Health

చనిపోయాక కూడా 17నెలల వరకు శవాల్లో కదలికలు

Dead Bodies Can Experience Movements Upto 17 Months After Death

సాధారణంగా మనిషి చనిపోయాక మృతదేహం కదలకుండా ఉండిపోతుంది. అవయవాలన్నీ క్రియారహితం అయి మానవ అస్థిపంజరం నిశ్చేష్ట స్థితిలోకి వెళ్లిపోతుంది. ఇది అందరికి తెలిసిన విషయమే. అయితే మనిషి చనిపోయాక మృతదేహం విశ్రాంతదశలో ఉండకుండా కదలికలు ఉంటాయట. చనిపోయిన తర్వాత మృతదేహంలో సుమారు ఏడాది వరకు కదలికల ఉంటాయని ఆస్ట్రేలియాకు చెందిన సీక్యూ యూనివర్సిటీ క్రిమినాలజీ విభాగం గ్రాడ్యుయేట్ ఎలిసోన్ విల్సన్ అంటున్నారు. సుమారు 17 నెలల వరకు మానవ మృతదేహంలో ఏర్పడుతున్న కదలికలకు సంబంధించిన ఫొటోలను తీశారు. ఆ ఫొటోలపై అధ్యయనం జరిపిన అనంతరం ఈ విషయాన్ని వెల్లడిస్తున్నారు. చనిపోయినపుడు దగ్గరగా ముడుచుకున్న చేతులు క్రమక్రమంగా మళ్లీ బయటకు రావడాన్ని తాము జరిపిన ఓ అధ్యయనంలో గమనించామని విల్సన్ చెప్పారు. దీనికి సంబంధించిన అధ్యయనాల కోసం విల్సన్ ప్రతీ నెల కైర్న్ నుంచి సిడ్నీకి ప్రత్యేకంగా విమానంలో వెళ్లొచ్చేవారట. 70 మృతదేహాల్లో ఎంపిక చేయబడిన ఓ శవాన్ని ఆస్ట్ర్రేలియన్ ఫెసిలిటీ ఫర్ టఫోనొమిక్ ఎక్స్ పరిమెంటల్ రీసెర్చ్ (ఆఫ్టర్) సెంటర్ లో ప్రత్యేకంగా నిల్వ ఉంచారు. ఈ సెంటర్ సిడ్నీ ఔటర్ ప్రాంతంలోని ఫారెస్ట్ లో ఉంటుంది. పోస్టుమార్టం సంబంధించిన అధ్యయనాలు, పరిశోధనలు ఆఫ్టర్ లో జరుగుతుంటాయి. చనిపోయిన సమయం నుంచి డెత్ లాప్స్ కెమెరాల సాయంతో విల్సన్ ఆమె సహచరులు మానవ మృతదేహంలో ఎలాంటి కదలికలున్నాయని నమోదు చేశారట. పోస్టుమార్టం సమయంలో సునిశిత పరిశీలన మరణానికి సంబంధించిన తప్పుడు కారణాలు, నేర దృశ్యాలను తప్పుదోవ పట్టించకుండా ఉపకరిస్తాయని తెలుసుకున్నట్లు చెప్పారు. మనిషి చనిపోయిన తర్వాత శరీరం కదలిక లేకుండా ఉండటం గురించి తెలుసుకోవాలని తనకు చిన్నప్పటి నుంచి ఆసక్తికరంగా ఉండేదని ఎలిసోన్ విల్సన్ అన్నారు.