ScienceAndTech

కొరోనా ప్రకటనలపై ఫేస్‌బుక్ నిషేధం

Facebook Going Strict On Corona Virus Fake Ads

ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్న కోవిడ్‌-19 (కరోనావైరస్‌) కు సంబంధించిన తప్పుడు ప్రకటనలు వైరల్‌ అవుతున్న నేపథ్యంలో.. వీటిపై సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ స్పందించింది. కోవిడ్‌-19 (కరోనావైరస్‌) పై తప్పుడు సమాచారాన్నిస్తున్న ప్రకటనలను నిషేధించినట్టుగా ఫేస్‌బుక్‌ ప్రకటించింది. తప్పుడు యాడ్స్‌ డిస్‌ ప్లే చేసే ఫేస్‌బుక్‌, వీడియో షేరింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లను నిశితంగా పరిశీలిస్తున్నట్టు తెలిపింది. ప్రజలను తప్పుదోవ పట్టించే ఇలాంటి సమాచారం, ప్రకటనలు ఈ వైరస్‌పై చేస్తున్న పోరాటంపై ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయని ఫేస్‌బుక్‌ పేర్కొంది. ఉదాహరణకు వైరస్‌ వ్యాప్తిని నివారించడానికి ఫేస్‌ మాస్క్‌లు 100 శాతం ఉపయోగడతాయి లాంటి సందేహాస్పదమైన ప్రకటనలను అనుమతించబోమని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ప్లాట్‌ఫాంపై ఇలాంటి ప్రకటనలను తొలగించే ప్రక్రియను జనవరి 31 నుంచే ప్రారంభించామని, ఫేస్‌బుక్‌ న్యూస్‌ ఫీడ్‌పై కనిపించే ప్రతి తప్పుడు సమాచారాన్ని సోషల్‌ ఫ్యాక్ట్‌ చెకర్స్‌ ద్వారా గుర్తిస్తున్నామని అన్నారు. కరోనా వైరస్‌ సంబంధిత యాడ్స్‌ పై ఇటీవల తీసుకొచ్చిన కొత్త పాలసీ ప్రకారం.. ప్రజలను తప్పుదారి పట్టించే అన్ని ప్రకటనలను నిరోధిస్తామన్నారు. ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్లకు పైగా వినియోగదారులను కలిగి ఉన్న ఫేస్‌బుక్‌ ఈ తాజా నిర్ణయాన్ని వెల్లడించింది.