DailyDose

రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌లో ప్లాస్టిక్ లస్సీ కలకలం-నేరవార్తలు-12/22

Plastic Lassi Sold In Ratnachal Express At Vizag Station-Telugu Crime News-12/22

* సెంట్రల్‌ అమెరికాలోని హొండురస్‌ దేశ జైల్లో ఖైదీల మధ్య జరిగిన గొడవల్లో 18 మంది మరణించగా, 16 మంది గాయపడ్డారు. ఆ దేశంలోని ఉత్తరభాగంలో నగరమైన టెలాలోని జైల్లో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. వీరిలో 17 మంది జైల్లోనే మృతిచెందగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు అధికారులు తెలిపారు. ఖైదీల మధ్య గొడవ ఎందుకు జరిగిందో తమకు తెలియరాలేదని చెప్పారు. ఇటీవల ఇదే జైల్లో అయిదు మందిని మరో ఖైదీ కాల్చి చంపడంతో దేశంలోని జైళ్లను అన్నింటినీ ఆర్మీ అదుపులోకి తీసుకోవాలంటూ ఆ దేశాధ్యక్షుడు జువాన్‌ ఓర్లాండో హెర్నాండెజ్‌ ఆదేశాలు జారీ చేశారు.  జైలు ఆర్మీ అదుపులోకి రాలేదని జైలు అధికారి డిగ్నా చెప్పారు. 

* రత్నాచల్ ఎక్స్ప్రెస్ లో ప్లాస్టిక్ లస్సీ కలకలం. విశాఖపట్నం రైల్వే కాంటీన్లో లస్సీ హెరిటేజ్ కంపెనీ వారిది. ఎన్క్వ్యేరీ చేస్తున్న పోలీసులు…ఆందోళనలో ప్రయాణీకులు.

* కొత్త పౌరసత్వ చట్టం (సీఏఏ)పై దేశంలోని పలుచోట్ల నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఆదివారంనాడు సీఏఏ అనుకూల ర్యాలీని లోక్ అధికార్ మంచ్ నిర్వహించింది. స్థానిక యశ్వంత్ స్టేడియం నుంచి సంవిధాన్ చౌక్ వరకూ ఈ ర్యాలీ జరిగింది. ‘సీఏఏను నాగపూర్ స్వాగతిస్తోంది’ అనే ప్లకార్డులను పట్టుకున్న వందలాది కార్యకర్తలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. సీఏఏకు అనుకూలంగా నినాదాలిచ్చారు. లోక్ అధికార్ మంచ్, బీజేపీ, ఆర్ఎస్ఎస్, తదితర సంస్థలు ఈ ర్యాలీ చేపట్టాయి. పలువురు జాతీయపతాకాన్ని ఎగురవేస్తూ ప్రదర్శనలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా పలు చోట్ల పెద్దఎత్తున సీఏఏ వ్యతిరేక నిరసనలు ఎగసిపడుతున్న తరుణంలో నాగపూర్‌లో సీఏఏ అనుకూల ర్యాలీ నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

* తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధి బృందానికి యూపీ పోలీసులు షాక్ ఇచ్చారు. పౌరసత్వ సవరణ చట్టానికి నిరసనగా యూపీలో జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారడం, పోలీసు కాల్పుల్లో పలువురు మరణించిన నేపథ్యంలో మృతుల కుటుంబాలను ఆదివారంనాడు పరామర్శించేందుకు లక్నోలో పర్యటిస్తామని ప్రకటించిన తృణమూల్ కాంగ్రెస్‌ ప్రతినిధి బృందానికి యూపీ పోలీస్ బాస్ అనుమితి నిరాకరించారు. టీఎంసీ ఎంపీల బృందాన్ని అనుమతించేది లేదని యూపీ డీజీపీ ఓపీ సింగ్ మీడియాకు తెలిపారు. కొంతమంది తృణమూల్ కాంగ్రెస్ నేతలు లక్నోలో పర్యటించనున్నట్టు తమకు తెలిసిందని, అయితే సదరు ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉందని, నేతల పర్యటనతో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశాలుంటాయని చెప్పారు. ఆ దృష్ట్యా టీఎంసీ ప్రతినిధి బృందాన్ని అనుమతించేది లేదని ఓపీ సింగ్ స్పష్టం చేశారు.

