Devotional

పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది.

ఆలయంలో సెప్టెంబరు 12 నుండి 14వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి.

పవిత్రోత్సవాల ముందు మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

ఈ సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారిని ఉదయం సుప్రభాతంతో మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు.

ఆ తరువాత ఉదయం 6 నుండి 8.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపట్టారు.

ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు.

అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు

అనంతరం ఉదయం 9 గంటల నుండి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు.

ఈ కారణంగా ఆర్జితసేవలైన కల్యాణోత్సవం, ఊంజలసేవను టిటిడి రద్దు చేసింది.

సెప్టెంబరు 11న అంకురార్పణ :

పవిత్రోత్సవాలను పురస్కరించుకొని సెప్టెంబరు 11న బుధవారం సాయంత్రం 6 గంటలకు విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం నిర్వహిస్తారు.

వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం.

అయినా యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలిసితెలియక ఇటువంటి దోషాలు జరుగుతుంటాయి.

ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.

ఇందులోభాగంగా సెప్టెంబరు 12న పవిత్రప్రతిష్ఠ, సెప్టెంబరు 13న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 14న పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగనున్నాయి.

రూ.750/- చెల్లించి గృహస్తులు (ఒకరికి మూడు రోజులపాటు) ఈ పవిత్రోత్సవాల ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు.

గృహస్తులకు 2 లడ్డూలు, 2 వడలు బహుమానంగా అందజేస్తారు.

ఆర్జితసేవలు రద్దు : సెప్టెంబరు 11న అంకురార్పణం సందర్భంగా కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రేక్‌ దర్శనాలను రద్దు చేశారు.

సెప్టెంబరు 12న గురువారం తిరుప్పావడ సేవ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, సెప్టెంబరు 13న శుక్రవారం అభిషేకానంతర దర్శనం, ఉదయం బ్రేక్‌ దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, సెప్టెంబరు 14న శనివారం ఉదయం బ్రేక్‌ దర్శనం, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవను టిటిడి రద్దు చేసింది.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, ఆగమసలహాదారు శ్రీశ్రీనివాసాచార్యులు, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ శ్రీ మల్లీశ్వరి, అర్చకుడు శ్రీపిపిఎస్‌.ప్రతాప్‌, ఆర్జితం ఇన్‌స్పెక్టర్‌ శ్రీ కోలా శ్రీను ఇతర అధికారులు పాల్గొన్నారు.