DailyDose

సీమ పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం-తాజావార్తలు-12/24

Rayalaseema pending projects will be finished-telugu breaking news roundup-12/24

* ఎన్‌ఆర్‌సీపై ప్రధాని నరేంద్రమోదీ చెప్పిందే నిజమని.. దీనిపై పార్లమెంట్‌, కేంద్ర మంత్రివర్గంలో చర్చ జరగలేదని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. దీనిపై చర్చ అవసరం లేదని చెప్పారు. దిల్లీలో ఓ న్యూస్‌ ఏజెన్సీకి ఇచ్చిన ప్రత్యేక ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. ‘‘దేశ జనగణన వేరు.. ఎన్‌పీఆర్‌ వేరు.. రెండింటికీ చాలా తేడా ఉంది. జాతీయ పౌరపట్టిక (ఎన్‌ఆర్‌సీ), జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్‌)కు సంబంధం లేదు’’ అని షా చెప్పారు.

* భారతీయ రైల్వే వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చేందుకు రంగం సిద్ధమైంది. భారతీయ రైల్వేని ఒకే తాటిపైకి తెచ్చేందుకు కేంద్ర మంత్రివర్గం తీర్మానించింది. ప్రస్తుతమున్న ఇంజినీరింగ్‌, ట్రాఫిక్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ వంటి ఎనిమిది సర్వీసుల బదులుగా‌- ఇకపై ఒకే ఇండియన్‌ రైల్వే సర్వీస్‌గా కొనసాగటానికి కేబినెట్‌ ఆమోదించింది. అంతే కాకుండా రైల్వే బోర్డు పరిమాణాన్ని తగ్గించాలని కూడా నేడు జరిగిన కేబినెట్‌ సమావేశం నిర్ణయించింది.

* రాజధాని రైతుల ఆందోళనకు మద్దతుగా మంగళగిరిలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో పాటు పెద్ద సంఖ్యలో రైతులు, కూలీలు, వివిధ ప్రజాసంఘాల నేతలు ప్రదర్శనలో పాల్గొన్నారు. ‘‘ ఆ నాడు ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టనని జగన్‌ చెప్పారు. మూడు ముక్కలుగా రాష్ట్రాన్ని విడగొట్టి బిస్కెట్‌ విసిరినట్లు విసిరితే అభివృద్ధి ఎలా సాధ్యం. జీఎన్‌ రావు కమిటీ ఓ బోగస్‌ కమిటీ’’ అని లోకేశ్‌ విమర్శించారు.

* రాజధాని ప్రాంత రైతులు మంగళవారం సాయంత్రం ఆత్కూరులోని స్వర్ణభారతి ట్రస్ట్‌ కార్యాలయంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ప్రధాని మోదీ వచ్చి రాజధానికి శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. ‘మీరూ రైతు బిడ్డే.. మా కష్టాలు మీకు తెలుసు. ప్రభుత్వం మారిన ప్రతిసారి రాజధాని మారకుండా చూడాలి’ అని విజ్ఞప్తి చేశారు.

* అటల్‌ జల్‌, అటల్‌ టన్నెల్‌ కార్యక్రమాలను త్వరలో ప్రారంభిస్తామని కేంద్రమంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ తెలిపారు. కేంద్ర మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… జనగణన ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకు కొనసాగుతుందని, జనగణన కోసం యాప్‌ తయారు చేస్తున్నామని వెల్లడించారు. జనగణన విషయంలో యూపీఏ ప్రభుత్వం అనుసరించిన విధానాన్నే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తోంది.

* జాతీయ రహదారులపై ఏర్పాటు చేసిన టోల్‌ప్లాజాల వద్ద ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్‌ విధానాన్ని తీసుకొచ్చింది. కాగా.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1.10కోట్ల ఫాస్టాగ్‌లను జారీ చేసినట్లు జాతీయ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) వెల్లడించింది. ఇక ఫాస్టాగ్‌లో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలపై స్పందించిన అధికారులు.. ఇప్పటివరకు తమ వద్దకు వచ్చిన అన్ని సమస్యలను పరిష్కరించామన్నారు.

