Business

ఇకపై SBI ATM వాడాలంటే OTP తప్పనిసరి

SBI ATM Withdrawal Makes OTP Mandatory

ఏటీఎం మోసాలకు చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వరంగ అతిపెద్ద బ్యాంక్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) నడుం బిగించింది. ఏటీఎంలో జనవరి 1 నుంచి రూ.10వేలు, అంతకు పైబడి నగదు ఉపసంహరణకు ఓటీపీని ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు చేసే లావాదేవీలకు ఓటీపీ విధానం వర్తిస్తుందని ఎస్‌బీఐ పేర్కొంది. ఎస్‌బీఐ వినియోగదారులు ఏటీఎంలో నిర్దేశించిన సమయంలో నగదు విత్‌ డ్రా చేయడానికి వెళ్లేటప్పుడు స్క్రీన్‌పై ఓటీపీ అడుగుతుంది. వారి రిజిస్టర్‌ మొబైల్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్‌ చేయడం ద్వారా లావాదేవీ జరపొచ్చు. ఓటీపీ ద్వారా కేవలం ఒక్క లావాదేవీ మాత్రమే చేయొచ్చని ఎస్‌బీఐ తెలిపింది. దీనివల్ల అనధికార లావాదేవీలను నివారించొచ్చని పేర్కొంది. ఎస్‌బీఐ వినియోగదారులు ఇతర ఏటీఎంల్లో గానీ, ఇతర బ్యాంకు కార్డు వినియోగదారులు ఎస్‌బీఐ ఏటీఎంల్లో గానీ ఈ సదుపాయాన్ని పొందలేరు. ఈ మార్పు చేయడానికి ఏటీఎంల్లో పెద్ద మార్పులేమీ అవసరలేదని, జనవరి 1 నుంచి ఓటీపీ విధానం తీసుకొస్తున్నామని ఎస్‌బీఐ తెలిపింది. ఈ విధానం ద్వారా ఏటీఎం కేంద్రాల్లో క్లోనింగ్‌ కార్డుల ద్వారా జరిగే మోసాలకు చెక్‌ పెట్టేందుకు వీలవుతుంది.