DailyDoseNRI-NRT

ఐటీ కొలువులు వ‌దులుకుని కూచిపూడి నృత్యం నేర్చుకుంటున్న మ‌హిళ‌లు

ఐటీ కొలువులు వ‌దులుకుని కూచిపూడి నృత్యం నేర్చుకుంటున్న మ‌హిళ‌లు

భారీ వేతనాలు.. ‘భామా కలాపం’లో సత్యభామ బారెడు జడ ముందు చిన్నబోతున్నాయి. సిలికాన్‌ వ్యాలీ కంటే.. కూచిపూడి అగ్రహారమే గొప్పగా అనిపిస్తున్నది. ఐటీ దిగ్గజాలు .. నారాయణమూర్తి, ప్రేమ్‌జీ, సత్య నాదెళ్ల, సుందర్‌ పిచాయ్‌ల విజయ గాథలతో పోలిస్తే.. వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి, చింతా కృష్ణమూర్తి మొదలైన గురుపరంపర నృత్య ప్రయోగాలే అబ్బురపరిచాయి.

.. ఇంకేముంది, సాఫ్ట్‌వేర్‌ కొలువులు వద్దనుకున్నారు. రాజీనామాలు సిద్ధం చేసుకున్నారు. అద్దాల ఆఫీసులో లాగాఫ్‌ అయిపోయి.. నృత్యాలయంలో లాగిన్‌ అయ్యారు. ఇక్కడ ఒత్తిడిలేదు. అనుక్షణం ఆనంద నర్తనమే. ఎవరో తరుముతున్నట్టు కీబోర్డుపై పరుగులు పెట్టిన వేళ్లు.. నాట్య ముద్రలతో మురిపిస్తున్నాయి. కంప్యూటర్‌ స్క్రీన్‌ కారణంగా అలసిపోయిన కళ్లు.. సువిశాలంగా విప్పారి నవరసాలు పలికిస్తున్నాయి. గంటల తరబడి కుర్చీలకు పరిమితమై బరువెక్కిపోయిన శరీరాలు.. నృత్య సాధనతో తీరైన ఆకృతిని పొందుతున్నాయి. నేడు, అంతర్జాతీయ నృత్య దినోత్సవం. ఈ సందర్భంగా ఐటీ కొలువులను కాదనుకొని.. కూచిపూడి నృత్యం అభ్యసిస్తున్న మహిళల మనోగతాలు..

suama
ఆనందం కోసం నృత్య సాధన – ఎస్‌. సుష్మ
అయిదో తరగతిలో కూచిపూడి సాధన ప్రారంభించాను. ఇంటర్‌కు వచ్చాక హాస్టల్‌లో చేరడంతో బ్రేక్‌ పడింది. బీటెక్‌ తర్వాత మళ్లీ మొదలుపెట్టాను. అంతలోనే ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఎనిమిది నెలలు చేశాను. ఉద్యోగంలో సంతోషం కనిపించ లేదు. బాగా సంపాదించాలనే కోరిక నాకు లేదు. ఈ రోజు ఏం చేశాం? ఇష్టమైనదే చేశామా? అన్న కోణంలోనే ఆలోచిస్తాను. ఇంట్లోవాళ్ల్లు కూడా నచ్చిన పనే చేయమని చెప్పారు. నాకు ఆధ్యాత్మిక భావాలు ఎక్కువ. నృత్యం నా భావాలకు దగ్గరగా ఉంటుంది. అందుకే ఇటువైపు వచ్చాను. ప్రతి రోజూ ఓ నృత్యోత్సవంగా గడిచిపోతున్నది. ఇంతటి ఆనందం ఏ ఉద్యోగంలోనూ పొందలేను.

ABHINAYA
ఉద్యోగానికి ‘టాటా’..– అభినయ
చిన్నప్పుడే నృత్యం నేర్చుకోవాలని అనుకున్నాను. ఇంట్లో వాళ్లెవరూ ఒప్పుకోలేదు. మా అమ్మ రహస్యంగా నన్ను డ్యాన్స్‌ స్కూల్‌కు పంపేది. కూచిపూడి నృత్యంలో డిప్లొమా చేసిన తర్వాత ఇంట్లో వాళ్లకు తెలిసింది. డిగ్రీ తర్వాత టాటా కన్సల్టెన్సీలో జాబ్‌ వచ్చింది. రెండేళ్లు చేశాను. కానీ, నృత్యం కోసం ఉద్యోగం వదిలేయాలని అనిపించింది. ఇంట్లో వాళ్లు వద్దన్నప్పుడు కూడా, మళ్లీ అమ్మే అండగా నిలిచింది. యూట్యూబ్‌లో Abhinaya Kosuru పేరుతో ఒక చానల్‌ నిర్వహిస్తున్నాను. సినిమా పాటలకు శాస్త్రీయ నృత్యం కంపోజ్‌ చేస్తాను. ఆ వీడియోలను ఇందులో అప్‌లోడ్‌ చేస్తాను. నా చానల్‌కి 70 వేల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు.