* రాజధానిలో 5వ రోజు రైతు ఆందోళనలు ఉద్దండరాయిని పాలెం శంకుస్థాపన ప్రదేశంలో వంటావార్పు తుళ్లూరు,మందడం, రాయపూడి, పెద్దపరిమి గ్రామాల్లో మహా ధర్నా వెలగపూడిలో కొనసాగుతున్న 5వ రోజు రిలే నిరాహారదీక్షలు నిరసనలో పాల్గొననున్న 29గ్రామాల ప్రజలు దీక్షకు మద్దతు తెలపనున్న విట్ విద్యార్థులు, రాజకీయ పార్టీలు, వివిధ సంఘాలు మందడం లో రైతుల ధర్నాకు మద్దతు గా పాల్గొన్న విట్ విద్యార్థులు మా ఉన్నత భవిష్యత్తు కోసమే రైతులు త్యాగాలు చేశారు. -విద్యార్థులు ఒక రాజధాని పూర్తికాకుండా 3రాజధానులు అభివృద్ధి అసాధ్యం. -విద్యార్థులు ప్రభుత్వం తమ నిర్ణయం మార్చుకు వరకు రైతులకు మద్దతు గా మేమూ పోరాడతాం. -విద్యార్థులు

* తన భార్యను ప్రేమించాలంటూ తన కింద పనిచేసే ఉద్యోగిని యజమానే ప్రోత్సహించిన వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న కేసును విచారించిన గుజరాత్ పోలీసులు, నరాలు తెగే ఉత్కంఠకు సమానమైన రియల్ క్రైమ్ స్టోరీని వెలుగులోకి తెచ్చారు. ఈ వివరాలను పరిశీలిస్తే,    ఐదు నెలల క్రితం నిఖిల్ పర్మార్ అనే 19 ఏళ్ల యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని మృతికి యజమానే కారణమని వెల్లడైంది. వాస్నా సమీపంలోని వెడ్డింగ్ డెకరేషన్ కంపెనీలో, గత సంవత్సరం నిఖిల్ ఉద్యోగంలో చేరాడు. ఆపై 10 నెలల తర్వాత తాను ఉద్యోగం మానేస్తున్నానని తండ్రి అశోక్‌కు చెప్పాడు.    తన యజమాని, అతని భార్య వేధిస్తున్నారంటూ వాపోయాడు. జీతం తీసుకుని వస్తానని జూలై 14న ఆఫీసుకు వెళ్లిన నిఖిల్, ఆపై అతనితో కలిసి రాజస్థాన్‌కు వెళుతున్నానని చెప్పాడు. ఆపై ఐదు రోజులకు నిఖిల్ ఆత్మహత్య చేసుకున్నాడన్న సమాచారం అందింది.   మూడు నెలల తర్వాత నిఖిల్ తోబుట్టువులు సంజయ్, నిషలు సెల్ ఫోన్‌ను పరిశీలిస్తుండగా, నమ్మలేని విషయాలు బయటకు వచ్చాయి. తన యజమానికి నిఖిల్ పంపిన మెసేజ్‌లు ఉన్నాయి.    ‘మీ భార్యను ప్రేమించమని నాకు చెప్పారు. మీరు చెప్పినట్టే చేశాను. ఇప్పుడామె నన్నూ ప్రేమిస్తోంది. వివాహేతర సంబంధం కూడా పెట్టుకున్నాము. ఇప్పుడు మీరు మాట మార్చారు. మా రిలేషన్ షిప్‌ను వదులుకోమని అంటున్నారు. బెదిరిస్తున్నారు. జీతం ఇవ్వడం లేదు. నన్ను మీ బానిసలా చూడొద్దు. నా మీద దయ చూపండి’ అని వేడుకుంటున్న మెసేజ్‌‌లు సెల్ ఫోనులో ఉన్నాయి.   వాటి ఆధారంగా కేసును దర్యాఫ్తు చేసిన పోలీసులు, యజమాని భార్య అతనికన్నా 20 ఏళ్లు చిన్నదన్న విషయం పసిగట్టారు. అశోక్ పర్మార్ ప్రోత్సాహంతో ఆయన భార్యతో నిఖిల్ సంబంధం పెట్టుకున్నాడు. ఇదే విషయాన్ని ఆమెకు చెప్పాడు. తనతో నిఖిల్ కు ఉన్న బంధం వెనుక భర్త ఉన్నాడని తెలుసుకున్న ఆమె తట్టుకోలేక, భర్తతో గొడవ పడింది.    ఇక ఈ గొడవలు తనకు వద్దని భావించిన అశోక్, నిఖిల్‌ను హెచ్చరించాడు. అశోక్ భార్య మాత్రం నిఖిల్‌ను వదిలేందుకు ఇష్టపడకుండా, అతన్ని సంబంధం కొనసాగించాలని ఒత్తిడి తెచ్చింది. దీంతో ఇద్దరి మధ్యా నలిగిపోయిన నిఖిల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసును విచారించిన పోలీసులు, వారిద్దరిపై ఆత్మహత్యకు ప్రేరేపించడం, ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద కేసులు నమోదు చేశారు.

