Business

నేడు కోర్టు ఎదుటకు రవిప్రకాశ్ వాంగ్మూలం

Police to submit tv9 raviprakash interrogation report to court

టీవీ 9 వాటాల వివాదంలో ఆ సంస్థ మాజీ సీఈవో రవిప్రకాశ్‌ భవితవ్యం సోమవారం తేలనుంది. తప్పుడు పత్రాల్ని సృష్టించడంతోపాటు సంతకం ఫోర్జరీకి పాల్పడ్డారని రవిప్రకాశ్‌పై అలందా మీడియా సంచాలకుడు కౌశిక్‌రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబరాబాద్‌ పోలీసులు దర్యాప్తు చేశారు. ఈనెల 4-6 తేదీల్లో రవిప్రకాశ్‌ను విచారించారు. ఆయన ఏమాత్రం సహకరించలేదని పోలీసులు పేర్కొంటున్నారు. విచారణ సందర్భంగా ఆయన ఇచ్చిన సమాధానాలతో నివేదిక రూపొందించారు. కౌశిక్‌రావు ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలు తప్పని నిరూపించే ఆధారాలేవీ రవిప్రకాశ్‌ సమర్పించలేకపోయారని పోలీసులు తెలిపారు. ఆయన దర్యాప్తును తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని నిర్ధారణకు వచ్చారు. ఏవైనా అడిగితే తనకు గుర్తు లేదని చెబుతుండటంతో కావాలనే బుకాయిస్తున్నారని వారు నమ్ముతున్నారు. అవే అంశాలతో రూపొందించిన నివేదికను సోమవారం న్యాయస్థానంలో సమర్పించాలని నిర్ణయించారు. కోర్టు ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకొంటామని సైబర్‌క్రైమ్‌ ఏసీపీ శ్రీనివాస్‌ వెల్లడించారు. ఈ పరిణామాల్ని గమనిస్తే రవిప్రకాశ్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు పకడ్బందీ ప్రణాళికను రూపొందించినట్లు కనిపిస్తోంది.