Politics

పృథ్వీరాజ్‌ను తప్పించిన జగన్

PrithviRaj Made To Resign To SVBC Chairman Post

ఎస్వీబీసీ ఛైర్మన్‌ పృథ్వీరాజ్‌ ఓ మహిళతో అసభ్యంగా మాట్లాడినట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో తితిదే ఆయనపై చర్యలు చేపట్టింది. ఆ పదవి నుంచి తప్పుకోవాలని తితిదే ఛైర్మన్‌ వై వీ సుబ్బారెడ్డి ఆదేశించినట్లు సమాచారం. ఆడియో టేప్‌ వ్యవహారాన్ని సుబ్బారెడ్డి.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి తెలియజేయగా.. ఆయన ఆదేశాల మేరకు తితిదే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ విషయమై తితిదే విజిలెన్స్‌ విచారణకు ఆదేశించింది. ఆడియో టేప్‌లోని వాయిస్‌ శాంపిల్స్‌ను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపి పూర్తి స్థాయిలో విచారణకు చర్యలు చేపట్టింది. అంతకుముందు ఈ వ్యవహారంపై పృథ్వీరాజ్‌ స్పందిస్తూ.. ఓ వీడియోను విడుదల చేసి వివరణ ఇచ్చారు. తితిదే ఉద్యోగినితో మాట్లాడినట్లు సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఆడియోలోని వాయిస్‌ తనది కాదన్నారు. తన వ్యాఖ్యలపై విజిలెన్స్‌ దర్యాప్తు చేపట్టి తప్పుంటే శిక్షించాలన్నారు. లేనిపోని ఆరోపణలు సృష్టించి తన కుటుంబం ముందు తలదించుకునే పరిస్థితిని తీసుకొచ్చారని పృథ్వీరాజ్‌ అన్నారు. తనపై కక్షతోనే ఈ పనిచేశారని.. ఎవరు చేశారో, ఎందుకు చేశారో భగవంతుడికే తెలియాలని పృథ్వీ వ్యాఖ్యానించారు. ఈ వివాదాన్ని వైకాపా పెద్దలకు వివరించానన్నారు.