* హైకోర్టును అమరావతి నుంచి కర్నూలు తరలించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు వ్యతిరేకంగా అమరావతిలో న్యాయవాదులు ఆందోళనను ఉద్ధృతం చేశారు. హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ సర్వసభ్య సమావేశం నిర్వహించిన న్యాయవాదులు ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. ఈనెల 26, 27 తేదీల్లో విధులు బహిష్కరించి నిరసన తెలపాలని నిర్ణయించారు. మూడు ముక్కల రాజధాని తమకు వద్దంటూ హైకోర్టు న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసనకు దిగారు.

* శిక్షణ ఐపీఎస్‌ అధికారి మహేశ్వర్‌రెడ్డి సస్పెన్షన్‌ను కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ (క్యాట్‌) రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఐపీఎస్‌ శిక్షణకు అతన్ని అనుమతించాలని, తుది ఉత్తర్వులకు లోబడి మహేశ్వర్‌రెడ్డి నియామకం ఉంటుందని క్యాట్‌ ఆదేశించింది. ప్రేమ పెళ్లి చేసుకుని వేధించారని మహేశ్వర్‌రెడ్డిపై ఆయన భార్య భావన హైదరాబాద్‌ జవహర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో. గృహహింస, ఎస్సీ, ఎస్టీ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

* తెదేపా మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుపై నమోదైన కేసుల వ్యవహారాన్ని సీబీఐకి అప్పగిస్తూ రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. గుంటూరు జిల్లాలోని కోణంకి, కేసనుపల్లి, నడికుడిలో యరపతినేనిపై అక్రమ మైనింగ్‌ ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఆయనతో సహా పలువురిపై 18 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో సీబీఐ విచారణకు ప్రభుత్వం సిఫార్సు చేసింది.

* పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర పట్టిక(ఎన్‌ఆర్‌సీ)ను కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయబోమని కాంగ్రెస్‌ అధికారికంగా ప్రకటించాలని ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్‌ కిశోర్‌ అన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ నుంచి అధికారిక ప్రకటన వెలువడేలా రాహుల్‌ గాంధీ చూస్తారని ఆశిస్తున్నామన్నారు.

* ఇటీవల పార్లమెంట్‌ ఆమోదించిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సవరణ చట్టం వివాదాస్పదంగా మారడంతో దీనికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో సీఏఏపై తీవ్ర గందరగోళం నెలకొన్న నేపథ్యంలో ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ తాజాగా నిర్ణయించింది. ఎంపీలు, పలువురు ప్రముఖులు, ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించింది.

* రాయలసీమలో పెండింగ్‌ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని సీఎం జగన్‌ అన్నారు. రాయలసీమతో పాటు గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు గోదావరి జలాలతో సస్యశ్యామలం చేసేందుకు కృషిచేస్తున్నామని చెప్పారు. దీనికోసం రూ.60వేల కోట్లతో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారన్నారు. కడప జిల్లా పర్యటనలో భాగంగా రాయచోటిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థా్ప చేసిన అనంతరం సీఎం మాట్లాడారు. రైతులకు ఎంతచేసినా తక్కువే అని చెప్పారు.

* అమరావతి నుంచి హైకోర్టును తరలించవద్దని బెజయవాడ బార్‌ అసోసియేషన్ డిమాండ్‌ చేసింది. అన్ని ప్రాంతాలకు సమదూరంలో ఉన్న హైకోర్టును మారిస్తే.. అత్యధికులు ఇబ్బంది పడతారని న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేస్తూ విజయవాడ కోర్టు నుంచి ర్యాలీ నిర్వహించారు. హైకోర్టును కర్నూలుకు తరలిస్తే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని న్యాయవాదుల ఐకాస వెల్లడించింది. మూడు రాజధానులతోపాటు హైకోర్టు తరలింపు యోచనను విరమించుకోవాలి డిమాండ్‌ చేసింది.

* ఉన్న వనరులతో విశాఖ నగరం పరిపాలనా రాజధానిగా అభివృద్ధి చెందుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాజధాని తరలింపు పేరుతో తెదేపా నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖలో మీడియాతో ఆయన మాట్లాడారు. విశాఖ నగరాన్ని తానే అభివృద్ధి చేశానంటూ తెదేపా అధినేత చంద్రబాబు చెప్పుకోవడం హాస్యాస్పదమని.. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే అభివృద్ధి చెందిందని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు మాయలో రైతులు పడొద్దని బొత్స కోరారు.

