DailyDose

డిసెంబరు 19న విడుదల కానున్న టాటా నెక్సాన్ EV-వాణిజ్యం-12/10

TATA Nexon EV Set To Release On 17th-Telugu Business News Roundup Today-12/10

* శీతలపానీయాల దిగ్గజ సంస్థ పెప్సీకోకు ప్రచారకర్తగా బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌తో ఒప్పందం చేసుకొంది. ఈ విషయాన్ని మంగళవారం సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. పెప్సీ కార్బొనేటెడ్‌ పానీయాల ప్రచారానికి ఆయన కొత్త. 2020లో 360 డిగ్రీ వాణిజ్యప్రకటనలో నటించనున్నారు. 2019లో పెప్సీ ప్రారంభించిన స్వాగ్‌ థీమ్‌ ప్రచారాన్ని ఈ వాణిజ్య ప్రకటన ముందుకు తీసుకెళ్లనుంది. ‘‘బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సల్మాన్‌ఖాన్‌తో ఒప్పందం చేసుకొందని ప్రకటించడానికి ఉత్సాహంగా ఉన్నాము. గత ఏడాదిగా పెప్సీ బ్రాండ్‌ స్వాగ్‌థీమ్‌తో ప్రచారం చేపట్టింది. సల్మాన్‌ రాకతో 2020లో స్వాగ్‌థీమ్‌ ప్రచారం మరింత ఊపురానుంది’’ అని పెప్సి కో ప్రతినిధి ఈమెయిల్‌లో ప్రకటించినట్లు ఆంగ్ల పత్రిక లైవ్‌మింట్‌ పేర్కొంది. సల్మాన్‌ నటించిన దబాంగ్‌3 విడుదలకు సిద్ధమైన సమయంలో పెప్సీతో ఒప్పందం చేసుకోవడం విశేషం.
గత కొన్నేళ్లలో పానీయాల ప్రకటనల్లో బాలీవుడ్‌ తారలు సందడి చేస్తున్నారు. గత ఏడాది సల్మాన్‌ భారత్‌, టైగర్‌ జిందాహై వంటి హిట్లు ఇచ్చారు. అప్పట్లో సల్మాన్‌ పార్లే తయారు చేసే యాపే ఫిజ్జీకు ప్రచారం చేశారు. తర్వాత దానిని ఆపేశారు. 2016 వరకు ఆయన కోకాకోలాకు చెందిన థమ్స్‌అప్‌కు ప్రచారకర్తగా ఉన్నారు.

* పెద్ద నోట్ల రద్దు తర్వాత రూ. 2000 నోటును తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఆ నోటును ఉపసంహరించుకోనున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఊహాగానాలను కొట్టిపారేసిన కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌.. ఈ విషయంలో ఆందోళన పడాల్సిన అవసరం లేదని తెలిపారు. మంగళవారం జరిగిన రాజ్యసభ సమావేశంలో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ విశ్వంబర్‌ ప్రసాద్‌ నిషద్‌ రూ. 2వేల నోట్ల అంశాన్ని ప్రస్తావించారు. రూ. 2వేల నోట్లు తీసుకొచ్చిన తర్వాత దేశంలో నల్లధనం పెరిగిందని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా రూ. 2వేల నోట్ల స్థానంలో మళ్లీ రూ. 1000 నోట్లను తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు వస్తున్న వార్తల గురించి ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు స్పందించిన అనురాగ్‌ ఠాకూర్‌.. రూ. 2వేల నోట్ల విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు’ అని తెలిపారు. నల్లధనాన్ని అరికట్టడం.. నకిలీ కరెన్సీని నిర్మూలించడం.. ఉగ్రవాదులు, అతివాదుల ఆర్థిక మార్గాలకు అడ్డుకట్ట వేయడం.. డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడం తదితర లక్ష్యాలతో పెద్ద నోట్ల రద్దు చేపట్టినట్లు తెలిపారు. నోట్ల రద్దు తర్వాత డిజిటల్‌ చెల్లింపులు పెరిగాయన్నారు. చలామణిలో ఉన్న నగదు విలువ కూడా పెరిగిందన్నారు. ఇక పెద్ద ఎత్తున నకిలీ కరెన్సీ కూడా పట్టుబడిందని తెలిపారు.

