Movies

రాక్షసికి మలేషియా ప్రశంస

Jyothikas Rakshasi Movie Gets Appreciations From Malaysia

ప్రముఖ నటి జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన ‘రాక్షసి’ సినిమాపై మలేషియా విద్యాశాఖ మంత్రి మస్‌జ్లీ బిన్‌ మాలిక్‌ ప్రశంసల జల్లు కురిపించారు. ఈ చిత్రాన్ని తాజాగా చూసిన ఆయన సోషల్‌మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ‘రాక్షసి’ సినిమాకు గౌతమ్‌ రాజ్‌ దర్శకత్వం వహించారు. ఎస్‌.ఆర్‌. ప్రభు నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇందులో జ్యోతిక ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా నటించారు. పిల్లలు చదవకపోతే బెత్తం పట్టుకుని సరిదిద్ది, వ్యవస్థలో ఉన్న చిన్న చిన్న తప్పుల్ని ప్రశ్నించే టీచర్‌గా నటించి ఆకట్టుకున్నారు. ఈ సినిమాను చూసిన మలేషియా మంత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ‘రెండు నెలల క్రితం ఈ సినిమా విడుదలైంది. గత రాత్రి అధికారులతో కలిసి ఈ సినిమా చూశాను. స్వయంగా ఈ సినిమా రివ్యూ రాయాలని నిర్ణయించుకున్నా. ఇది అందరూ చూడాల్సిన సినిమా. కథ అద్భుతంగా ఉంది. జ్యోతిక పాత్ర పర్‌ఫెక్ట్‌గా ఉంది. విద్యా శాఖ మంత్రిగా ఈ సినిమా చూడటం విభిన్న అనుభూతినిచ్చింది. సినిమాలోని ప్రతి సన్నివేశం మా దేశ పరిస్థితుల్ని ప్రతిబింబించింది’.