chandana
విప్రో వద్దు.. డ్యాన్సే ముద్దు!– దేవులపల్లి చందన
మా నాన్న నిజామాబాద్‌ ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తారు. నేను పుట్టి, పెరిగిన వాతావరణం అంతా కళలే. కాబట్టి, చిన్నప్పుడే నృత్యంపట్ల ఇష్టం ఏర్పడింది. డిగ్రీ తర్వాత ఎంపీఏ-కూచిపూడి చదవాలని ప్రయత్నిస్తే సీటు రాలేదు. కానీ ఎంసీఏలో సీటొచ్చింది. అందులో చేరాను. ఎంసీఏ పూర్తయింది. తర్వాత ఎంపీఏకి దరఖాస్తు చేస్తే సీటొచ్చింది. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో విప్రోలో వెబ్‌ డెవలపర్‌ జాబ్‌ కూడా వచ్చింది. దేన్ని ఎంచుకోవాలా అన్న సందిగ్ధం. డ్యాన్స్‌ మీద మక్కువతో ఐటీ ఉద్యోగం వదులుకున్నాను. ఏదో ఒకరోజు కూచిపూడి ప్రొఫెసర్‌ కావాలన్నది నా జీవిత లక్ష్యం!

santhi
ఆ కొలువు నచ్చలేదు– జి. శాంతి
మహబూబ్‌నగర్‌ బాలభవన్‌ స్కూల్లో చిన్నప్పుడు కూచిపూడి నేర్చుకోవడం మొదలుపెట్టాను. ఎంసీఏ తర్వాత బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ జాబ్‌లో చేరాను. కానీ ఎందుకో నచ్చలేదు. నెలలోనే తిరిగొచ్చాను. తర్వాత పెండ్లయింది. ఇద్దరు పిల్లలు. కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే ఫైన్‌ ఆర్ట్స్‌ నేర్చుకోవాలనుకున్నాను. పొద్దున నాలుగు గంటలకు నిద్ర లేచి ఇంటి పనులన్నీ చేసుకుని.. రైలులో హైదరాబాద్‌ వస్తాను. క్లాసులు అయిపోయాక మళ్లీ ఇంటికిపోతాను. అప్పటికి రాత్రి తొమ్మిది అవుతుంది. తిని పడుకునే సరికి పన్నెండు. మా ఆయనకు కర్నూలు బదిలీ అయింది. ఇప్పుడు ఇంకా దూరం. అయినా సరే, పట్టుదలతో వస్తున్నా.

arunakumari
బిడ్డలతో కలిసి– అరుణ కుమారి
మా అమ్మకు నృత్యం అంటే ఇష్టం. ఆరో తరగతిలోనే నృత్య శిక్షణ ఇప్పించింది. ఇంటర్‌ వరకూ సాధన కొనసాగించాను. ఎంసీఏ తర్వాత ఓ ఇంజినీరింగ్‌ కాలేజీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగం వచ్చింది. పెళ్లి తర్వాత ఉద్యోగం మానేశాను. వెంటనే ఇద్దరు పిల్లలు. కొంత తీరిక దొరికాక.. ఏదైనా ఐటీ కంపెనీలో చేరాలని అనుకున్నాను. మా వారు నృత్యం నేర్చుకోమని ప్రోత్సహించారు. చిన్నప్పుడు భరతనాట్యం నేర్చుకున్నాను కాబట్టి ఇప్పుడు కూచిపూడి వైపు మనసు మళ్లింది. నా ఇద్దరు బిడ్డలతో కలిసి సాధన చేస్తున్నా. వెంపటి చిన సత్యంగారి కుమార్తె మేళ్లచెరువు కామేశ్వరి దగ్గర శిక్షణ తీసుకున్నాను. ఇప్పుడు తెలుగు విశ్వవిద్యాలయంలో చేరాను.

bhnu
మంచి మార్పు- వనజా ఉదయ్‌ అధ్యక్షురాలు-నృత్యశాఖ తెలుగు విశ్వవిద్యాలయం
చాలామంది.. అకడమిక్‌గా ఎన్ని కోర్సులు చేసినా.. తమ కలను నిజం చేసుకోవడానికి ఉద్యోగాలు వదిలిపెట్టి మరీ వస్తున్నారు. సంప్రదాయ నృత్యాన్ని కెరీర్‌గా ఎంచుకుంటున్నారు. ఇష్టమైన వ్యాపకంలో పొందే ఆనందం ఎంత డబ్బుపెట్టినా రాదు. కోర్సు పూర్తయ్యాక ఒక శిక్షణా సంస్థను ఏర్పాటు చేసుకుంటే పనివేళలు, పని మన చేతుల్లోనే ఉంటాయి. ఈ వెసులుబాటు ఏ ఉద్యోగంలో ఉండదు. ఇల్లు, పిల్లలు, నృత్య శిక్షణ సంతోషంగా సమన్వయం చేసుకోవచ్చు. వేదికల మీద ప్రదర్శనలు ఇవ్వవచ్చు. ఇదొక మంచి మార్పు. ఇష్టంగా నేర్చుకునే శిష్యులు దొరకడం గురువులకూ గౌరవమే కదా!
b2