Kids

సంతోషాన్ని డబ్బుతో కొనలేం

సంతోషాన్ని డబ్బుతో కొనలేం

ఒక పట్టణంలో ఒక ధనవంతుడు నివసించేవాడు. అతని దగ్గర అన్నీ సమృద్ధిగా ఉండేవి. అదే సమయంలో అతన్ని తెలియని ఆందోళన వెంటాడుతూ ఉండేది. సంతోషం ఉండేది కాదు. ఆ పట్టణానికి దగ్గరలో ఉన్న ఒక పల్లెటూరిలో ఒక సన్యాసి ఉన్నాడని తెలిసి, అతన్ని కలిస్తే తన సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అనుకున్నాడు. మరుసటిరోజు సన్యాసిని కలిసి తన గురించి మొత్తం చెప్పాడు. సంపద ఉన్నా సంతోషం లేదని చెప్పుకొచ్చాడు. అన్నీ విన్న సన్యాసి మరుసటి రోజు రమ్మని, అన్ని చింతలను దూరం చేస్తానని చెప్పి పంపాడు. మరుసటి రోజు ఆ ధనవంతుడు సన్యాసి నివసించే కుటీరం దగ్గరకు వచ్చాడు. ఆ సమయంలో సన్యాసి కుటీరం బయట ఏదో వెతుకుతూ ఉన్నాడు. అది చూసి ‘‘ఏం వెతుకుతున్నారు స్వామీ! ఏదైనా వస్తువు పడిపోయిందా?’’ అని అడిగాడు ధనవంతుడు. అప్పుడు ఆ సన్యాసి ‘‘నా ఉంగరం పడిపోయింది.

దానికోసం వెతుకుతున్నాను’’ అని అన్నాడు. దాంతో ధనవంతుడు కూడా ఉంగరం కోసం వెతకడం మొదలుపెట్టాడు. కాసేపు వెతికిన తరువాత ‘‘ఉంగరం ఎక్కడ పడిపోయింది?‘‘ అని అడిగాడు. అప్పుడా సన్యాసి ‘‘కుటీరంలో’’ అని అన్నాడు. ‘‘కుటీరంలో పడిపోతే అక్కడే వెతకాలి కానీ మీరు బయట ఎందుకు వెతుకుతున్నారు?’’ అని అడిగాడు ధనవంతుడు. ‘‘బాగా అడిగావు. నీ సమస్యకు పరిష్కారం కూడా అందులోనే ఉంది. నీ సంతోషం నా దగ్గర ఉండదు. అది నీ దగ్గరే ఉంటుంది. ధనం ఎంతున్నా దానితో సంతోషాన్ని కొనలేం. నీ దగ్గర ఉన్న సంపదను పేదవాళ్లకు, అవసరం ఉన్న వారికి పంచు. అలా చేయడం వల్ల ఆందోళన దూరమవుతుంది’’ అని హితబోధ చేశాడు సన్యాసి. అప్పటి నుంచి సంపదను ఇతరులకు దానం చేస్తూ ధనవంతుడు సంతోషంగా జీవితం గడిపాడు.