టాటా మోటార్స్.. మారుతీ సుజుకీ.. మహీంద్రా అండ్ మహీంద్రా.. హీరో మోటోకార్ప్.. వంటి దిగ్గజ కంపెనీలు కూడా ఇటీవల కాలంలో ఆర్థిక సంక్షోభానికి బెంబేలెత్తిపోతున్నాయి. 11 నెలల నుంచి వాహనరంగంలో కొనుగోళ్లు గణనీయంగా తగ్గుతున్నాయి. ఇక ప్యాసింజర్ వాహనాల పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. వరుసగా తొమ్మిది నెలల నుంచి కొనుగోళ్లు నేలచూపులు చూస్తున్నాయి. ఫలితంగా దేశంలోని చాలా కంపెనీలు ఉత్పత్తిని తగ్గించేశాయి. ఇప్పటికే ఖర్చుకు కళ్లెం వేయడానికి తాత్కాలిక ఉద్యోగులను తొలగిస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే డిమాండ్ 31శాతం తగ్గినట్లు లెక్కలు చెబుతున్నాయి. 2000 సంవత్సరం తర్వాత డిమాండ్ ఇంతగా పడిపోవడం ఇదే తొలిసారి. ఫలితంగా ఇప్పటికే ఆటోమొబైల్, అనుబంధ రంగాల్లో 2.15లక్షల ఉద్యోగాలు పోయాయి. దేశంలో అత్యధికంగా ప్రజలకు ఉపాధి కల్పిస్తున్న వాటిల్లో ఆటోమొబైల్ పరిశ్రమ రెండో స్థానంలో ఉంది.. దాదాపు 3.5కోట్లకుపైగా కుటుంబాలు ఆటోమొబైల్ పరిశ్రమపై ఆధారపడి ఉన్నాయి. గిరాకీ లేనందున, ఉత్పత్తి తగ్గించేందుకు వాహన, విడిభాగాల కంపెనీలు కూడా కొన్ని రోజుల పాటు ప్లాంట్లను తాత్కాలికంగా మూసివేస్తున్నాయి. హీరో మోటో ఈ నెల 15-18 వరకు, టీవీఎస్ గ్రూప్‌నకు చెందిన సుందరమ్ క్లేటాన్(ఎస్‌సీఎల్) 2 రోజులు, లూకాస్-టీవీఎస్ 2 రోజులు ఉత్పత్తి నిలిపేశాయి. బాష్ సైతం తన రెండు ప్లాంట్లను 13 రోజుల పాటు, ప్రస్తుత త్రైమాసికంలో 8-14 రోజుల పాటు ఉత్పత్తి నిలిపివేయనున్నట్లు ఎం అండ్ ఎం తెలిపింది. ఆటోమొబైల్ పరిశ్రమకు పలు ఇతర పరిశ్రమలతో బలమైన సంబంధాలు ఉన్నాయి. వ్యవసాయం, రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్, మార్కెట్ ఇలా ప్రతి పరిశ్రమ ప్రగతి ఆటోమొబైల్ రంగంపై ప్రభావం చూపుతాయి. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లుంది ఆటోమొబైల్ పరిశ్రమ పరిస్థితి.
ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో వాహన కొనుగోళ్లకు నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు అత్యధికంగా అప్పులు ఇస్తున్నాయి. మూడింట ఒక వంతు కొనుగోళ్లు వీటి అప్పులతోనే జరుగుతాయి. కానీ, ఎన్‌బీఎఫ్‌సీలు ఇప్పుడు తీవ్రమైన నగదు కొరతను ఎదుర్కొవడంతో రుణ లభ్యత తగ్గింది. దీంతో కొనుగోళ్లు పడిపోయాయి. మరోపక్క బ్యాంకులు వాహన కొనుగోళ్ల నిబంధనలను కఠిన తరం చేయడం కూడా పులిమీద పుట్రలాగ మారింది. వచ్చే ఏడాది నుంచి బీఎస్6 నిబంధనలు అమల్లో రానుండంటంతో చాలా మంది వాహన కొనుగోళ్లను తాత్కాలికంగా నిలిపేశారు. ఫలితంగా అమ్మకాలు పడిపోయాయి. ఇప్పటికే ఉన్న వాహనాల పరిస్థితి ఏమిటీ అనే దానిపై ఇంకా స్పష్టత రాకపోవడం దీనికి మరో కారణం. ఇప్పటికే దిల్లీ మినహా దేశ వ్యాప్తంగా ఇంకా బీఎస్-6 ఇంధనం కూడా అందుబాటులోకి రాలేదు. మరోపక్క కంపెనీలు కూడా తమ సాంకేతికతను బీఎస్-6కు అప్‌గ్రేడ్ చేసుకోవాడానికి భారీగా వెచ్చించాల్సి వస్తోంది. అదే సమయంలో మార్కెట్లో వాహనాల డిమాండ్ పడిపోవడం వాటిని ఆర్థికంగా ఒత్తిడికి గురి చేస్తోంది. బీఎస్-6 నిబంధనలు ముఖ్యంగా డీజిల్ ఇంజిన్ల భవిష్యత్తును ప్రమాదంలో పడేశాయి. పెట్రోల్ ఇంజిన్ల ధరలు రూ.30వేల వరకు పెరిగితే.. డీజిల్ ఇంజిన్ల ధరలు రూ.1లక్ష నుంచి 1.5 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది. వీటి జీవితకాలాన్ని ఇప్పటికే దిల్లీలో 10 ఏళ్లకు కుదించారు. ఇదే విధానం దేశవ్యాప్తంగా అమలు చేస్తారనే భయాలు ఉన్నాయి. డీజిల్‌కార్ల నిర్వహణ భారీగా పెరగనుండటంతో చాలా కంపెనీలు ఆ ఇంజిన్ల తయారీకే స్వస్తి చెప్పనున్నట్లు ప్రకటించాయి. దీంతో ఆ మేరకు ఉద్యోగాల కోత తప్పని పరిస్థితి నెలకొంది.
వ్యవసాయ రంగం కూడా పెద్ద ఆశాజనకంగా లేకపోవడంతో ట్రాక్టర్ల కొనుగోళ్లు కూడా తగ్గుముఖం పట్టాయి. వరదలు, కరవు వంటి సంక్షోభ పరిస్థితుల దెబ్బకు వ్యవసాయరంగం కుదేలైంది. సాధారణంగా ట్రాక్టర్ల విభాగంలో చాలా అరుదుగా కొనుగోళ్లు తగ్గుతాయి. మహీంద్రా అండ్ మహీంద్రా ట్రాక్టర్ల విక్రయాలు గత త్రైమాసికంలో 15శాతం పడిపోయాయి. ఎస్కార్ట్స్ విక్రయాలు కూడా ఈ సీజన్‌లో తగ్గుముఖం పట్టాయి. ప్రభుత్వం కాలుష్యాన్ని తగ్గించేందుకు యాక్సెల్‌లోడ్ నిబంధనల్లో ఇటీవల మార్పులు తీసుకొచ్చింది. దీంతో వాణిజ్య వాహనాలు మోసే బరువు పరిమితి పెరిగింది. ఇది ఒక రకంగా ఇంధన వినియోగాన్ని తగ్గించి కాలుష్యాన్ని కట్టడి చేస్తుంది. కానీ, కొత్త వాహన కొనగోళ్లు (ట్రక్కులు, ట్యాంకర్లు వంటివి) గణనీయంగా తగ్గాయి. ఈ దెబ్బకు అశోక్‌లేలాండ్ పంత్‌నగర్ ప్లాంట్‌ను తొమ్మిది రోజులు మూసేయాల్సి వచ్చింది. టాటామోటార్స్ కూడా పంత్‌నగర్ ప్లాంట్‌ను కొన్నాళ్లు మూసేసింది. బీఎస్6 అమలుకు ముందు ఉన్న బీఎస్4 స్టాక్‌ను వదిలించుకోవడానికి కంపెనీలు భారీగా ఆఫర్లను ప్రకటిస్తాయని వినియోగదారులు బలంగా విశ్వశిస్తున్నారు. దీంతో అప్పటి వరకు వేచి ఉండాలనే ధోరణి అవలంభిస్తున్నారు. గతంలో కూడా జీఎస్‌టీ అమల్లోకి వచ్చినప్పుడు, బీఎస్3 వాహనల విక్రయాన్ని బ్యాన్ చేసినప్పుడు 2017లో కంపెనీలు భారీగా ఆఫర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే