Politics

బుజ్జగింపుల ప్రయత్నాల్లో కోడెల ఫ్యామిలీ

Kodela Family Trying For Compromise With Case Filers

నాడు కప్పం కట్టాల్సిందే అని గద్దించిన నోర్లు నేడు మూగబోయాయి.. ఓ వైపు అంతటా చుక్కెదురు.. మరోవైపు సొంతపార్టీలో, ఉన్న ఊర్లో అంతటా విముఖత.. వెరసి శాసన సభ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కుటుంబం పరిస్థితి అయోమయంగా మారింది. ఐదేళ్లలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌రావు కుమారుడు శివరామ్, కుమార్తె పూనాటి విజయలక్ష్మి సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో కే–ట్యాక్స్‌ పేరుతో తోపుడు బండిపై వ్యాపారం చేసుకునే వ్యక్తి నుంచి బడా కాంట్రాక్టర్‌ వరకూ ప్రతి ఒక్కరి నుంచి పన్నులు వసూలు చేశారనే ఆరోపణలున్నాయి. వారి వసూళ్ల గురించి నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో వరుసగా కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ కోడెల శివప్రసాద్‌రావుపై రెండు, శివరామ్‌పై 9, విజయలక్ష్మిపై 7 కేసులు నమోదయ్యాయి. తనపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని విజయలక్ష్మి హైకోర్టును ఆశ్రయించగా చుక్కెదురైంది. కోడెల శివరామ్‌ బెయిల్‌ పిటిషన్‌ హైకోర్టు ముందు ఉంది. తమ నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్న వారందరూ వరుసగా పోలీస్‌లను ఆశ్రయిస్తుండటం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, చీటింగ్‌ కేసులు నమోదవుతుండటంతో కోడెల కుటుంబానికి అరెస్ట్‌ల భయం పట్టుకుంది. కోర్టులు సైతం ముందస్తు బెయిల్‌ మంజూరుకు నిరాకరిస్తుండటంతో వారు రాజీకి సిద్ధమవుతున్నారు. తీసుకున్న డబ్బు తిరిగి ఇస్తాం రాజీకి రావాలంటూ రాయబారాలు పంపుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే సత్తెనపల్లి నియోజకవర్గంలో నమోదైన ఓ కేసులో బాధితునికి రూ.35లక్షల మేర డబ్బు వెనక్కు ఇచ్చి రాజీ ప్రయత్నాలు చేశారు. అయితే ఆ ప్రయత్నాలు ఫలించలేదని సమాచారం. ఇదే తరహాలో తక్కిన బాధితుల వద్దకు రాయబారులను పంపి రాజీకి రావాలని, కావాలంటే నష్టపోయిన దానికి రెట్టింపు మొత్తాన్ని చెల్లిస్తామని కూడా బతిమాలుతున్నారని తెలుస్తోంది. కాగా ఇప్పటి వరకూ కోడెల కుటుంబంపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ, చీటింగ్‌ సహా 18 కేసులు నమోదయ్యాయి. ఆయా కేసుల్లో నిందితులుగా ఉన్న కోడెల, ఆయన కుమారుడు, కుమార్తె, అనుచరులను అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.