Editorials

ఒరేయ్ బావా..జగ్గూ భాయి కోడిపందేలు వేయనిస్తారా?-TNI ప్రత్యేకం

Will Jagan Grants Permission For 2020 Cock Fights

సంక్రాంతి వస్తోంది…దెం రాయుళ్ళలో సందడి పురివిప్పుతోంది. కోడిపందేల కోసం బరులు సిద్ధం చేసేపనిలో వారు తలమునకలయ్యారు. పందెం కోళ్ళను బరిలోకి దింపడానికి పందెం రాయుళ్ళు సిద్ధమవుతున్నారు. కోడిపుంజులకు బాదం, పిస్తా, జీడిపప్పులతో తెగమేతేస్తున్నారు. కత్తులు కట్టేవారు వాటికి సానలు పెడుతున్నారు. కోడిపందేలకు అనుబంధంగా కోతముక్క ఆడే జూదగాళ్ళు కూడా అవసరమైన సామగ్రిని సమకూర్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఈ సారి కోడిపందేల్లో మందు విక్రయాలు ఉండకపోవచ్చని మద్యం ప్రియులు తెగ బాధపడుతున్నారు. దీనికి కారణం ఏపీలో మద్యం విక్రయాలను ప్రభుత్వమే నిర్వహిస్తోంది. మరొక పక్క నాటుసారా గుప్పుమంటోంది. చాటుమాటుగా కోడిపందేల్లో నాటుసారా విక్రయాలకు తయారీదారులు సిద్ధమవుతున్నారు.

*** గత రెండేళ్లలో వేలాది కోట్లు దోపిడీ
గత రెండేళ్లలో అప్పటి తెలుగుదేశం నేతలు కోడిపందెల పేరుతో కోట్లాది రూపాయలు అమాయకుల నుండి దోచుకుతిన్నారు. కోడిపందేల పేరుతో దండుకు తిన్నారు. కొందరి నేతలు కోతముక్క, మరికొందరు మద్యం విక్రయాలతో విచ్చలవిడిగా సొమ్ములు దండుకున్నారు. కోడిపందేలకు అనుమతులు ఇస్తే తెలుగుదేశం ప్రభుత్వానికి భారీగా ఓట్లు పడతాయని చంద్రబాబు కలగన్నారు. సీన్ రివర్స్ అయ్యింది. పందేల్లో, జూదాల్లో డబ్బులు పోగొట్టుకున్న వారు చంద్రబాబును ఛీఛీ అన్నారు. హైకోర్టు కోడిపందేలు వేయవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ, ఆ ఆదేశాలను భేఖాతరు చేస్తూ ప్రభుత్వం అనధికారికంగా కోడిపందేలకు అనుమతులు ఇచ్చింది. ప్రతి మండల కేంద్రంలోనూ, పెద్ద గ్రామాల్లోనూ పెద్ద ఎత్తున కోడిపందేలు వేసి లక్షల్లో జేబులు గుల్ల చేసుకున్నవారు చాలామంది ఉన్నారు. ఈ పందేలకు, జూదాలకు చాలా కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి.

*** జగన్ కోడిపందేలకు అనుమతి ఇస్తారా?
ప్రస్తుతం చిత్తూరు నుండి శ్రీకాకుళం వరకు అందరి నోటి వెంట ఇదే మాట. జగన్ కోడిపందేలకు అనుమతి ఇస్తారా? చంద్రబాబు బాటలో నడుస్తారా? చూచిచూడనట్లు ఊరుకుంటారా. కేసీఆర్ లాగా పూర్తిగా పందేలను, జూదాలను బంద్ చేయిస్తారా? అనే విషయం అంతుబట్టక జూదగాళ్ళు తలలు పట్టుకుంటున్నారు. పోరుగునే ఉన్న తెలంగాణాలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన అనంతరం కోడిపందేలపైన, జూదం పైన ఉక్కుపాదం మోపారు. ఆంధ్రాలో గత రెండేళ్ళ నుండి విచ్చలవిడిగా కోడిపందేలు జరిగినప్పటికీ కేసీఆర్ మాత్రం కోడిపందేల విషయంలో కఠినంగా వ్యవహరించారు. రాష్ట్రంలో ఎక్కడా జూదం కూడా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి అక్కడి ప్రజల చేత శెభాష్ అనిపించుకున్నారు.

*** క్లబ్బులను మూయించిన జగన్ ..కోడిపందేలకు అనుమతి ఇస్తారా?
ముఖ్యమంత్రి జగన్ వైఖరి తెలిసినవాళ్ళు ఈ ఏడాది నూటికి నూరుపాళ్ళు కోడిపందేలు ఉండవని భావిస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రి అవగానే క్లబ్బుల్లో జూదాన్ని నిషేదించారు. విజయవాడ, గుంటూరు వంటి నగరాలతో పాటు చిత్తూరు నుండి శ్రీకాకుళం వరకు ఉన్న అన్ని క్లాబ్బులలో జూదాన్ని మూసివేశారు. చాలామంది పెద్దలు లాబీయింగ్ చేసినప్పటికీ జగన్ ఈ విషయంలో కఠినంగానే వ్యవహరించారు. కోడిపందేల విషయంలోనూ జగన్ ఇదే వైఖరిని అవలంబిస్తారని ఆయన మనస్తత్వాన్ని తెలిసినవారు అంటున్నారు. అయినప్పటికీ కోడిపందేలు వేసే పెద్దలు మాత్రం పెద్ద ఎత్తున సిఎం కార్యాలయంలో పందేలకు అనుమతుల కోసం లాబీయింగ్ చేస్తున్నారు. ఈ లాబీయింగ్ కు జగన్ తలవంచుతారా? లేక కోడిపందేలపై ఉక్కుపాదం మోపుతారా? అనే విషయం సంక్రాంతి పండుగ రెండురోజుల ముందు వెల్లడి కానున్నది. —కిలారు ముద్దుకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్.