Health

నెల్లూరు వ్యక్తికి కొరోనా పరీక్షలు-TNI ప్రత్యేక కథనాలు

Corona Tests On Nellore Man-TNILIVE Coronavirus Special Stories

* ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరుకు వ్యాపించింది. ఇక్కడి చిన్నబజారుకు చెందిన వ్యక్తి, జ్వరం, జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతూ ఉండటంతో, అతని కుటుంబీకులు ఆసుపత్రికి తరలించారు. కరోనా వ్యాధి లక్షణాలు అతనిలో ఉండటంతో ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులో ఉంచిన వైద్యులు చికిత్సను ప్రారంభించారు. అతని కుటుంబీకులను కూడా అదే వార్డులోని ప్రత్యేక గదిలో ఉంచి, పరిశీలిస్తున్నారు.కాగా, ఇతను మూడు రోజుల క్రితం ఇటలీ నుంచి నెల్లూరుకు వచ్చాడు. ఎయిర్ పోర్టులో దిగిన సమయంలో థర్మల్ స్క్రీనింగ్ లో ఎటువంటి జ్వర లక్షణాలూ లేకపోవడంతో బయటకు పంపినట్టు తెలుస్తోంది. ఇంటికి రాగానే కరోనా లక్షణాలు ఇతనిలో బయట పడ్డాయి.

* కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఇరాన్ దేశంలో చిక్కుకుపోయిన 58 మంది భారతీయులను మంగళవారం ఉదయం భారతవాయుసేన ప్రత్యేక విమానంలో హిండన్ వాయుసేన కేంద్రానికి తీసుకువచ్చారు.భారత వాయుసేనకు చెందిన సి-17 విమానంలో ఇరాన్ దేశ రాజధాని నగరమైన టెహరాన్‌లోని విమానాశ్రయం నుంచి 58 మంది భారతీయులను హిండోన్ వాయుసేన కేంద్రానికి తీసుకువచ్చినట్లు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ చెప్పారు.ఇరాన్ దేశంలో కరోనా వైరస్ ప్రబలుతున్నందున టెహరాన్ లోని భారత రాయబార కార్యాలయం అధికారులు, ఇరాన్ అధికారుల సహకారంతో 58 మంది భారతీయులను వాయుసేన విమానంలో తీసుకువచ్చారు.వాయుసేన విమానంలో ప్రత్యేకంగా నలుగురు వైద్యులను కూడా పంపించారు.

* కరోనా వైరస్‌ పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం కోసం పంజాబ్‌ ప్రభుత్వం తాజాగా కోవా పంజాబ్‌ COVA PUNJAB పేరిట ఓ నూతన మొబైల్‌ యాప్‌ను లాంచ్‌ చేసింది. COVA అంటే Corona Virus Alert  అని అర్థం వస్తుంది. ప్రజల్లో కరోనా వైరస్‌పై అవగాహన కల్పించేందుకు, ఆ వైరస్‌ బారిన పడకుండా వారికి తగిన జాగ్రత్తలను తెలియజేసేందుకే ఈ యాప్‌ను లాంచ్‌ చేశామని పంజాబ్‌ అడిషనల్‌ చీఫ్‌ సెక్రటరీ వినీ మహాజన్‌ వెల్లడించారు. కోవా పంజాబ్‌ యాప్‌ ఆండ్రాయిడ్‌ ప్లే స్టోర్‌, ఐఓఎస్‌ యాప్‌ స్టోర్‌లలో అందుబాటులో ఉందని, దాన్ని డౌన్‌లోడ్‌ చేసుకుని ఫోన్లలో ఇన్‌స్టాల్‌ చేసుకుంటే. కరోనా వైరస్‌ గురించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని, ఆ వైరస్‌ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకోవచ్చని వినీ మహాజన్‌ తెలిపారు.

* కేరళలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.సీఎం పినరయి విజయన్‌ అధ్యక్షతన ఇవాళ ఉన్నతాధికారుల సమావేశం జరిగింది.జనాలు రద్దీగా ఉండే ప్రాంతాలపై దృష్టి సారించాలని అధికారులను సీఎం ఆదేశించారు.మార్చి 31వ తేదీ వరకు కేరళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సినిమా థియేటర్లను మూసివేయాలని నిర్ణయించారు.పెళ్లిళ్లకు కూడా దగ్గరి బంధువులు మాత్రమే హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఫంక్షన్లతో పాటు ఇతర కార్యక్రమాలను వాయిదా వేసుకోవాలని సీఎం చెప్పారు. 

