Agriculture

పశువులకు నిల్వ నీళ్లు ఇవ్వకండి

Feb 2020 Telugu Agriculture News-Do not feed stored water to cattle

శీతాకాలంలో పశువులకు నిల్వ నీళ్లివ్వవద్దు
వేసవిలోలాగానే, శీతాకాలంలో కూడా పశువులు కొంత ఇబ్బందికర వాతావరణాన్ని ఎదుర్కొంటాయి. సాధారణంగా పశువులు తమ శరీర ఉష్ణోగ్రతను 101 డిగ్రీల ఫారెన్‌ హీట్‌గా సరిచేసుకుంటూ జీర్ణప్రక్రియను కొనసాగిస్తూ ఉంటాయి. మెటబాలిజమ్‌ ద్వారా ఉత్పత్తి అయ్యే వేడిని వేసవిలో చెమటద్వారా, శీతాకాలంలో మూత్రం ద్వారా బయటకు పంపుతాయి. ఈ వేడిని బయటకు పంపే ప్రక్రియ పశువు పరిసర వాతావరణాన్ని బట్టి ఉంటుంది. వేసవిలో ఎక్కువ వేడి శరీరంలో ఉన్న పక్షంలో వడదెబ్బ తగలడం, అలానే శరీరంలో శీతాకాలంలో సరిౖయెన వేడి శరీరంలో లేనప్పుడు పశువు శీతలపు వత్తిడిని చవిచూస్తుంది. దీనినే ‘కోల్డ్‌ స్ట్రెస్‌’ అంటారు.
***దీని నివారణకు కొన్ని సూచనలు:
1 బాగా చల్లగా ఉన్న నీటిని పశువులకు అందించరాదు. దీనికి నివారణగా నిల్వ ఉన్న వాటిని కాకుండా, తాజా బోర్‌వెల్‌ నుంచి వచ్చిన నీటిని పశువులకు అందించాలి. నిల్వ ఉన్న నీరు ఎక్కువ చల్లగా ఉంటుంది.
2 బయట వాతావరణం చల్లగా ఉంటే, ఎక్కువ వేడి శరీరం నుంచి బయటకు పశువు వదులుకోవాల్సి వస్తుంది. అందుచేత ఎక్కువగా వేడిని ఉత్పత్తి చేసే మేపు పదార్ధాలను పశువులకు అందించాలి. ఎండుమేత వంటి వాటిని పశువుకు ఎక్కువగా అందించాలి. దాణా పదార్థాలకంటే ఇవి మేలు.
3 పశువుల షెడ్లకు ఉన్న అన్ని ద్వారాలు మూయకూడదు. గాలి, వెలుతురు తగ్గిపోయి, షెడ్లలో తేమ వాతావరణం ఏర్పడుతుంది.
4 చల్లగాలుల నుంచి పశువులను కాపాడాలి. షెడ్లలో సూర్యరశ్మి పడేటట్లు చూడాలి.
5 వీలయితే పశువులకు వరిగడ్డితో వెచ్చదనం కోసం ఒక బెడ్డును ఏర్పాటు చేయాలి. వీటిని పొడిగా ఉంచడం అవసరం.
6 సాధ్యమయినంత వరకు పశువులకు గోరువెచ్చటి నీటిని అందించగలిగితే మంచిది. శీతాకాలంలో నీటిని పశువు తక్కువగా తాగినట్లయితే, మేత ద్వారా లభ్యమయ్యే ఘన పదార్ధాన్ని తక్కువగా మేయడం, తద్వారా పాల దిగుబడి తగ్గిపోవడం జరుగుతుంది.
7 వయస్సు మళ్లిన పశువులు, దూడలు, వ్యాధి బారిన పడిన పశువులు ఎక్కువగా ఈ కోల్డ్‌ స్ట్రెస్‌ బారిన పడుతుంటాయి. వీటిని జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది.
8 పాలు తీసిన తర్వాత పశువుల చనులను శుభ్రంగా తుడిచి, ఆరబెట్టి మందలోకి వదలాలి. లేకపోతే ‘ఫ్రాస్ట్‌ బైట్‌’ అనే పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా శీతాకాలంలో కొన్ని సూచనలు పాటించవలసిన అవసరముంది.