ScienceAndTech

పరాకాష్ఠకు చైనా పైత్యం

China Makes It Mandatory To Scan Face Before Buying Phone

నేటి నుంచి చైనాలో కొత్తగా మొబైల్‌ సర్వీస్‌ను వినియోగించాలంటే ముఖాన్ని స్కాన్‌ చేసి రిజస్టర్‌ చేసుకోవాల్సి ఉంది. ఈ నిబంధనను సెప్టెంబర్‌లో చైనా ప్రభుత్వం ప్రకటించింది. ఇది ఆదివారం నుంచి అమల్లోకి వచ్చింది. దీనిపై ప్రభుత్వం మాట్లాడుతూ ‘‘సైబర్‌ ప్రపంచంలో ప్రజలకు ఉన్న హక్కులు, అవకాశాలను ఈ చట్టం రక్షిస్తుంది’’ అని పేర్కొంది. చైనా ఇప్పటికే జనాభా లెక్కలకు ఫేషియల్ రికగ్నైజేషన్‌ టెక్నాలజీని వినియోగిస్తోంది. ఈ రకమైన టెక్నాలజీలో మిగిలిన ప్రపంచ దేశాలతో పోలిస్తే చైనా చాలా ముందుంది. ఇటీవల కాలంలో ఈ రకమైన టెక్నాలజీని దేశంలోని వివిధ కార్యక్రమాలకు వినియోగిస్తోంది. ఇప్పుడు తాజాగా అమల్లోకి వచ్చిన కొత్త నిబంధన ప్రకారం కొత్త మొబైల్‌ కొన్నప్పుడు, మొబైల్‌ డేటా కాంట్రాక్టులను తీసుకొన్నప్పుడు ప్రజలు వారి జాతీయ గుర్తింపు కార్డును చూపించాలి. కానీ, ఇక నుంచి ఐడీతోపాటు వారి ముఖాన్ని స్కాన్‌ చేస్తారు. ఈ సందర్భంగా వారు ఇచ్చిన ఐడీ సరైందో కాదో గుర్తించే అవకాశం ఉంది. చైనా చాలా రోజుల నుంచి అక్కడి ప్రజలు అసలు పేరుతోనే ఇంటర్నెట్‌ వినియోగించేలా నిబంధనలను కఠినతరం చేస్తోంది. 2017లో అక్కడ ఎవరైనా ఆన్‌లైన్లో కొత్త విషయాన్ని పోస్టు చేయాలంటే వారి అసలైన ఐడీని వెల్లడించాలని నిబంధన పెట్టింది. ఇప్పుడు టెలికామ్‌ సంస్థల కోసం అమల్లోకి తెచ్చిన ఈ ఫేస్ స్కానింగ్‌ నిబంధన ఇంటర్నెట్‌వినియోగదారులకు సంబంధించి సమాచారం ప్రభుత్వం సేకరించడానికి వీలుగా తయారు చేశారు. చైనాలో అత్యధిక మంది వినియోగదారులు మొబైల్‌ నుంచే ఆన్‌లైన్‌లోకి వస్తుంటారు.