* జాతీయ జనాభా రిజిస్టర్‌ అప్‌డేషన్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. ఇందుకోసం రూ. 8,500కోట్లు కేటాయించింది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్‌ఆర్‌సీ, సీఏఏకు వ్యతిరేకంగా చాలా రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

* ఏపీలో మూడు రాజధానుల అంశంపై ప్రధాని మోదీకి అమరావతి ప్రాంత రైతులు లేఖలు రాశారు. రాజధాని విషయంలో తమకు అన్యాయం జరిగిందని మూడు పేజీల లేఖలో వివరించారు. ప్రతి లేఖకు రైతుల ఆధార్‌ జిరాక్స్‌లను లేఖకు జోడించి ప్రధాని కార్యాలయానికి స్పీడ్‌ పోస్ట్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంపై ప్రధాని జోక్యం చేసుకోవాలని కోరారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన తీరు.. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను అందులో పేర్కొన్నారు.

* నిత్యం బాంబు పేలుళ్లు, ఉగ్రదాడులతో అట్టుడుకిపోతున్న అఫ్గానిస్థాన్‌.. ముష్కరుల ఆట కట్టించేందుకు భీకర ఆపరేషన్లు చేపట్టింది. కేవలం 24 గంటల్లోనే 100 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చింది. ఈ మేరకు ఆ దేశ రక్షణ శాఖ మంగళవారం అధికారిక ప్రకటన చేసింది. గడిచిన 24 గంటల్లో అఫ్గాన్‌ వ్యాప్తంగా 15 ప్రావిన్స్‌లలో 18 ఆపరేషన్లు చేపట్టినట్లు ఆ దేశ రక్షణ శాఖ ట్విటర్‌లో పేర్కొంది. ఈ ఆపరేషన్లలో 109 మంది ఉగ్రవాదులను అఫ్గాన్‌ బలగాలు మట్టుబెట్టగా.. మరో 45 మంది ముష్కరులు గాయపడినట్లు వెల్లడించింది.

* పాకిస్థాన్‌లో భద్రత గురించి మొదట ఆందోళన వ్యక్తం చేయాలని బీసీసీఐ ఉపాధ్యక్షుడు మహిమ్‌ వర్మ పాక్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ)ను విమర్శించారు. ఇతర దేశాలు సురక్షితమా? కాదా? అనేది తర్వాత చూసుకోవచ్చని పేర్కొన్నారు. భారత్‌ సురక్షితం కాదన్న పీసీబీ ఛైర్మన్‌ ఎహ్‌సన్‌ మణి వ్యాఖ్యలను ఆయన తిప్పికొట్టారు. అర్థం లేకుండా మాట్లాడొద్దని హితవు పలికారు. ‘ముందు వారి సొంత దేశంలో భద్రత గురించి చూసుకోమనండి. దాని గురించి బాగా ఆలోచించమనండి. మా దేశం, మా భద్రతను చూసుకొనే సామర్థ్యం మాకుంది’ అని వర్మ తెలిపారు.

* దిశ హత్యాచార నిందితుల రీపోస్టుమార్టం వీడియో హైకోర్టుకు చేరింది. దిల్లీ నుంచి వచ్చిన ఎయిమ్స్‌ ప్రత్యేక వైద్య బృందం రీపోస్టుమార్టం ప్రాథమిక నివేదికను హైకోర్టు రిజిస్ట్రార్‌కు అందజేసింది. దీంతోపాటు రీపోస్టుమార్టం సమయంలో చిత్రీకరించిన వీడియో సీడీని కూడా జత చేశారు. మరో వారంలోగా దీనికి సంబంధించిన సమగ్ర నివేదికను అందించనున్నట్లు సమాచారం.

* త్రివిధ దళాలు(ఆర్మీ, నేవీ, వాయుసేన) కలిసి సమన్వయంతో పనిచేసేందుకు గానూ ఒక ఉన్నత స్థాయి పదవిలో అధికారిని నియమించేందుకు భద్రతపై ఏర్పాటైన కేబినెట్‌ కమిటీ అంగీకారం తెలిపింది. మూడు దళాలకు కలిపి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌(సీడీఎస్‌) పదవి సృష్టించేందుకు ఈ కమిటీ నేడు ఆమోద ముద్ర వేసింది. అంతేగాక.. సీడీఎస్‌ బాధ్యతలు, ఈ పదవి ఫ్రేమ్‌వర్క్‌పై జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోభాల్‌ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ ఇచ్చిన నివేదికను కూడా కేబినెట్‌ కమిటీ ఆమోదించింది.