Agriculture

సాగులో అద్భుతాలు సృష్టిస్తున్న ఆ మాజీ శాసనసభ్యురాలు

సాగులో అద్భుతాలు సృష్టిస్తున్న ఆ మాజీ శాసనసభ్యురాలు

ఆమె మాజీ శాసనసభ్యురాలు. రాజకీయాల్లో ఉన్నత పదవులు చేపట్టారు. తన పదవీకాలంలో కార్మికులకు, కర్షకులకు అండగా నిలిచారు. అయినా, మనసులో ఏదో వెలితి. తల్లిదండ్రులు ఇచ్చిన భూమి, వారు చూపిన తోవే తన భవిష్యత్తుకు బాటగా అనిపించింది. అందుకే, ఓవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే, నేలతల్లి వైపు అడుగులు వేశారు. రాళ్ల పొలాన్ని రతనాల భూమిగా మార్చి, సిరుల పంటలు పండిస్తున్నారు కాట్రగడ్డ ప్రసూన.

**సనత్‌నగర్‌ మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూనకు బాల్యం నుంచీ వ్యవసాయం అంటే మక్కువ. అందుకోసమే, రాజకీయాల్లో తీరిక లేకుండా ఉన్నప్పటికీ, సాగువైపు అడుగులు వేశారు. హైదరాబాద్‌ శివారులో తమ వ్యవసాయ భూమిలో వినూత్న పంటలు సాగు చేస్తూ, శభాష్‌ అనిపించుకుంటున్నారు. మొదట్లో వ్యవసాయ అధికారుల సూచన మేరకు పండ్ల తోటలు వేశారు. బత్తాయి, నిమ్మ, దానిమ్మ, మామిడి, అరటి, బొప్పాయి.. ఇలా అనేక రకాల పండ్ల మొకలను ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించి నాటారు. వీటితోపాటు వివిధ రకాల కూరగాయలు, ఆకు కూరలను పండిస్తున్నారు. వీరి వ్యవసాయ క్షేత్రంలో దాదాపు 1600 రకాల భిన్నమైన మొకలను పెంచుతున్నారు. సాగునీటి కోసం తమ వ్యవసాయ క్షేత్రంలోనే రెండెకరాల్లో రెండు పెద్ద కుంటలను తవ్వించారు. నీటి వృథాను తగ్గించేందుకు బిందు సేద్యాన్ని ఆశ్రయించారు. పొలంలో సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు చేసి, విద్యుత్‌ను ఆదా చేస్తున్నారు.

**సేంద్రియ పద్ధతుల్లోనే..
వ్యవసాయంలో లాభాల కన్నా, వినియోగదారుల ఆరోగ్యమే ముఖ్యమని భావించారు ప్రసూన. అందుకోసమే, ఎలాంటి రసాయనాలూ ఉపయోగించకుండా, సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నారు. వేప, ఆముదపు పిండి, ఆవు పేడ, గో మూత్రం ఉపయోగించి ఎరువులు తయారు చేయిస్తున్నారు. వేప కషాయం, మజ్జిగ, శనగ పిండి, నల్లబెల్లం ఉపయోగించి తెగుళ్లు సోకకుండా కాపాడుతున్నారు. ఇప్ప పువ్వు నూనె, వేప నూనెతో చీడపీడలను నివారిస్తున్నారు. ప్రసూన వ్యవసాయ క్షేత్రంలో వివిధ పనుల కోసం నిత్యం పదుల సంఖ్యలో మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. ఎరువుల తయారీ, కలుపు తీయడం, మందుల పిచికారీ, కాయలు కోయడం లాంటి పనులను కూలీలతో కలిసి స్వయంగా చేస్తారు.
katragadda-jpg1
**రుద్రాక్షలు పండిస్తూ..
ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉన్న రుద్రాక్షలను తన వ్యవసాయ క్షేత్రంలో పండిస్తున్నారు ప్రసూన. సాధారణంగా నేపాల్‌లో మాత్రమే దొరికే రుద్రాక్షలను నగరంలో ఉత్పత్తి చేస్తూ చరిత్ర సృష్టించారు. తమలపాకుల్లో ప్రత్యేకమైన కలకత్తా ఆకునూ ఇక్కడ సాగు చేస్తున్నారు. ఆరు పదుల వయసులోనూ వినూత్న పంటలు పండిస్తూ, భారీ దిగుబడులు సాధిస్తున్నారు. తమ ఉత్పత్తులను హైదరాబాద్‌ సహా దేశంలోని ప్రధాన నగరాల్లో విక్రయిస్తున్నారు. వ్యవసాయమంటే దండుగ కాదు.. పండుగని నిరూపిస్తున్నారు.

**ఆ వివక్ష పోవాలి..
వ్యవసాయంలో క్రిమిసంహారక మందుల ఉపయోగాన్ని నిర్మూలించాలి. నేల తల్లిని కాపాడుకోవాలి. సమాజంలో రైతు అంటే ఇప్పటికీ ఒకరకమైన చిన్నచూపు ఉంది. ఆ వివక్ష పోవాలి. యువత కూడా వ్యవసాయ రంగంలోకి రావాలి. సేంద్రియ సాగు పెరగాలి. ఆరోగ్యకరమైన సమాజం కేవలం సేంద్రియ వ్యవసాయం ద్వారానే సాధ్యమవుతుంది. ఇప్పటికే మా వ్యవసాయ క్షేత్రంలో రుద్రాక్షలు, కలకత్తా తమలపాకులతోపాటు అనేక వినూత్న పంటలు సాగు చేస్తున్నా. భవిష్యత్‌లోనూ ప్రపంచవ్యాప్తంగా పండే వెరైటీలను ఇక్కడ పండిస్తా. వ్యవసాయంలో దళారీ వ్యవస్థ పోవాలి. రైతు పండించిన పంటకు మారెటింగ్‌ ఇబ్బంది కాకుండా చూడాలి.