Agriculture

కారుణ్యమరణానికి దరఖాస్తు చేసుకున్న అమరావతి రైతులు

AP Capital Amaravathi Farmers Applies For Euthanasia

రాజధాని పోరాటంలో రైతులు మరో ముందడుగు వేశారు. కారుణ్యమరణానికి అనుమతివ్వాలని కోరుతూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు లేఖలు రాశారు. రాజధాని అంశంలో మోసపోయినందున తమకు చనిపోయే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం మూడు రాజధానుల నిర్ణయంతో ఉన్న పళంగా రోడ్డున పడ్డామని రైతులు తమ లేఖల్లో ఆవేదన వ్యక్తం చేశారు. మా గోడు వినిపించుకునే వారే లేరని, పోలీసులు తమపై హత్యాయత్నం కేసులు నమోదు చేస్తున్నారని అందులో పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మాటమార్చారని రైతులు వాపోయారు. ‘మా త్యాగాన్ని అధికార పార్టీ నేతలు హేళన చేస్తున్నారు. ప్రభుత్వ వైఖరితో మా పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. కుటుంబాలతో కలిసి 14 రోజులుగా ఆందోళనలు చేస్తున్నా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా శ్మశానం, ఎడారి అంటూ వైకాపా నేతలు మాట్లాడుతున్నారు. ఆ పార్టీ నేతలను ప్రశ్నించే వారిపై దాడులకు దిగుతున్నారు. అండగా నిలవాల్సిన ప్రభుత్వమే మాపై కక్ష కట్టింది’ అంటూ లేఖలో తమ గోడు వెల్లబోసుకున్నారు. సీఎం, కొందరి స్వలాభం కోసమే రాజధానిని విశాఖకు తరలించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రాజధాని తరలిపోతే మేం జీవచ్ఛవాలుగా మిగిలిపోతామని చెబుతూ.. ఈ బతుకులు మాకొద్దు, మరణమే శరణ్యమని రాష్ట్రపతికి లేఖ రాశారు.