* దలాల్‌ స్ట్రీట్‌ మళ్లీ బేర్‌మంది. విదేశీ మదుపర్లు పెట్టబడులకు మొగ్గుచూపినప్పటికీ.. దిగ్గజ షేర్లలో అమ్మకాలతో దేశీయ మార్కెట్లు విలవిల్లాడాయి. భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్‌ దాదాపు 250 పాయింట్లు పతనమవగా.. నిఫ్టీ 11,900 మార్క్‌ కిందకు పడిపోయింది. ఈ ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు క్రమక్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. 30 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్‌ను ప్రారంభించిన సెన్సెక్స్‌.. ఆ తర్వాత ఐటీ, లోహ, బ్యాంకింగ్‌ షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాలతో మరింత దిగజారింది. ట్రేడింగ్‌లో ఏ దశలోనూ కోలుకోలేని సూచీ చివరకు 247 పాయింట్లు పతనమై 40,240 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా 81 పాయింట్లు నష్టపోయి 11,857 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 70.92గా కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈలో బజాజ్‌ ఫైనాన్స్‌, హిందుస్థాన్‌ యునిలివర్‌, సిప్లా, ఐషర్‌ మోటార్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు స్వల్పంగా లాభపడ్డాయి. యెస్‌ బ్యాంక్‌ షేర్లు భారీగా పతమనయ్యాయి. నేటి ట్రేడింగ్‌లో ఈ షేరు ధర 10శాతానికి పైగా పడిపోయింది. ఇక జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, గెయిల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, భారత్‌ పెట్రోలియం షేర్లు కూడా నష్టపోయాయి.

* ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ల బాటలో ఇప్పుడు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కూడా పయనిస్తోంది. ప్రభుత్వ రంగానికి చెందిన ఈ బ్యాంక్‌తాజాగా ఎంసీఎల్‌ఆర్‌ వడ్డీరేట్లను అత్యధికంగా 20 బేసిస్‌ పాయింట్ల మేరకు తగ్గించింది. ఈ తగ్గింపు వివిధ కాలవ్యవధి రుణాలపై వివిధ రకాలుగా ఉండనుంది. నెలవారీ రుణాలపై 20బేసిస్‌ పాయింట్లు తగ్గి 7.65శాతం వడ్డీరేటుకు రానుంది.. ఇక మూడునెలలు.. ఆరునెలల ఎంసీఎల్‌ఆర్‌లు 7.80శాతం, 8.10శాతంగా ఉన్నాయి. ఏడాది కాలవ్యవధి కలిగిన వాటిపై 8.25శాతం వసూలు చేయనున్నారు. ఈ మార్పు డిసెంబర్‌ 12 నుంచి అమల్లోకి రానుంది. ఈ సారి పరపతి విధాన సమీక్షంలో ఆర్‌బీఐ వడ్డీరేట్లలో మార్పు చేయకపోయినా బ్యాంకులు వడ్డీరేట్లను తగ్గించడం విశేషం.

* దక్షిణ కొరియాకు చెందిన కార్ల తయారీ దిగ్గజం కియా మోటార్స్‌ మరో మైలురాయిని చేరుకొంది. అత్యధికంగా వాహనాలను తయారు చేసిన కంపెనీల్లో నాలుగో స్థానంలోకి చేరుకొంది. భారత్‌లో కియా సంస్థ సెల్టోస్‌ మోడల్‌ ఎస్‌యూవీ కారును మాత్రమే విక్రయిస్తోంది. భారత్‌లో అడుగుపెట్టిన కొన్ని నెలల్లోనే కియా తొలి ఐదు కంపెనీల్లో స్థానం దక్కించుకోవడం విశేషం. గతనెల కంపెనీ మొత్తం 14,005 కార్లను విక్రయించింది. కియా కంటే ముందు స్థానాల్లో మారుతీ సుజుకీ, హ్యూందాయ్‌, మహీంద్రా మాత్రమే ఉన్నాయి. ఇక అక్టోబర్‌లో కియా మొత్తం 12,800 వాహనాలను విక్రయించింది.

