Editorials

తెలుగు రాజకీయాల్లో బజారు భాష

Foul Languages On The Rise In Indian Especially Telugu Politics

పరస్పర ఆరోపణలు.. విమర్శలు.. వ్యక్తిగత దూషణలు.. నీవెంతంటే.. నీవెంత అంటూ సవాళ్లు.. జిల్లాలో రాజకీయం గరంగరంగా మారింది. తెదేపా నేతలు, పార్టీ మారిన నేతలు, వైకాపా నేతలు, మంత్రుల మధ్య దూషణల పర్వం సాగుతోంది. వ్యక్తిగత విషయాలపై విమర్శలకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. గత రెండు రోజులుగా జిల్లాలో వాడీవేడిగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. పోలీసులకు ఫిర్యాదులు చేశారు. తాజాగా తెదేపా నాయకులు పలువురు రంగంలోకి దిగారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆయనతో పాటు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ పార్టీకి రాజీనామా చేసి ఏకంగా వైకాపా కండువా కప్పుకొన్నారు. ఈ పరిణామాలు పార్టీలో అలజడి సృష్టించాయి. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నేరుగా చంద్రబాబు, లోకేష్‌లపై విమర్శలు చేయడంతో తెదేపా నేతలు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్‌కు వంశీకి మధ్య జరిగిన వాగ్వాదం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. శనివారం వంశీ రాజేంద్రప్రసాద్‌కు క్షమాపణలు చెప్పారు. అయితే విమర్శల ఘాటును మాత్రం తగ్గించలేదు. ఎమ్మెల్సీ వైవీబీకి ఆర్థిక సహాయం చేసినట్లు మరోసారి చెప్పుకొచ్చారు. తనకు పార్టీ అండగా నిలువలేదన్న అసంతృప్తితో వైవీబీ ఉన్నారు. శనివారంనాడు మాజీ మంత్రి దేవినేని ఉమాతో పాటు జిల్లాలోనే నేతలు బచ్చుల అర్జునుడు, కొల్లు రవీంద్ర, గద్దె అనూరాధ, బుద్దా వెంకన్న తదితరులు వంశీపై విరుచుకుపడ్డారు. వైవీబీకి అండగా నిలిచారు. దీంతో మళ్లీ రాజకీయ వాతావరణం వేడెక్కింది. వంశీ మరోసారి విలేకరుల సమావేశం నిర్వహించి సున్నితంగానే లోకేష్‌, చంద్రబాబుపై విమర్శలు చేశారు. ఆయనకు మద్దతుగా మంత్రి కొడాలి నాని సవాల్‌లు విసిరారు. ఆయన తీవ్ర పదజాలంతోనే విరుచుకుపడ్డారు. దీంతో ఈ వ్యవహారం జిల్లాలో తెదేపా, వైకాపాల మధ్య మాటల యుద్ధంగా మారింది. గతంలో జరిగిన పలు కీలకాంశాలను తిరిగి మళ్లీ తోడుతున్నారు. రాజీనామా లేనట్లే…! ప్రస్తుతానికి ఎమ్మెల్యే వంశీ రాజీనామా చేసే అవకాశం లేదని తెలిసింది. అవసరమైతే రాజీనామాకు సిద్ధం అంటున్న ఆయన ముందుగా తెదేపా నుంచి భాజపాలోకి వెళ్లిన రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, టీజీ వెంకటేష్‌, సీఎం రమేష్‌లతో రాజీనామా చేయించాలని డిమాండు చేశారు. వారు రాజీనామా చేస్తే తాను రాజీనామా చేస్తానంటున్నారు. ప్రస్తుతం రాజీనామా ఉండకపోవచ్చని, అదేవిధంగా వైకాపా కండువాను అధికారికంగా కప్పుకోరని అంటున్నారు. కానీ బహిరంగంగానే సీఎంకు సంఘీభావం ప్రకటించారు. నియోజకవర్గంలో వైకాపా రాజకీయాల్లో క్రియాశీలకంగా పాల్గొననున్నారని చెబుతున్నారు. వైకాపా కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని చెబుతున్నారు. తెదేపా మాత్రం అయిదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. త్వరలో ఇన్‌ఛార్జిని నియమించే అవకాశం ఉంది. అదేవిధంగా గుడివాడ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిన దేవినేని అవినాష్‌ వైకాపాలో చేరడంతో అక్కడ కూడా ఇన్‌ఛార్జిని నియమించాల్సి ఉంది. ఈ పరిణామాలపై తెదేపా నాయకత్వం దృష్టి సారించింది.