Politics

అయ్యన్న తమ్ముడు జంప్

Ayyannapatrudu Brother Bids Farewell To TDP

విశాఖ టీడీపీలో రాజకీయం వేడెక్కింది. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సోదరుడు సన్యాసి పాత్రుడు టీడీపీకి గుడ్ బై చెప్పారు. త్వరలోనే అధికార పార్టీ వైఎస్సార్‌సీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇటు కొంతమంది నేతలు పార్టీని వీడుతున్నారు. మొన్నటి వరకు తమ్ముడు పార్టీ మార్పుపై స్పందించని అయ్యన్నపాత్రుడు తాజాగా చేసిన ఫేస్‌బుక్ పోస్ట్ ఆసక్తిగా మారింది. తమ్ముడు పేరుని, పార్టీని వీడుతున్న నేతల పేర్లను ప్రస్తావించకుండా ఘాటు వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో అయ్యన్న పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. అయ్యన్నపాత్రుడు తన పోస్ట్‌లో ‘నాకు పార్టీ పదవులు ఇచ్చింది, ప్రజలు సమాజంలో నన్ను ఇంత స్థాయికి తీసుకుని వెళ్ళారు… నేను పోయినా కూడా ఒకే జెండా కప్పుకుని పోతా తప్పా… నాలుగు జెండాలు కలిపికుట్టుకుని పైన కప్పించుకొను…. నేను దమ్ముతో ఒకే స్థానం నుంచి పోటీ చేశాను.. ఒకే పార్టీలో ఉన్నాను. .ఎందుకంటే నీతి, నిజాయితీ, నమ్మకం ఉన్నాయి కాబట్టి’ అన్నారు. ‘పార్టీ పదవులు ఇచ్చినా కూడా వదిలి వెళ్లిపోయే అవకాశ వాదులు ఏ పార్టీకైనా చెద పురుగులే… అలాంటి నీతిలేని ద్రోహులను తరిమికొట్టినప్పుడే రాజకీయాలకు పట్టిన మకిలి వదులుతుంది… MLA, MP, Ministers, Chairman etc ఇచ్చింది కదా పార్టీ..ఇప్పుడు తల్లి కష్టాలలో ఉందని ఒదిలిపోయే పిరికి పిందెలు మాకు అవసరం లేదు… మా వెనుక ప్రజలు ఉన్నారు’ అన్నారు. అయ్యన్న పోస్టును తెలుగు తమ్ముళ్లు షేర్ల మీద షేర్లు కొడుతున్నారు. పార్టీకి నిజమైన నేత మీరేనంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.