Kids

పిల్లలతో కాసేపు ఎక్కువ సమయం గడపండి

Parents Must Spend Extra Time With Kids For Their Well Being

పిల్లలను తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచుతారు. వారికి కావలసినవన్నీ కొనిపెడుతూ గారాబం చేస్తుంటారు. వేలు పట్టి నడిపించిన దగ్గరి నుంచి వారికి వివాహం చేసేంత వరకూ బాధ్యతను తమపైనే వేసుకుంటారు తల్లిదండ్రులు. తమ పిల్లలకు మంచి జీవితం ఇవ్వాలన్న తపన ప్రతి ఒక్క తల్లిదండ్రులకూ ఉంటుంది. ఎంత చేసినా ఇంకా ఏదో చేయాలని ఆరాటపడుతుంటారు. అవసరమైన వసతులన్నీ కల్పిస్తూ తక్కువ సమయంలోనే వారు అభివృద్ధి చెంది జీవితంలో స్థిరపడాలనుకుంటారు. ఈ క్రమంలోనే పిల్లలు డాక్టర్ చదువుతానంటే.. ఇంజనీరింగ్ చదవమని, త్వరగా జీవితంలో స్థిరపడతావని చెబుతుంటారు. పిల్లల మంచి కోసమని తల్లిదండ్రులు తమ అభిప్రాయాలను పిల్లలపై రుద్దుతుంటారు. ఇది సరికాదంటున్నారు నిపుణులు. వారికి దేనిపై ఆసక్తి ఉందో అందులోనే వారు రాణించేలా చూడటం మంచిదని నొక్కివక్కాణిస్తున్నారు వారు. అంతేకాకుండా పిల్లలు ఏదైనా విజయం సాధించినప్పుడు కుటుంబమంతా ఆ విజయాన్ని ఆస్వాదించాలని చెబుతున్నారు. దీనివల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరిగి, మరిన్ని విజయాలు సాధించడానికి బాటలు వేస్తుందట.హడావుడి జీవితాల్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేయడం సర్వసాధారణమైపోయింది. దీనితోపిల్లలు పుట్టిన కొన్ని నెలలకే చిన్నారులను బేబీ కేర్ సెంటర్లలో వేసేస్తున్నారు. సాయంత్రం ఇంటికి తీసుకొచ్చి వారికి కావల్సిననీ పెడుతున్నారు. ఇలా చేయడం వల్ల పిల్లలు ఒంటరితనానికి గురయ్యే అవకాశాలున్నాయి. అందువల్ల పిల్లలతో వీలైనంత ఎక్కువ సమయం గడిపేలా తల్లిదండ్రులు ప్రణాళిక వేసుకోవాలి. వారితో కలిసి ఆడుతూ నీతికథలు చెప్తూ వారి జ్ఞానాన్ని పెంపొందించేందుకు ప్రయత్నించాలి. కనీసం వారాంతాల్లోనైనా ఇంకెలాంటి పనులు పెట్టుకోకుండా పూర్తి సమయం వారికే కేటాయించేలా చూసుకోవాలి.ఇంట్లో ఒకరు కంటే ఎక్కువమంది పిల్లలు ఉన్నప్పుడు వారి మధ్య ఇచ్చి పుచ్చుకునే ధోరణిని పెంపొందించాలి. సాధారణంగా చిన్నారులు తమ దగ్గర ఉన్న వస్తువులను వేరొకరికి ఇచ్చేందుకు ఇష్టపడరు. అలాంటప్పుడు తల్లిదండ్రులే చొరవ తీసుకుని ఎదుటివారికి ఇప్పించేలా నచ్చజెప్పాలి. దీనివల్ల భవిష్యత్తులో వేరొకరికి సాయపడటం అలవాటవుతుంది.పాఠశాల, కళాశాలలకు వెళ్లే పిల్లలకు చదువుల్లో కొంత ఒత్తిడి ఉండటం సహజం. అటు స్కూళ్లలో సబ్జెక్టులతో కుస్తీ పట్టి.. ఇంటికి రాగానే మళ్లీ చదవమంటే అలసట వస్తుంది. దీనివల్ల క్రమేపీ చదువు పట్ల ఆసక్తి కోల్పోతారు. అందువల్ల ఎప్పుడూ చదువే కాకుండా వాళ్లతో కలిసి ఆడుకోవడమో, అలా వారిని బయటకు తిప్పి తీసుకురావడమో చేయాలి. వారాంతాల్లో ఏదైనా విహార యాత్రకు తీసుకెళ్లడం, చిన్న చిన్న బహుమతులతో వారిని ఆశ్చర్యపరచడం.. వారిలో ఒత్తిడిని కొంతవరకు తగ్గిస్తాయి.స్కూలుకు వెళ్తున్న చిన్నారులు క్లాసులో జరిగిన సంగతులను ఎప్పుడెప్పుడు అమ్మానాన్నలకు చెప్పేద్దామా.. అన్న ఆసక్తితో ఉంటారు. ఇంటికి రాగానే తాను చెప్పదలచుకున్న దాన్ని ఏకబిగిన చెప్పేస్తారు. అలాంటప్పుడు తల్లిదండ్రులు విసుక్కోకుండా, వారేం చెబుతున్నారో వినాలి. అవసరమైన సూచనలు, సలహాలను పిల్లలకు అందించాలి. మాట సందర్భంలో ఆ రోజు క్లాసులో ఏయే పాఠాలు చెప్పారో అడగాలి. దీనివల్ల తరగతి గదిలో టీచర్ చెప్పే విషయాలను ఆసక్తిగా వినడం వారికి అలవాటవుతుంది.పిల్లలు కొంచెం పెద్దవాళ్లయిన తరువాత చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. ఆ మాత్రం దానికే వారిని భయపెట్టి, నెలలకొద్దీ వారితో మాట్లాడకపోవడం, వారిని ఇబ్బంది పెట్టడం వంటివి చేయకూడదు. దీనివల్ల మీపై వారికి వ్యతిరేక భావన ఏర్పడుతుంది. వాళ్లు చేసింది తప్పు అయినప్పటికీ వెంటనే తిట్టేయకుండా.. ఏకాంతంగా వారితో మాట్లాడటానికి ప్రయత్నించాలి. వారు చేసిన పని వల్ల ఎలాంటి నష్టం జరుగుతుందో వివరించాలి. ఇలా చేయడం వల్ల వారిలో సొంతంగా ఆలోచించే తత్త్వం పెరుగుతుంది. ఇంకోసారి ఇలాంటి పనులు చేసే ముందు కచ్చితంగా ఆలోచిస్తారు.