Sports

కోహ్లీసేనకు ఆస్ట్రేలియా చుక్కలు చూపిస్తుంది

Sachin warns team India that Australia will come with full force in CWC 2019

ప్రపంచకప్‌లో టీమిండియా తొలి అడుగు ఘనంగా వేసింది. దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రోహిత్‌శర్మ(122; 144 బంతుల్లో 13×4, 2×6) శతకంతో అదరగొట్టగా.. చాహల్‌ 4/51, బుమ్రా 2/35, భువి 2/44 బంతితో మాయ చేశారు. దీంతో 15 బంతులు మిగిలిఉండగానే కోహ్లీసేన 228 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఇదిలా ఉండగా జూన్‌ 9న ఆస్ట్రేలియాతో జరగబోయే తర్వాతి మ్యాచ్‌ అంత తేలికగా ఉండబోదని టీమిండియా మాజీ క్రికెటర్‌, మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తెందూల్కర్‌ అభిప్రాయపడ్డాడు. ఆయన మాట్లాడుతూ దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో టీమిండియా సంపాదించిన ఆత్మవిశ్వాసాన్ని లోపల సర్ది తదుపరి మ్యాచ్‌కి సన్నద్దమవ్వాలని పిలుపునిచ్చాడు. అలాగే ప్రస్తుతమున్న ఆసిస్‌ జట్టు ఎంతో బలంగా ఉండడంతోపాటు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉందని చెప్పాడు. ‘ఆ జట్టు ఎంత బలంగా ఉన్నా కోహ్లీసేన ముందడుగువేస్తుంది. వారికేం కావాలో దానిపై దృష్టిపెట్టి సాధిస్తారు. ఓవల్‌ వేదికగా జరగబోయే ఈ మ్యాచ్‌ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ పిచ్‌లో బౌన్సింగ్‌ ఎక్కువగా ఉంటుంది. అది ఆసిస్‌ బౌలర్లకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా బౌలింగ్‌ అటాక్‌ మెరుగ్గా ఉంది. అయినా టీమిండియా వారిని ఎదుర్కొంటుంది. గతంలోనూ ఇదే జట్టుపై భారత్‌ మంచి ప్రదర్శనే చేసింది. కోహ్లీసేన వారితో ఆడేందుకు సిద్ధంగా ఉంటుంది. డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌స్మిత్‌ తిరిగి జట్టులో చేరడంతో అది మరింత బలంగా మారింది. ముఖ్యంగా వార్నర్‌ ఐపీఎల్‌లో అద్భుతంగా ఆడాడు. అతడిలో పరుగులు తీయ్యాలనే కసి ఇంకా ఉంది’ అని సచిన్‌ పేర్కొన్నాడు. ఇక కోహ్లీబృందానికి సచిన్‌ పలు సూచనలు చేశాడు. ఒకవేళ ఆసిస్‌ బౌలింగ్‌ ధాటికి వికెట్లు పోయినా దాని గురించి పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పాడు. ఇంగ్లాండ్‌ లాంటి బౌన్సీ పిచ్‌లపై వికెట్లు పడినంత మాత్రాన టీమిండియా తక్కువేమీ కాదని చెప్పాడు. వాళ్లు మనల్ని ఇబ్బంది పెట్టినా మన బౌలర్లు వారిని అడ్డుకుంటారని భరోసా ఇచ్చాడు. అంతిమంగా స్కోరుబోర్డు మీద పరుగులే జట్టు విజయాన్ని నిర్ధేశిస్తుందని చెప్పాడు.