Food

మీ జీవనశైలిలో ఈ ఆహారం ఉంటోందా?

These foods are mandatory for a busy lazy lifestylers-tnilive-మీ జీవనశైలిలో ఈ ఆహారం ఉంటోందా?

జీవనశైలిని, ఆహారపు అలవాట్లను మార్చుకోవడం ద్వారా మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. తన సహజ అలవాట్ల ద్వారా సమస్త జీవానికి ఆవాసమైన భూమిని కూడా ఆరోగ్యంగా ఉంచవచ్చు అంటున్నారు పరిశోధకులు. ఆహార తయారీ సంస్థ నార్, వరల్డ్ వైల్డ్ లైఫ్ (డబ్ల్యూ డబ్ల్యూ ఎఫ్), యూకే సంస్థ పరిశోధకులు కలిసి రకరకాల పరిశోధనలు చేసి మనిషి శరీరంతో పాటు పర్యావరణానికి కూడా మేలు చేసే 50 రకాల ఆహారాల జాబితాను 3సూపర్ ఫుడ్స్2 పేరుతో ఒక నివేదికను రూపొందించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు కొన్ని ఆహారపదార్థాలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. దీనివల్ల ప్రజల ఆరోగ్యంపై, భూమి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతోంది. కేవలం మూడు ధాన్యాలైన బియ్యం, మొక్కజొన్న, గోధుమ వంటివి మొత్తం మానవుల ఆహారంలో 60 శాతం కేలరీలకు కారణమవుతున్నాయి. వీటివల్ల ప్రజలకు తగినంత శక్తి అందుతోంది కానీ ఇలా తక్కువ ఆహారపదార్థాలపై ఆధారపడటం వల్ల ప్రజలకు కావలసినంత విటమిన్లు, మినరల్స్ అందడం లేదు. ఆహారంలో భిన్నమైన పదార్థాలను చేర్చుకోవడం వల్ల వనరుల వినియోగంలోనూ సుస్థిరత వస్తుందని, వన్యప్రాణులకు మేలు కలుగుతుందని 3క్రాప్స్ ఫర్ ద ఫ్యూచర్2 పరిశోధనా సలహాదారు పీటర్ గ్రెగరీ అభిప్రాయం. ఈ సూపర్ ఫుడ్స్ జాబితాలో రకరకాల ఆకుకూరలు, దుంపలు, వేర్లను పొందుపరిచారు పరిశోధకులు. అయితే అందులో భారతీయులు తరచూ వాడే, చిరకాల పరిచయమున్న ఆహారపదార్థాలు చాలానే ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి కొన్ని..
*తోటకూర
నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రదేశాల్లో కూడా తోటకూర పెరుగుతుంది. ఆకులతో పాటు విత్తనాల్లో కూడా పోషకాలు మెండుగా ఉంటాయి. ఆకుల్లో పీచుపదార్థాలు, మెగ్నీషియం, ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయి.
*రాగులు
రాగులకు సహజంగానే కీటక నిరోధక శక్తి ఎక్కువ. ఈ పంట పురుగు మందులపై పెద్దగా ఆధారపడదు. రాగుల్లో పీచుపదార్థాలు, విటమిన్ బి1, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. వేసవి కాలంలో రాగులు చలువనిస్తాయి.
*అనపకాయలు
పంటకు, పంటకూ మధ్య కలుపు నివారణకై పరిరక్షణ పంటగా అనపకాయల పంటను వేస్తుంటారు. ఎలాంటి నేలలోనైనా, వాతావరణ పరిస్థితుల్లోనైనా పెరుగుతుంది ఈ మొక్క. లేతగా ఉన్నప్పుడు లోపలుండే గింజలనే కాకుండా మొత్తం కాయను కూడా తింటారు. కూరలూ చేసుకుంటూ ఉంటారు. ఇందులో ప్రొటీన్, పీచుపదార్థాలు సమృద్ధిగా ఉంటాయి.