* ఏపీ ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. బ్రేక్ పట్టేయడంతో బి1 బోగి నుంచి మంటలు చెలరేగాయి. వెంటనే ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. అప్రమత్తమైన సిబ్బంది రైలును నిలిపి మంటలార్పారు. రైలు ఢిల్లీ నుంచి విశాఖకు వెళ్లే మధ్యలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

* పిల్లలను అందంగా ముద్దుగా తయారుచేసి.. ఫొటోలు తీసి తల్లిదండ్రులు ముచ్చటపడిపోతుంటారు. తమ వద్ద ఉన్న నగలతో చిన్నారులను అలంకరించి.. సరదా పడుతుంటారు. అయితే, ఇలా పిల్లలను నగలతో అలకరించడం, చిన్నారి శిశువులకు ఉంగరాలు తొడిగే విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. పిల్లలకు అది ప్రమాదంగా పరిణమించవచ్చునని తాజా ఘటన చాటుతోంది. నిజామాబాద్‌ పట్టణంలో ఓ తల్లిదండ్రులు తమ ఐదు నెలల చిన్నారిని ఉంగరంతో అలంకరించారు. అయితే, చిన్నారి ఆడుతూ.. పాడుతూ అనుకోకుండా ఉంగరం మింగేశాడు. అది గొంతులో ఇరుక్కోవడంతో ఆ శిశువు బాధతో విలవిలలాడిపోయాడు. దీంతో తీవ్ర కలవరపాటుకు లోనైన తల్లిదండ్రులు బాలుడ్ని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు ఎక్స్‌రే పరీక్షలు నిర్వహించి.. ఉంగరం గొంతులో ఉన్నట్టు గుర్తించారు. చికిత్స ద్వారా గొంతు నుంచి వైద్యులు ఉంగరాన్ని తొలగించారు. ప్రస్తుతం ఐదు నెలల చిన్నారి యాసిన్ క్షేమంగా ఉన్నాడు. తమ కొడుకు క్షేమంగా బయటపడటంతో తల్లిదండ్రులూ ఊపిరిపీల్చుకున్నారు.

* పౌరసత్వ సవరణ చట్టంపై ఉత్తరప్రదేశ్‌లో పెల్లుబికిన నిరసనల్లో ఫిరోజాబాద్‌కు చెందిన ఓ కానిస్టేబుల్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఆందోళనకారులు పేల్చిన తూటా ఆయన ధరించిన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌ను ఛేదించుకుని వెళ్లి ఆయన జేబులో పెట్టుకున్న వాలెట్‌లో చిక్కుకుపోయింది. దీంతో మృత్యువు అంచుల వరకూ వెళ్లి అతను బతికి బయటపడ్డాడు. ఇది నాకు పునర్జన్మే అంటూ కానిస్టేబుల్ విజేంద్ర కుమార్ మీడియా ముందు తన అనుభవాన్ని పంచుకున్నాడు.

* ప్రేమించడానికి వయసు తేడా అడ్డు రాలేదు. కానీ పెళ్లి చేసుకోవడానికి మాత్రం సమాజం గురించి భయపడ్డారు. చివరికి ప్రాణం తీసుకున్నారు. ఆమె వయసు ఇరవై ఎనిమిది. అతడి వయసు పందొమ్మిది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. కుటుంబాలకు తెలియకుండా కలసి గడిపారు. ఆమె గర్భవతి అయింది. ఇద్దరి మధ్య వయసుతేడా తొమ్మిదేళ్లు ఉంది. అదే అమ్మాయి చిన్న అయితే .. అసలు విషయమే అయి ఉండేది కాదు..కానీ ఇక్కడ అబ్బాయి చిన్నవాడు. సమాజానికి ఎలా సమాధానం చెప్పాలో తెలియక.. వారు ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. ఈ కొత్త తరహా విషాదాంత ప్రేమ కథ .. కృష్ణాజిల్లాలో జరిగింది. విజయవాడలోని ఓ లాడ్జిలో రెండు రోజుల ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసింది. వారిని గన్నవరం మండలం తెంపెల్లి గ్రామానికి చెందిన నాగగౌతమి, గుడివాడకు చెందిన లోకేష్‌గా గుర్తించారు. ఆమె వయసు ఇరవై ఎనిమిది. లోకేష్ వయసు పందొమ్మిది. లోకేష్‌, గౌతమి కొంతకాలంగా ప్రేమించు కుంటున్నారు. ఇంట్లో పెళ్లికి పెద్దల్ని ఒప్పించలేకపోయారు. ఆమె కనీసం తల్లిదండ్రులకు చెప్పలేకపోయింది. గర్భవతి కావడంతో ఆందోళనలో ఉన్నట్లు డైరీలో రాసింది గౌతమి. గౌతమి గౌతమి పాలిటెక్నిక్‌ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేసే సమయంలో అదే కాలేజీలో చదువుతున్న లోకేష్‌తో పరిచయం అయింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ప్రస్తుతం పాలిటెక్నిక్‌ మూడో ఏడాది చదువుతున్నాడు లోకేష్‌. ఆత్మహత్యాయత్నంతో గౌతమి మృతి చెందింది. లోకేష్ కొనఊపిరితో ఉన్నాడు. ప్రేమించినప్పుడు ధైర్యం ఉండాలని.. సినిమాల్లో చూసుంటారు కానీ.. నిజ జీవితంలో మాత్రం.. వీరు ధైర్యం చేయలేకపోయారు. ప్రాణాలు తీసుకోవడమే తేలికనుకున్నారు.

* పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని మందడం రైతులు ఆరోపిస్తున్నారు. రోడ్డుపై టెంటు తీసి ఉదయాన్నే వేసుకోవాలని డీఎస్పీ చెప్పారని రైతులు పేర్కొన్నారు. ఇవాళ టెంటు వేయకుండా పోలీసులు అడ్డుకున్నారని విమర్శించారు. పంచాయతీ కార్యాలయాలకు వేసిన పార్టీ రంగును తామే తుడిచేశామన్నారు. పార్టీ రంగు పంచాయతీ కార్యాలయానికి వేయటం తప్పుకాదా? అని ప్రశ్నించారు. పోలీసుల కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. పోలీసులపై తాము ప్రైవేటు కేసులు పెడతామన్నారు. ఖాకీ బట్టలు బదులు వైసీపీ దుస్తులు ధరించి విధులు చేయండి అని రైతులు మండిపడ్డారు.

* ప్రపంచ వ్యాప్తంగా ఏటా 2,15,000 మందిని పొట్టనపెట్టుకుంటున్న ‘రోటా వైరస్‌’ దాడి రహస్యం వెల్లడైంది. ఇది ఇన్‌ఫెక్షన్‌గా మారడానికి శరీరం ఎందుకు సహకరిస్తోందన్న చిక్కుముడి వీడిపోయింది. కెనడాలోని టొరంటో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు దీన్ని ఛేదించారు.పేగుల్లో అత్యంత సహజంగా జరిగే ‘లింటోటాక్సిన్‌ పాత్‌వే’ రసాయన ప్రక్రియ… రోగ నిరోధక వ్యవస్థ అభివృద్ధికి దోహదపడుతుంది. అయితే శాస్త్రవేత్తలు కొన్ని ఎలుకల్లో ఈ ప్రక్రియను నిలిపివేశారు. పర్యవసానంగా వాటిలోని యాంటీబాడీలు రోటా వైరస్‌కు ప్రతి స్పందించడం మానేశాయి. ఈ వైరస్‌ను ఎదుర్కొనే ‘ఇమ్యునోగ్లోబులిన్‌-ఎ’ అనే యాంటీబాడీల ఉత్పత్తి కూడా నిలిచిపోయింది. అయితే ఇక్కడో గమ్మత్తయిన విషయం బయటపడింది. ఈ నిరోధక ప్రక్రియ ఫలితంగా పేగుల్లోని కణాల (మెసెంటెరిక్‌ లింప్‌ నోడ్‌ స్ట్రోమల్‌ సెల్స్‌)పైనా ప్రభావం చూపినట్టు తేలింది. ఈ స్ట్రోమల్‌ సెల్స్‌… ఇమ్యునోగ్లోబులిన్‌-ఎ ఉత్పత్తికి దోహదపడే ఇమ్యూన్‌-బి సెల్స్‌ పనితీరును మందగింపజేస్తున్నట్టు గుర్తించారు. స్ట్రోమల్‌ సెల్స్‌ను బలోపేతం చేయడం ద్వారా… ఇమ్యూన్‌-బి సెల్స్‌ పనితీరు మెరుగుపడి ఇమ్యునోగ్లోబులిన్‌-ఎ ఉత్పత్తి ఇతోధికంగా సాగుతుందని, తద్వారా రోటావైరస్‌ను ఎదుర్కొనేలా రోగ నిరోధక వ్యవస్థను బలోపేతమవుతుందని పరిశోధనకర్త గొమెర్మాన్‌ విశ్లేషించారు. గర్భిణులు, వారికి పుట్టబోయే బిడ్డలను మరణ ముప్పు నుంచి తప్పించేందుకు ఈ పరిశోధన దోహదపడుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ‘సైన్స్‌ ఇమ్యునాలజీ’ పత్రిక ఈ వివరాలను అందించింది.