Kids

పిల్లలూ…కొమ్ము-డోలు ఆట తెలుసా?

Komma Dolu Dance By Tribal Indians - Telugu Kids Sports

జానపద కళలన్నీ జనం శ్రమించే సమయంలో కీలకమైన ఆటపాటల నుంచే రూపుదిద్దుకున్నాయి. మనిషికి భాషలేని కాలంలో తన భావ ప్రకటన కోసం సంజ్ఞలతో ఆనందం వ్యక్తం చేయడానికి వేసిన గెంతులు తరువాతి కాలంలో కాలక్రమేణా భాషగా, నృత్యాలుగా మారాయి. అందువల్ల జానపదాల్లో ఎక్కువగా గిరిజన కళలకు ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి కళల్లో ప్రసిద్ధమైనటువంటిదే ‘కొమ్ము-డోలు’ ఆట. ఇది పేరుకి ఆట అయినా నృత్య ప్రధానమైన కళ. గిరిజనుల్లో ప్రత్యేకించి కోయ జాతివారు మాత్రమే ఆడతారు. తలపై గొర్రె గేదె కొమ్ములు తగిలించుకొని, మెడల్లో పెద్దడోలు వేసుకుని ఆడే ఈ ఆటకు ‘కొమ్ము డోలు’ ఆట అని పేరు సార్థకమైంది. దీనిపేరులో ‘ఆట’ అనే శబ్దం ఉన్నా దీన్ని ఒక నృత్యంగా చెప్పవచ్చు. ఎందుచేతనంటే కోయజాతి స్త్రీలు చిన్నాపెద్దా ముదుసలి, అనే తారతమ్యం లేకుండా ఒకరి చేతులు ఒకరు పట్టుకొని, దండకట్టి ‘రేల’ అనే పదంతో విన్యాసాలు చేస్తుండగా పురుషులు గౌన్లు తొడిగి, తలపై కొమ్ములు తగిలించుకొని అవి నిలబడేటట్లు తలపాగా చుడతారు. వెనుక భాగాన తోకలా వేళ్లాడేటట్లు కడతారు. మెడలో తగిలించుకున్న డోలు చాలా పెద్దదిగా ఉంటుంది. డోలుకు వాడే చర్మం మేక చర్మం. ఒకవైపు పుల్లతోను మరొకవైపు చేతితోను ఈ వాద్యాన్ని వాయిస్తారు. ఇలా గెంతుతూ వాయిస్తూ ఉంటే ఆ వాద్యానికి అనుగుణంగా లయబద్ధంగా స్త్రీలు నాట్యం చేస్తారు.ఈ కళలో పురుషులు చేసే నృత్యాన్ని ‘పెర్మికోర్‌’ అంటారు. అడివి దున్నల తలపాగను దృష్టిలో పెట్టుకొని ‘పెర్మికోర్‌’ అనే పేరు వచ్చింది. స్త్రీల నృత్యంతో పోల్చుకుంటే పురుషుల నృత్యం కొంత విలక్షణంగా ఉంటుంది. నృత్యం చేసేవారి సంఖ్య కచ్ఛితంగా ఇంత అని ఉండాలనే నియమం ఏదీ లేదు. సుమారు 10 నుంచి 15 మంది డోళ్లు వాయిస్తూ నృత్యం చేస్తారు. డోళ్లకు అనుగుణంగా లయబద్ధంగా అడుగులు కదిలిస్తూ చుట్టూ వలయాకారంగా తిరుగుతారు. డోళ్ల నాదంతో పోల్చుకుంటే అడుగులు చాలా తక్కువ స్థాయిలో సున్నితంగా కదిలిస్తున్నట్లు అనిపిస్తుంది. వాయిద్యానికి అనుగుణంగా పాదాలు చలించడం వల్ల అది నడకగా కనిపిస్తున్నా.. దాన్ని నృత్యమే అనాలి. ప్రత్యేకమైన వస్త్రధారణ, తలపై కోముశిలు, నెమలి ఈకలు, మెడకు బరువైన డోలు తగిలించుకోవడం వల్ల అడుగులు భారంగా కదలడం సహజమే. వీరు వలయాకారంగా తిరుగుతూ అప్పుడప్పుడూ వలయం మధ్యలోంచి దూసుకువచ్చి కేకలు వేస్తూ, కొమ్ములను ఢకొట్టిస్తారు. ఈ సందర్భంలో వాయిద్యం జోరు ఎక్కువవుతుంది. కేకలతో ఒకరికొకరు ఢకొీట్టుకొంటూ వారి ప్రధానవృత్తి అయిన వేటను ప్రతిబింబిస్తారు. ఈ జానపద కళలో స్త్రీలు ప్రదర్శించే నాట్యాన్ని ‘రేలా నృత్యం’ అంటారు. పురుషుల నృత్యంతో పోల్చుకుంటే వీరు ప్రదర్శించేది లాస్యంగాను, గేయ సహితంగాను, వాయిద్య రహితంగాను ఉంటుంది. సందర్భోచితమైన గేయాలతో సాగుతుంది. లయబద్ధంగా సాగే వారి అడుగులు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. కోయ స్త్రీ నృత్యం ఇతర గిరిజన తెగల నృత్యానికి సారూప్యంగా ఉంటుంది. ఈ కళ కేవలం వారి వినోదానికి మాత్రమే పరిమితమైంది. దీనిపై ఈ కళాకారులకు ఆదాయం ఏమీ లేదు. వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడకపోవడం వల్ల వాయిద్యాలపై అశ్రద్ధ పెరిగింది. దీంతో తరతరాలుగా వస్తున్న డోళ్లు మూలనబడి, వాటికి చర్మం మూతలు లేక అవశేషాలుగా మిగిలిపోయాయి. వారి సంతతి ఈ కళను నేర్చుకోడానికి ఇష్టపడకపోవడం వల్లా దీనికి ఆదరణ లేదు. ప్రస్తుతం గిరిజనుల ఇళ్ళల్లో జరిగే విందులు వినోదాలు శుభాశుభ కార్యాలకూ ఆధునికత ఉట్టిపడే మైక్‌సెట్లు, బ్యాండ్‌మేళం ఉపయోగించడం వల్లా ఈ కళ కొద్దికాలంలో కనుమరుగైపోతున్నట్టేనని స్పష్టమౌతోంది.