*మునగాకు
మునక్కాయలే కాదు, మునగ ఆకుల్లోనూ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆయుర్వేద వైద్య విధానాల్లో మునగాకుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ మొక్కలోని ఎన్నో భాగాలను భారతదేశంతో పాటు ఆసియా వ్యాప్తంగా సంప్రదాయ ఔషధాలుగా వినియోగిస్తున్నారు. మునగాకులో ఎ, బి, సి విటమిన్లు, కాల్షియం, ఐరన్, అమైనో ఆమ్లాలు అధికంగా ఉంటాయి. మునగాకు, మునక్కాయలతో వివిధ రకాల వంటలను తయారుచేస్తారు.
*బొబ్బర్లు
వీటిలో చాలా రకాలున్నాయి. ఇవి మంచి పోషక విలువలను కలిగి ఉంటాయి. వీటితో రకరకాల వంటలను చేస్తారు. ఫోలేట్, మెగ్నీషియం, విటమిన్లు, ప్రొటీన్లు వీటిల్లో అధికంగా ఉంటాయి. ఇవి నైట్రొజన్‌ను అమ్మోనియా మార్చి పర్యావరణానికి మేలు చేస్తాయి.
*పెసర్లు
విటమిన్ బి, ఖనిజ లవణాలు, ప్రొటీన్లను అధికంగా కలిగి ఉంటాయి పెసర్లు. ఇవి కూడా నైట్రొజన్‌ను అమ్మోనియాగా మార్చేందుకు సాయపడతాయి. పెసర పంట ఎండ, కరువు పరిస్థితులను కూడా తట్టుకుంటుంది. అంతేకాదు వేసవి కాలంలో పెసలు చాలా చలువ చేస్తాయి. అందుకే వేసవికాలంలో ఎక్కువగా పెసర వంటలను చేసుకుంటారు.
*సోయా
ప్రతి వంద గ్రాముల సోయాలో దాదాపు 38 గ్రాముల ప్రొటీన్లు ఉంటాయి. ఇది కోడిగుడ్డు కంటే మూడు రెట్లు ఎక్కువ పోషకాలను కలిగి ఉంటుంది. విటమిన్ కె, బిలతో పాటు ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, కాపర్, పొటాషియం, మాంగనీస్, జింక్, సెలీనియం, కాల్షియం వంటి పోషకాలన్నీ ఉంటాయి. సోయాలో ఇన్ని విలువలున్నా నాలుగింట మూడొంతులు పశువులకు మేతగానే వినియోగిస్తున్నారు.
*మైసూర్ పప్పు
మాంసంతో పోలిస్తే మైసూర్ పప్పును ఉత్పత్తి చేయడంలో వెలువడే కర్బన ఉద్గారాలు 43 రెట్లు తక్కువ. ప్రొటీన్లు, పీచుపదార్థాలు, కార్బోహైడ్రేట్లు ఇందులో ఎక్కువగా ఉంటాయి. వీటిని వండటం చాలా తేలిక.
*నాగజెముడు
ఎడారిమొక్క నాగజెముడు చాలామంది తినరు. ఇష్టపడరు. కానీ ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. తక్కువ కేలరీలు, ఎక్కువ పీచుపదార్థాలను కలిగి ఉంటుంది ఈ మొక్క. బరువు తగ్గాలనుకునేవారికి ఈ మొక్క బాగా ఉపయోగపడుతుందని అధ్యయనాల్లో వెల్లడైంది. దీన్ని పశువులమేతగా కూడా ఉపయోగిస్తారు.
*పాలకూర
పాలకూర ఎన్ని విటమిన్లు ఉన్నాయో అందరికీ తెలిసిన విషయమే. ఇందులో ఎ, బి, సి, కె విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇంకా ఐరన్, ఫైటో న్యూట్రియంట్లు అధికంగా ఉంటాయి. చల్లటి వాతావరణంలో ఏడాదంతా పాలకూరను సాగుచేయవచ్చు. పాలకూర చాలా త్వరగా పెరగుతుంది.
