Agriculture

పసుపు దిగుబడిపై వర్షం లేమి ప్రభావం

Turmeric Yield Reduced Due To Lack Of Rains

వర్షాలు కురవడం లేదు.. శ్రీరాంసాగర్, నిజాంసాగర్ లో నీళ్లు లేవు.. భూగర్భ జలాలు అడుగంటాయి. వీటన్నింటి ప్రభావం.. నిజామాబాద్, కామారెడ్డి పసుపు రైతులపై పడింది. ఈసారి.. చాలా ఆలస్యంగా పసుపు సాగు మొదలుపెట్టారు. దీంతో.. 20 శాతం దిగుబడి తగ్గే అవకాశముందని ఆందోళన చెందుతున్నారు రైతులు.నాణ్యమైన పసుపుకి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కేరాఫ్. ప్రతి ఏడాది .. 40 వేల ఎకరాల్లో ఇక్కడ పసుపు సాగు చేస్తారు. ఎకరానికి లక్షన్నర పెట్టుబడి పెడతారు. విత్తనాల నుంచి పసుపు కొమ్ము తీసే వరకు.. 9 నెలల పాటు ఎంతో శ్రమకోర్చి.. పంట సాగు చేస్తారు. కానీ.. ఈ ఖరీఫ్ లో పసుపు సాగు ఆలస్యమైంది. వర్షాలు సరిగా కురవకపోవడంతో.. ఆలస్యంగా విత్తనాలు వేయడం మొదలుపెట్టారు.మామూలుగా ఐతే.. జూన్ మొదటి వారంలో పసుపు సాగు మొదలుపెడతారు రైతులు. ఇందుకోసం.. మే నెలాఖరు నుంచే.. తమ పొలాలను సిద్ధం చేస్తారు. అయితే.. వర్షాలు సరిగా కురవకపోవడంతో.. జూన్ ముగిసినా.. పూర్తిస్థాయిలో పసుపు సాగు మొదలుకాలేదు. మరోవైపు.. నిజామాబాద్ కు సాగునీరందించే.. శ్రీరాంసాగర్, నిజాం సాగర్ ప్రాజెక్టులు.. నీళ్లు లేక వెలవెలబోతున్నాయి. వేసవిలో.. ఎండల తీవ్ర, ప్రాజెక్టుల్లో నీళ్లు లేకపోవడంతో .. భూగర్భజలాలు కూడా అడుగంటాయి. దీంతో పసుపు సాగుకు రైతులు ముందుకు రాలేకపోయారు. ఈ వారంలో.. తేలికపాటి వర్షాలు కురుస్తుండటంతో.. పసుపు రైతులు ఇప్పుడు సాగు మొదలుపెట్టారు.పసుపు సాగు ఆలస్యంగా మొదలవడంతో …. దిగుబడిపై రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో పండిన పంటకే ప్రభుత్వం నుంచి గిట్టుబాటు ధర రాదనీ…. ఇప్పుడు దిగుబడి తగ్గితే నష్టపోతామని ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో.. 20 శాతం పసుపు దిగుబడి తగ్గుతుందని రైతులు చెప్తున్నారు. దీంతో.. మద్దతు ధర కోసం మళ్లీ రోడ్డెక్కాల్సిన పరిస్థితులు వస్తాయంటున్నారు.ప్రస్తుతం క్వింటాల్ పసుపు ధర 6800 ఉంది. ఇది.. తమకు సరిపోవట్లేదని రైతులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు ఇప్పుడు దిగుబడి తగ్గితే.. తమకొచ్చే ఆ కాస్త ఆదాయం కూడా పడిపోతే పరిస్థితేంటని ప్రశ్నిస్తున్నారు. పసుపునకు మద్దతు ధర కల్పించి.. తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు రైతులు.