* రాష్ట్రవ్యాప్తంగా రేపు, ఎల్లుండి ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు.కరోనా వైరస్‌ అనుమానిత కేసుల దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.స్వదేశానికి వచ్చిన ప్రయాణికుల వివరాలు సేకరించనున్నారు.ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలతో వైద్యశాఖ ‌అధికారులు సమీక్ష నిర్వహించారు.సరైన వివరాలు లేకపోవడం వల్ల ఇంటింటి సర్వే చేయాలని సర్కారు నిర్ణయించింది.

* బెంగళూరులో కొత్తగా 4 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి బి.శ్రీరాములు మంగళవారం వెల్లడించారు.ప్రస్తుతం కర్ణాటకలో కోవిడ్‌-19 నలుగురికి ఉన్నట్లు నిర్దారించామని, వారిని, వారి కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా ఉంచి వారి ఆరోగ్య స్థితిని పర్యవేక్షిస్తున్నామని ఆయన తెలిపారు. 

* ఏపీలో ఇప్పటి వరకు ఒక్క ‘కోవిడ్‌-19’ పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డికోవిడ్‌-19 ప్రభావిత దేశాల నుంచి ఏపీకి వచ్చిన 466 మంది ప్రయాణికులు వైద్యుల పరిశీలనలో ఉన్నారన్నారు.

* కరోనా వైరస్‌ భయంతో ఇప్పటికే దేశంలోని అన్ని రాష్ట్రాలు ముందుజాగ్రత్త చర్యలు చేపడుతున్నాయి.మయన్మార్‌తో ఉన్న అంతర్జాతీయ సరిహద్దును మూసివేస్తూ మణిపూర్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.సరిహద్దు ద్వారా విదేశీయుల రాకపోకలపై పూర్తి నిషేధం విధించింది.

* కరోనా వైరస్ ఉద్భవించిన వూహాన్ నగరంలో మొట్టమొదటిసారి మంగళవారం చైనా దేశ అధ్యక్షుడు జిన్ పింగ్ పర్యటించారు.గత ఏడాది హుబే ప్రావిన్సు పరిధిలోని వూహాన్ నగరంలో కరోనా వైరస్ ఉద్భవించింది.కరోనా వైరస్ నియంత్రణకు వైద్యాధికారులు తీసుకున్న చర్యలను జిన్‌పింగ్ పరిశీలించారు.ఈ వైరస్ నియంత్రణ కోసం శ్రమించిన వైద్యఆరోగ్యశాఖ కార్యకర్తలు, మిలటరీ అధికారులు, సైనికులు, కమ్యూనిటీ వర్కర్లు, పోలీసు అధికారులు, అధికారులు, వాలంటీర్లు, కరోనా వైరస్ రోగులు, వూహాన్ వాసులను జిన్ పింగ్ ప్రశంసించారు.జిన్ పింగ్ వెంట కమ్యూనిస్టు పార్టీ చైనా సెంట్రల్ కమిటీ సభ్యులు, సెంట్రల్ మిలటరీ కమిషన్ ఛైర్మన్ తదితరులున్నారు.

* కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమైన విషయం విదితమే.అయితే ఓ పూజారి మాత్రం ఏకంగా శివలింగానికి మాస్క్‌ వేశారు.శివలింగాన్ని ఎవరూ తాకొద్దని భక్తులకు పూజారి విజ్ఞప్తి చేశారు.దేవుడికి కరోనా వైరస్‌ సోకుతుందనే భయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పూజారి తెలిపారు.ఈ సంఘటన యూపీ వారణాసిలోని ఓ ఆలయంలో చోటు చేసుకుంది.కరోనా వైరస్‌పై అవగాహన కల్పించేందుకే శివలింగానికి మాస్క్‌ వేశామని పూజారి కృష్ణ ఆనంద్‌ పాండే స్పష్టం చేశారు.ఇక ఆలయానికి వచ్చే భక్తులు కూడా మాస్క్‌లు ధరించి వస్తున్నారు.