DailyDose

9మంది తెదేపా సభ్యుల సస్పెన్షన్-తాజావార్తలు-12/17

9 TDP MLAs Suspended-Telugu Breaking News Roundup-12/17

* ఏపీ రాజధానిపై ఆ రాష్ట్ర మఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శాసన సభలో కీలక ప్రకటన చేశారు ‘‘దక్షిణాఫ్రికా లాంటి దేశంలో మూడు రాజధానులు ఉన్నాయి. అమరావతిలో శాసన నిర్వాహక, విశాఖలో కార్యనిర్వాహక, కర్నూలులో హైకోర్టు పెట్టొచ్చు. ఇలాంటి ఆలోచనలు కూడా చేయాల్సిన అవసరముంది. బహుశా మన రాష్ట్రానికీ మూడు రాజధానులు వస్తాయేమో. లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌, ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌, జ్యుడిషియల్‌ క్యాపిటల్ వస్తాయేమో. ఆ పరిస్థితి కనిపిస్తోంది’’ అని అసెంబ్లీలో జగన్‌ అన్నారు.

* అమరావతిపై వైకాపా నేతలు మైండ్‌ గేమ్‌ ఆడుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. శాసనసభ నుంచి సస్పెండ్‌ చేసినందుకు నిరసనగా ప్రజావేదిక వద్ద తెదేపా ఎమ్మెల్యేలు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ..‘‘రాజధానిని ఎవరైనా 3 ప్రాంతాల్లో పెడతారా? ఏకపక్ష నిర్ణయాలు, తప్పుడు విధానాల వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుంది. జగన్‌ ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రాభివృద్ధి కుంటుపడుతోంది’’ అని చంద్రబాబు విమర్శించారు.

* ఏపీ శాసనసభ నుంచి 9 మంది తెదేపా సభ్యులను స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ సస్పెండ్‌ చేశారు. రాజధానిపై చర్చలో ప్రతిపక్ష నేత చంద్రబాబుకు అవకాశం ఇవ్వాలంటూ తెదేపా సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. దీంతో సభ నుంచి కింజరాపు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, బెందాళం అశోక్‌, ఏలూరి సాంబశివరావు, మద్దాలి గిరి, అనగాని సత్యప్రసాద్‌, గద్దె రామ్మోహన్‌, వెలగపూడి రామకృష్ణబాబు, బాల వీరాంజనేయస్వామిని సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు.

* నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కనికరం లేకుండా వ్యవహరిస్తోందని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ విమర్శించారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా, దాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయన్నారు. మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను సోనియా నేతృత్వంలోని విపక్ష నేతల బృందం కలిసింది. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వ్యతిరేక ఆందోళనలు, పోలీసుల వైఖరిని రాష్ట్రపతికి వివరించారు. ఈ పరిణామాలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రమతిని కోరారు.

* పౌరసత్వ సవరణ చట్టంపై ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌ ముస్లింలలో భయాన్ని సృష్టిస్తోందని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు. మంగళవారం ఝార్ఖండ్‌లోని బెర్‌హైట్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఏఏ చట్టం ఏ భారతీయ పౌరుడిపై ప్రభావం చూపించదని అన్నారు. కేవలం భారత చుట్టుపక్కల దేశాల్లో హింసకు గురై భారత్‌కు వచ్చిన మైనారిటీల కోసం మాత్రమే ఈ చట్టం ఉపయోగపడుతుందని అన్నారు.

* భారతీయ బ్యాంకులు ఈ నెలలో తమ మొండి బకాయిల్లో 7.6బిలియన్‌ డాలర్లను తిరిగి వసూలు చేసుకొనేందుకు రంగం సిద్ధమైంది. దివాల పరిష్కార న్యాయస్థానం కేసుల విచారణను వేగవంతం చేయడంతో రికవరీ జరగవచ్చన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఎస్సార్‌ స్టీల్‌, ప్రయాగ్‌రాజ్‌ పవర్‌ జనరేషన్‌, రుచి సోయా ఇండస్ట్రీస్‌, రత్తన్‌ ఇండియా పవర్‌ లిమిటెడ్‌కు సంబంధించిన కీలక కేసుల భవితవ్యం డిసెంబర్‌లో తేలిపోనుంది.

* పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మంగళవారం కూడా దిల్లీలో నిరసనలు హోరెత్తాయి. ఆందోళనకారుల ఆగ్రహజ్వాలలతో తూర్పు దిల్లీ ప్రాంతం దద్ధరిల్లింది. శీలంపూర్‌ ప్రాంతంలో వేలాది మంది ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి హింసాకాండకు పాల్పడ్డారు. పోలీసులతో వాగ్వాదానికి దిగి వారిపై రాళ్లు రువ్వారు. పలు వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు లాఠీ ఛార్జి చేసి భాష్పవాయువు ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు.

* రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో సీఎం కేసీఆర్‌ కుటుంబంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో ‘కల్వకుంట్ల సేల్స్‌ ట్యాక్స్‌’ (కేఎస్‌టీ) అమలవుతోందని.. ఏం చేయాలన్నా ఆరుశాతం కమీషన్‌ ముట్టజెప్పాల్సిందేనని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మద్యం ధర పెంపు వెనుక కేఎస్‌టీ మాఫియా ఉందని ఆయన ఆరోపించారు.

* శబ్దం కంటే వేగంగా ప్రయాణించే (సూపర్‌సానిక్‌) బ్రహ్మోస్‌ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్టు భారతదేశ భద్రతా వర్గాలు తెలిపాయి. భారత రక్షణ వ్యవస్థ సాధించిన విజయాలలో మరో కలికితురాయి అనదగిన ఈ ప్రయోగం ఈ రోజు ఉదయం 8:30కి ఒరిస్సా చాందీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ లోని కాంప్లెక్స్‌ 3 నుంచి జరిగింది. బ్రహ్మోస్‌ క్షిపణిని కంప్యూటర్‌ ద్వారా నియంత్రిస్తూ (క్రూయిజ్‌) ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించవచ్చు.

* ప్రముఖ చైనీస్‌ టెక్‌దిగ్గజం రియల్‌ మీ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ ‘రియల్‌ మీ ఎక్స్‌2’ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 16,999గా ఉంది. రియల్‌ మీ ఎక్స్‌టీకి అప్‌గ్రేడ్‌ వెర్షన్‌గా ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ మూడు వేరియంట్లలో లభించనున్నట్లు సంస్థ ప్రకటించింది. 4 జీబీ +64 జీబీ వేరియంట్‌ ధర రూ. 16,999, 6 జీబీ+128 జీబీ ధర రూ. 18,999, 8 జీబీ+128 జీబీ వేరియంట్‌ ధర రూ. 19,999గా నిర్ణయించినట్లు సంస్థ వెల్లడించింది.