లుచేమలు మొదలైనవి.

(6) ఆగామి > భవిష్యత్తులో సంభవించే అన్నిరకాల ఆస్తులపై హక్కులు.

(7) సిద్ధము > అప్పటికే సాగు (వ్యవసాయం )లోనున్న భూమి.

(8) సాధ్యం > కొనుగోలు సమయానికే కాపుకు వచ్చిన పంటలు.
మరి తావులలో బంజరుభూమనే అర్థంకూడా వుంది.

జలతరుపాషాణాదులని కూడా అనేవారు.

ఈ ఎనిమిది భోగాలతో కొనుగోలుదారు పుత్రపౌత్ర ప్రపౌత్ర వంశపారంపర్యంగా అనుభవించుకోవచ్చును.