Business

జియోతో పోరాడే మొనగాడు ఎయిర్‌టెల్ ఒక్కడే

Airtel Announces Extreme To Compete Against Jio-జియోతో పోరాడే మొనగాడు ఎయిర్‌టెల్ ఒక్కడే

జియో ఫైబర్‌ పేరుతో ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో త్వరలో బ్రాడ్‌ బ్యాండ్‌, డీటీహెచ్‌ సేవలను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో దిగ్గజ టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్‌ కూడా అందుకు దీటుగా ఓటీటీ సేవలను ప్రారంభించనుంది. ఇందుకోసం ఎయిర్‌టెల్‌ ప్రత్యేకంగా ఓ పరికరాన్ని ప్రకటించింది. ‘ఎయిర్‌టెల్‌ ఎక్స్‌స్ట్రీమ్‌’ పేరుతో దీన్ని తీసుకురానుంది. దీని ద్వారా నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలను వీక్షించవచ్చు. ఎయిర్‌టెల్‌ తేనున్న ఎక్స్‌స్ట్రీమ్‌ స్టిక్‌ ఆండ్రాయిడ్‌ 8.0పై పనిచేయనుంది. అమెజాన్‌ ఫైర్‌ స్టిక్‌లా ఇది పనిచేస్తుంది. దీని ధరను రూ.3,999గా నిర్ణయించారు. ఎయిర్‌టెల్‌ థ్యాంక్స్‌ ప్లాటినం, గోల్డ్‌ వినియోగదారులు కొన్ని కార్యక్రమాలను ప్రత్యేకంగా వీక్షించే అవకాశం కల్పిస్తోంది. ఇతర వినియోగదారులు 30రోజుల పాటు ఉచితంగా వీక్షించవచ్చు. ఆ తర్వాత సంవత్సరానికి రూ.999 చెల్లించాల్సి ఉంటుంది. ఎయిర్‌టెల్‌ ఎక్స్‌స్ట్రీమ్‌ స్టిక్‌ ఫిప్ల్‌కార్ట్‌లో లభించనుంది. అంతేకాదు, ఎంపిక చేసిన ఆఫ్‌లైన్‌ స్టోర్‌లలోనూ ఇది లభ్యం కానుంది. ఇక ఎయిర్‌టెల్‌ ఎక్స్‌స్ట్రీమ్‌ బాక్స్‌తో టీవీ ఛానల్స్‌తో పాటు, నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, యూట్యూబ్‌, ఎయిర్‌టెల్‌ స్టోర్‌ను యాక్సిస్‌ చేసుకోవచ్చు. దీని ధర రూ.3,999. ప్రారంభ ఆఫర్‌ కింద రూ.999 విలువైన ఏడాది కాల పరిమితి కలిగిన సేవలను ఉచితంగా పొందవచ్చు. ఇప్పటికే ఎయిర్‌టెల్‌ సెట్‌ టాప్‌ బాక్స్‌ వినియోగిస్తున్న వారు రూ.2,249 చెల్లించడం ద్వారా తమ సెట్‌టాప్‌ బాక్స్‌ను అప్‌గ్రేడ్‌ చేసుకోవచ్చు. త్వరలో రిలయన్స్‌ జియో ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అధికారికంగా ప్రారంభంకానున్న నేపథ్యంలో ఎయిర్‌టెల్‌ వీటిని ప్రకటించడం గమనార్హం.