Editorials

ఇతర రాష్ట్రాల్లో ఆర్టికల్ 370

Article 370 In Other States Of India

ఆర్టికల్ 370 రద్దు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఈ ఆర్టికల్ను రద్దు చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 371పై కూడా దేశమంతా చర్చించుకుంటోంది. ‘370’ తరహాలోనే ఈ ఆర్టికల్ కూడా ప్రత్యేకమైనది. ఇందులో 371-ఎ నుంచి 371-జె వరకు భిన్న అంశాలున్నాయి. పలు రాష్ట్రాలకు సంబంధించి ప్రత్యేకమైన పరిరక్షణలను అందులో పొందుపరిచారు. వాటిని ఓసారి పరిశీలిస్తే..
*ఆర్టికల్ 371 (గుజరాత్, మహారాష్ట్ర)
మహారాష్ట్రలో విదర్భ, మరాఠ్వాడాతోపాటు మిగతా భూభాగానికి; గుజరాత్లో సౌరాష్ట్ర, కచ్తోపాటు మిగిలిన ప్రాంతానికి విడివిడిగా స్వతంత్ర అభివృద్ధి మండళ్లను ఏర్పాటుచేసే ప్రత్యేక అధికారాలను ఆయా రాష్ట్రాల గవర్నర్లకు ఇది కల్పిస్తుంది. ఉపాధి అవకాశాలు, వృత్తి విద్య, సాంకేతిక విద్యను మెరుగుపర్చేలా మరిన్ని కేంద్రాలను ఏర్పాటుచేసే అధికారాన్నీ వారికి కట్టబెడుతుంది.
*ఆర్టికల్ 371 ఎ (నాగాలాండ్)
నాగాలాండ్ అసెంబ్లీ ఆమోదం లేకుండా నాగాలకు సంబంధించిన ఆచార వ్యవహారాలు, స్థానిక సివిల్-క్రిమినల్ చట్టాలు, భూ యాజమాన్య మార్పిడి, ఇతర సంప్రదాయ చట్టాల్లో మార్పులు చేసేలా పార్లమెంటు నిర్ణయాలు తీసుకోకూడదు.
*371 బి (అసోం)
అసోంలో గిరిజన ప్రాంతాల కోసం ప్రత్యేకంగా పొందుపర్చారు. ఆ ప్రాంతాల బాగోగులను పర్యవేక్షించడంలో ప్రభుత్వానికి సిఫార్సులు చేసేలా.. అసెంబ్లీకి ఎన్నికైన గిరిజన ప్రతినిధులతో కూడిన ప్రత్యేక కమిటీని నియమించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది.
*371 సి (మణిపుర్)
ఇది మణిపుర్లో కొండ ప్రాంతాల పరిరక్షణకు సంబంధించినది. అక్కడ పాలనా వ్యవహారాల్లో ప్రభుత్వానికి సూచనలు చేసేందుకుగాను కొండ ప్రాంతాల నుంచి అసెంబ్లీకి ఎన్నికైన ప్రతినిధులతో ఓ కమిటీని రాష్ట్రపతి ఏర్పాటుచేయవచ్చు. ఈ కమిటీ అధికారాలను పరిరక్షించాల్సిన బాధ్యత గవర్నర్పై ఉంటుంది.
*371 డి (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్)
దీన్ని 1974లో రాజ్యాంగంలో చేర్చారు. దీని ద్వారా విద్య, ఉపాధి రంగాల్లో స్థానికులకు రాష్ట్రపతి సమాన అవకాశాలు కల్పించవచ్చు. రాష్ట్రంలో సివిల్ ఉద్యోగాల నియామకాలు, పదోన్నతులకు సంబంధించిన అన్ని వివాదాలను పరిష్కరించేందుకు అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ను ఏర్పాటుచేయాల్సిందిగా ప్రభుత్వాన్ని రాష్ట్రపతి కోరవచ్చు.
*371 ఇ (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్)
దీని ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేశారు.
*371 ఎఫ్ (సిక్కిం)
1975లో దీన్ని రాజ్యాంగంలో చేర్చారు. సిక్కిం అసెంబ్లీలో కనీసం 30 మంది సభ్యులుండాలి. రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజల ప్రయోజనాలను పరిరక్షించేందుకుగాను అసెంబ్లీలో ఆయా వర్గాలకు సీట్లు కేటాయించారు.
*371 జి (మిజోరం)
మిజోరం అసెంబ్లీ ఆమోదం లేకుండా ఆ రాష్ట్ర ప్రజలకు చెందిన మతపరమైన వ్యవహారాలు, ఆచారాలు, స్థానిక సివిల్-క్రిమినల్ చట్టాలు, భూ యాజమాన్య మార్పిడి, ఇతర సంప్రదాయ చట్టాలపై పార్లమెంటు నిర్ణయాలు తీసుకోకూడదు.
*371 జె (కర్ణాటక)
ఇది హైదరాబాద్-కర్ణాటక ప్రాంతానికి సంబంధించినది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకుగాను ప్రత్యేక మండలిని ఏర్పాటుచేసే బాధ్యతను కర్ణాటక గవర్నర్కు రాష్ట్రపతి అప్పగించవచ్చు. ఆ మండలి పనితీరుపై అసెంబ్లీలో ఏటా నివేదిక సమర్పించాలి. హైదరాబాద్-కర్ణాటక ప్రాంత అభివృద్ధి కోసం తగినన్ని నిధులను తప్పనిసరిగా కేటాయించాలి. ఈ ప్రాంతవాసులకు రాష్ట్రంలో విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలి.
*371 హెచ్ (అరుణాచల్ ప్రదేశ్)
రాష్ట్రంలో శాంతిభద్రతలకు సంబంధించి రాష్ట్రపతి ఆదేశాల మేరకు గవర్నర్కు ప్రత్యేక అధికారాలు లభిస్తాయి. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు మంత్రిమండలిని గవర్నర్ సంప్రదిస్తారు. అయితే, గవర్నర్ నిర్ణయమే అంతిమం.
*371 ఐ (గోవా)
గోవా అసెంబ్లీలో కనీసం మంది 30 సభ్యులుండాలని ఇది స్పష్టం చేసింది.
**ఆర్టికల్ 371 ప్రధాన ఉద్దేశాలు
*ఆయా రాష్ట్రాలకు ప్రత్యేక పరిరక్షణలు కల్పించడం
*వాటిలోని వెనుకబడిన ప్రాంతాల విశిష్ట అవసరాలను తీర్చడం
*ఆయా ప్రాంతాల ఆర్థిక, సాంస్కృతిక ప్రయోజనాలను పరిరక్షించడం
* స్థానిక సవాళ్లను ఎదుర్కోవడం
* పలు సంప్రదాయ చట్టాలను రక్షించడం