Devotional

31న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Koyil Alwar Tirumanjanam On 31st Dec

**వేదాలుగా శిలలుగా మారి వెలిసినట్లుగా భావించే తిరుమల కొండపై ఉన్న ఆనంద నిలయం భక్తుల కొంగు బంగారం. వేంకటనాథుడి కొలువైన ఈ దివ్య స్థలి పరమ పవిత్రం, మహిమాన్వితం. దర్శించినంతనే అనంత ఆనందానుభూతులను పంచే ఈ ఆధ్యాత్మిక శక్తి కేంద్రంలో జరిగే ముఖ్యమైన సేవల్లో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఒకటి. కోయిల్‌ అనే తమిళ పదానికి ఆలయం అని అర్థం. ఆళ్వార్‌ అంటే విష్ణు భక్తుల్లో గొప్పవాడు. తిరుమంజనం అంటే అభిషేకం. ఆలయంలో జరిగే శుద్ధి కార్యక్రమమే అభిషేకంగా భావిస్తారిక్కడ. ఈ సేవ ఏడాదికి నాలుగుసార్లు జరుగుతుంది. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పండగలకు ముందు వచ్చే మంగళవారాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. గర్భాలయం మొదలుకుని, ప్రధానాలయం, ఉత్సవ మూర్తులు, స్వామి సేవకు ఉపయోగించే పాత్రలు, వస్తువులన్నిటినీ శుద్ధి చేస్తారు.
*కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగే రోజు తెల్లవారుజామున జరిగే సుప్రభాతం, తోమాల సేవ, అర్చన మొదటి గంటా నివేదన కార్యక్రమాలు యథాతధంగా జరుగుతాయి.
* అనంతరం గర్భాలయంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి మూలమూర్తి తలభాగం నుంచి పాదాల వరకు వస్త్రాన్ని కప్పుతారు. ఆ వస్త్రానికి మలై గుడారం అని పేరు. సేవ జరిగే సమయంలో స్వామివారిపై దుమ్ము, ధూళి వంటివి పడకుండా ఇలా చేస్తారు.
* కౌతుక బేరంగా ప్రసిద్ధి చెందిన భోగ శ్రీనివాసమూర్తి మినహా మిగిలిన ఉత్సవ మూర్తులు, సాలగ్రామాలను ఘంటా మండపంలోకి, దీపపు సెమ్మెలు, పాత్రలు, బంగారు చెంబులను బంగారు బావి వద్దకు, స్వామి వారి పవళింపు సేవ జరిగే మంచం, వెండి గొలుసులను విమాన ప్రదక్షిణ మార్గం దగ్గరకు తీసుకొస్తారు. భోగశ్రీనివాసమూర్తిని మూలమూర్తితో పాటు మలైగుడారంలో ఉంచుతారు.
* ఉత్సవ మూర్తులు, సాలగ్రామాల చుట్టూ తెరలను కట్టి ఘంటా మండపంలో అర్చక స్వాములు అభిషేకం చేస్తారు. బంగారు బావి వద్దకు తెచ్చిన సామగ్రిని చింతపండు వంటి వాటితో కడిగి శుభ్రపరుస్తారు.
* ఉత్సవ మూర్తులతో పాటు అభిషేకాన్ని అందుకున్న అనంత, గరుడ, విష్వక్సేన, సుగ్రీవ, హనుమంత, అంగదుల మూర్తులకు పట్టు వస్త్రాలను అలంకరిస్తారు. గర్భాలయంలోపల అర్చకులు, పరిచారకులు, ఏకాంగులు కులశేఖరపడి ముందున్న మిగిలిన ఆలయం, ఉపాలయాలు… ఇతర ప్రాంతాలను ఆలయ ఉద్యోగులు శుభ్రం చేసి శీకాయ నీళ్లతో కడుగుతారు. రంగనాయకులు మండపంలోని బంగారు, వెండి వాహనాలకు మెరుగులు పెడతారు.
*నామం కోపు, శ్రీచూర్ణం, గడ్డ కర్పూరం, కుంకుమ ఖచిలిగడ్డ, గంధంపొడి వంటివి నీటితో కలిపి లేహ్యంగా తయారు చేస్తారు. దానిపేరు పరిమళం. దీన్ని ముందు రోజు రాత్రే తయారు చేసి పెద్ద గంగాళాల్లో సిద్ధంగా ఉంచుకుంటారు. గర్భాలయంలో స్వామివారి పైభాగంలో అంటే పైకప్పునకు కట్టే మఖమల్‌ గుడ్డను కురాళం అని పిలుస్తారు. వీటిని తీసుకుని ధ్వజస్తంభానికి ప్రదక్షిణగా మంగళవాయిద్యాతో అధికారులు, జియ్యంగార్లు ఆలయంలోకి చేరి గర్భాలయంలోని అర్చకులకు అందిస్తారు. వారు కురాళాన్ని కట్టి, పరిమళాన్ని గర్భాలయంతో పాటు, ప్రధాన, ఉపాలయాలన్ని గోడలకు పూస్తారు. తర్వాత నేలనంతా నీటితో కడుగుతారు. తర్వాత ఉత్సవ మూర్తులు, పూజ సామగ్రిని ఆయా స్థానాలకు చేర్చుతారు.
*వాకిళ్లకు నూతన పరదాలను కడతారు. తర్వాత తెరలు వేసి మూలమూర్తిపై కప్పి ఉంచిన మలైగుడారాన్ని తీసేసి దీపారాధనలు వేసి ఉపచారాలను నిర్వహించి రెండోసారి గంటా నివేదన చేస్తారు.
*** ఆలయాలు అయిదు రకాలు
* స్వయం వ్యక్త క్షేత్రాలు- భగవంతుడే స్వయంగా అవతరించడాని భావించేవి
* దివ్య క్షేత్రాలు – దేవతులు ప్రతిష్ఠించినట్లుగా చెప్పేవి
* పురాణ క్షేత్రాలు – పురాణగాథల వల్ల ప్రసిద్ధి చెందినవి
* సిద్ధ క్షేత్రాలు – మహర్షులు, సిద్ధులు ఏర్పాటు చేసినవి
* మానుష క్షేత్రాలు – రాజులు, భక్తులు నిర్మించినవి.
వీటిలో మొదటి కోవకు చెందింది తిరుమల
మన సంస్కృతి ఆలయాన్ని ఒక దివ్య స్థలంగా చెబుతోంది. ఆలయంలోని అణువణువులో భగవంతుడి అంశ ఉందని చెబుతారు.
‘శిఖరం శీర్ష మిత్యాహుః గర్భగేహంగళం తథా మంటపం కుక్షిరిత్యాహుః
ప్రాకారం జానుజంఘయోః గోపురం పాదమిత్యాహుః ధ్వజోజీవస్సముచ్యతే!’
విమాన గోపురం స్వామి శిరస్సు అనీ, గర్భాలయం కంఠంగా, ప్రాకారం కాళ్లుగా, ప్రధాన గోపురం పాదాలుగా, ధ్వజస్తంభం స్వామి జీవ స్ధానంగా భావిస్తారు.