*బెండకాయలు
వేడిని, కరువును తట్టుకుని పెరిగే మొక్కల్లో బెండకాయ కూడా ఒకటి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్, లూటెన్, షియాక్షంతిన్ వంటి పోషకాలు ఉంటాయి. బెండకాయలతో ఎలాంటి వంటలను చేసుకుంటారో అందరికీ తెలిసిన విషయమే..
*గుమ్మడి పూలు
గుమ్మడికాయతో పాటు గుమ్మడి పూలు, ఆకులు కూడా తినదగ్గవే. వీటిలో పోషకాలు ఎక్కువగానే ఉంటాయి. వీటి విలువ తెలియకపోవడంతో ఇవి వృథా అవుతున్నాయి. భారతదేశం వంటి పొడిబారిన నేలల్లో గుమ్మడి బాగా పెరుగుతుంది. పూలల్లోని మధ్య భాగం తీసేసి మిగతాది ఆహారపదార్థాల్లో వినియోగించుకోవచ్చు.
*బీట్‌రూట్
బీట్‌రూట్‌లతో పాటు ఆకుల్ని కూడా వంటలకు వాడుకోవచ్చు. ఇందులో కూడా మెగ్నీషియం, పొటాషియం పాళ్లు ఎక్కువగా ఉంటాయి. దాదాపు సగంమంది ప్రజలు రోజూ అవసరమైనంత మెగ్నీషియం తీసుకోరని కొన్ని పరిశోధనల్లో తెలిసింది. ఇందులో ఐరన్‌తో పాటు దృష్టిని పెంచే లూటెన్ కూడా ఉంటుంది.
*నువ్వులు
కాపర్, మెగ్నీషియం నువ్వుల్లో మెండుగా ఉంటాయి. వీటిని పచ్చిగానైనా, వేయించుకునైనా, వంటల ద్వారానైనా తీసుకోవచ్చు. నువ్వుల నూనె ద్వారా చాలా పోషకాలు లభిస్తాయి.
*అవిసె గింజలు
అవిసె గింజల్లో ఆల్ఫా లైనోలెనిక్ యాసిడ్ అనే ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్లు అధికంగా ఉంటాయి. అంతేకాదు ఇవి చాలా పోషకాలను కలిగి ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలుచేస్తాయి. వీటిని పచ్చిగాకానీ, వండి కానీ తీసుకోవచ్చు.
*శెనగలు
ఒక కప్పు శెనగల్ని మొలకెత్తించి తీసుకుంటే దాదాపు పది గ్రాముల ప్రొటీన్లు శరీరానికి లభిస్తాయి. వీటిని తయారుచేసుకోవడం కూడా చాలా సులభం. శెనగల్ని ఎనిమిది గంటల పాటు నానబెట్టి తర్వాత ఆరబెట్టాలి. తిరిగి మళ్లీ నానబెట్టాలి. మొలకలు అనుకున్నంత పొడవు వచ్చేవరకు దీన్ని కొనసాగించాలి. అయితే వీటికి బాక్టీరియా చేరకుండా జాగ్రత్త పడాలి.
*జనపనార విత్తనాలు
ఒకప్పుడు భారత్, చైనా ప్రజల ఆహారంలో జనపనార విత్తనాలకు స్థానం ఉండేది. ఇందులో ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ ఆమ్లాలు, ప్రొటీన్లు, పీచుపదార్థాలు, ఐరన్, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. 30 గ్రాముల విత్తనాలు తీసుకుంటే ఒక గ్రాము పీచుపదార్థాలు, తొమ్మిది గ్రాముల ప్రొటీన్లు శరీరంలోకి చేరతాయి.
*చిలగడదుంప
దీన్ని ఉడకపెట్టుకుని తింటారు. వంటల్లోనూ వాడతారు. ఇందులో ఎ, సి, ఇ విటమిన్లు, మాంగనీస్ తదితర పోషకాలు ఎక్కువగా ఉంటాయి.
*చిక్కుడు
ఇందులో ప్రొటీన్లు, పీచుపదార్థాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిని మాంసానికి ప్రత్యామ్నాయంగా వాడుకుంటారు.