Business

యెస్‌బ్యాంకు భవిష్యత్తు ఏమిటి?

Reserve Bank Sanctions On YES Bank Puts Share In Stress

ఓ పక్క కరోనావైరస్‌ భయాలు మార్కెట్లను ముంచేస్తుంటే.. ఇప్పుడు యెస్‌బ్యాంక్‌ వ్యవహారం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ బ్యాంక్‌ షేరు నేడు ఒక దశలో రూ.9.65 వద్దకు చేరుకొంది. ఉదయం 11.58 గంటల సమయంలో 60శాతం నష్టంతో రూ.14.70 వద్ద ట్రేడవుతోంది. ఈ క్రమంలో 52వారాల అత్యల్పస్థాయిని దాటుకొని భారీగా విలువ కోల్పోయింది. యెస్‌ బ్యాంకుపై మారటోరియం విధిస్తూ గురువారం రాత్రి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆదేశాలు జారీ చేయడం దీనికి ప్రధాన కారణంగా నిలిచింది.  నెలకు రూ.50,000 మాత్రమే ఒక్కో ఖాతా నుంచి నగదు ఉపసంహరణకు వీలుంటుందని తెలిపింది. అదే సమయంలో తక్షణం యెస్‌ బ్యాంకు బోర్డును రద్దు చేసింది. అడ్మినిస్ట్రేటర్‌గా ఎస్‌బీఐ మాజీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ ప్రశాంత్‌ కుమార్‌ను నియమించింది. మరోపక్క అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ జేపీ మోర్గాన్‌ యెస్‌ బ్యాంకు షేరు లక్ష్యాన్ని రూ.1గా అంచనా కట్టింది. డిపాజిట్ల నష్టాలు, ఒత్తిడిలో ఉన్న రుణ పుస్తకానికి సంబంధించిన నష్టభయాల కారణంగా బ్యాంకులో వాటాను దాదాపు సున్నా విలువతో ఇన్వెస్టర్లు కొంటారని అది అంచనా కట్టింది. ఇవన్ని ఇన్వెస్టర్ల భయాన్ని పెంచేశాయి. ఫలితంగా విక్రయాలకు పాల్పడుతున్నారు.  ఆర్‌బీఐ ఈ బ్యాంక్‌ నుంచి నగదు విత్‌డ్రాపై ఆంక్షలు విధించడంతో డిపాజిటర్లు నెట్‌బ్యాంకిగ్‌ను ఆశ్రయించారు. దీంతో ఒక్కసారిగా ట్రాఫిక్‌ పెరిగిపోవడంతో ఈ బ్యాంక్‌ సర్వర్లు పనిచేయడంలేదు. చివరికి ఖాతాల్లో బ్యాలెన్స్‌ చూసుకోవడానికి కూడా కొంత ఇబ్బంది పడుతున్నారు. భారీ నెట్‌ట్రాఫిక్‌ కారణంగా పనిచేయడంలేదనే సందేశం దర్శనమిస్తోంది. యూపీఐ ద్వారా నిధుల బదలాయింపుల్లో కూడా సమస్యలు వస్తున్నాయి. దీనికి యెస్‌బ్యాంక్‌ కూడా ట్విటర్‌లో స్పందించింది. నెట్‌బ్యాంకిగ్‌లో కొన్ని సమస్యలు ఉన్నాయని.. కొద్దిసేపటి తర్వాత ప్రయత్నించండి అని వినియోగదారులను అభ్యర్థిస్తూ ట్వీట్‌ చేసింది.