* మెట్రో రైల్లో అందుబాటులోకి వచ్చిన ఘ్5 మొబైల్‌ అప్లికేషన్‌ సేవలను హైదరాబాద్‌ మెట్రో రైల్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. మొబైల్‌ డేటా లేకుండానే వీడియోలు చూసే అవకాశం కల్పించింది. మెట్రోలో షుగర్‌ బాక్స్‌ నెట్‌వర్క్‌ను మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి ప్రారంభించారు. షుగర్‌ బాక్స్‌ నెట్‌వర్క్‌తో ఇంటర్నెట్‌ లేకుండానే వీడియోలు చూసే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఎన్వీఎస్‌ రెడ్డి మాట్లాడుతూ.. తొలుత 10 మెట్రోస్టేషన్లలో షుగర్‌ బాక్స్‌ మెట్రో లోకల్‌ వై-ఫై సేవలను ప్రారంభించినట్లు తెలిపారు. త్వరలోనే మరిన్ని స్టేషన్లలో అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. మెట్రో రైళ్లలో వినోదం, మేధోసంపత్తిని పెంచే పుస్తకాలు ఉంచాలని కోరామని ఎన్వీఎస్‌ రెడ్డి చెప్పారు. ఈ యాప్‌తో మూడు నిమిషాల్లో సినిమా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని చెప్పారు. మెట్రో స్టేషన్లలో ప్రజలకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు. రెండో దశ మెట్రో డీపీఆర్‌ సిద్ధమైందని, దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు. జనవరి నెలాఖరుకు జేబీఎస్‌-ఎంజీబీఎస్‌ పనులు పూర్తవుతాయన్నారు. ‘ ఆర్టీసీ సమ్మె సమయంలో 70 వేల మంది ప్రయాణికులు ఎక్కువగా వచ్చారు. ఇప్పటివరకు 14 లక్షల మెట్రో స్మార్ట్‌ కార్డులు విక్రయించాం. హైదరాబాద్‌ ఎలివేటెట్‌ బీఆర్‌ టీఎస్‌ కారిడార్‌ నిర్మాణం కోసం నాసిక్‌లో ఉన్న మెట్రో విధానాన్ని త్వరలోనే అధ్యయనం చేస్తాం’ అని అన్నారు.

* టాటాట్రస్ట్‌ సీఈవోగా టాటా టెలీసర్వీస్‌ ఎండీ ఎన్‌.శ్రీనాథ్‌ పేరు వినిపిస్తోంది. ఇప్పటికే ట్రస్ట్‌ పలు న్యాయవివాదాలను ఎదర్కొంటున్న సంయంలో సీఈవో నియామకం కోసం దాదాపు 8నెలల నుంచి తీవ్రంగా ప్రయత్నాలు జరిగాయి. దీనిపై టాటా ట్రస్ట్‌ ప్రతినిధి ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. సీఈవో అన్వేషణ కోసం ఏర్పాటు చేసిన సెర్చికమిటీకి గ్రూప్‌ ఛైర్మన్‌ రతన్‌ టాటా వ్యవహరించారు. ఈ నెలఖరు నాటికి సీఈవో ఎంపిక పూర్తికావచ్చు.

* టాటా మోటార్స్‌ నిక్సన్‌ ఈవీ డిసెంబర్‌ 19న మార్కెట్‌కు పరిచయం చేయనుంది. తొలుత డిసెంబర్‌ 17 అనుకున్నప్పటికీ అనివార్య కారణాలతో ఈ కార్యక్రమం రెండు రోజులపాటు వాయిదాపడింది. కారణాలను కంపెనీ వెల్లడించలేదు. దీనిని ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం(జనవరి-మార్చి)లో విడుదల చేసేఅవకాశం ఉంది. కంపెనీ సరికొత్త జిపట్రాన్‌ ఎలక్ట్రానిక్‌పవర్‌ ట్రైన్‌ టెక్నాలజీతో నిర్మించిన తొలికారు ఇదే కావడం గమనార్హం. ఈ కారులో పర్మినెంట్‌ మాగ్నెట్‌ ఏసీ మోటార్‌ను అమర్చారు. ఇది లిథియం అయాన్‌ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. ఈ కారు ఒక సారి ఛార్జి చేస్తే 250-300 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. ఈ కారు బ్యాటరీపై టాటామోటార్స్‌ 8 సంవత్సరాల వారెంటీని ఆఫర్‌ చేయనున్నట్లు ప్రకటించింది. దీనిలో డెడికేటెడ్‌ బ్యాటరీ మేనేజ్‌మెంట్‌సిస్టమ్‌ను అమర్చారు. ఇది జిపట్రాన్‌ పవర్‌ట్రైన్‌ బ్యాటరీ జీవితకాలాన్ని పెంచుతుంది. దీనికి ప్రత్యేకమైన కూలింగ్‌ సర్క్యూట్‌ ఉంది.